గుజరాత్ గుంజాటన: ఆ 2 ఓట్లు పక్కా?
- చివరి నిమిషంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన ఎన్సీపీ
- అమిత్ షాకు షాక్ తప్పదన్న కాంగ్రెస్ నేతలు
- కానీ, ఆ రెండు ఓట్లూ బీజేపీకే పడ్డాయన్న సీఎం రూపానీ
- తీవ్ర ఉత్కంఠభరితంగా రాజ్యసభ ఎన్నికలు
అహ్మదాబాద్: గుజరాత్ గుంజాటన మరిత ఉత్కంఠగా మారింది. రాజ్యసభలో స్థానం కోసం జరుగుతోన్న రాజకీయ పోటీ నిమిషనికో మలుపు తిరుగుతోంది. ఏ పార్టీ వాళ్లు వాళ్ల అభ్యర్థికే ఓటు వేస్తారో లేదో ఊహించని పరిస్థితిలో మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది.
గుజరాత్ అసెంబ్లీలో ఇద్దరు సభ్యులున్న ఎన్సీపీ.. అర్థరాత్రి వరకూ ఊగిసలాడి, కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కే ఓటేస్తామని మంగళవారం ఉదయం ప్రకటించింది. ఆమేరకు విప్ కూడా జారీ చేసింది. జేడీయూ(1) తోపాటు ఎన్సీపీ(2) మద్దతు దక్కడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. అహ్మద్ పటేల్ గెలుపుతో అమిత్ షాకు షాక్ తగలడం ఖాయమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
అయితే, ఆ ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేల ఓట్లు బీజేపీకే పడ్డాయని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రెస్‌మీట్‌లో చెప్పడం మరింత గందరగోళానికి దారితీసింది. ఇక ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరిన మాజీ సీఎం శంకర్‌సింన్హ్ వాఘేలా.. గత ప్రకటనకు భిన్నంగా తాను కాంగ్రెస్‌కు ఓటేయలేదని బహిరంగంగా చెప్పేశారు.
గుజరాత్‌లో మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్‌లు, కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్‌లు బరిలో ఉన్నారు. సంఖ్యాబలాన్ని బట్టి బీజేపీకి రెండు సీట్లు(స్మృతి, అమిత్ షాల గెలుపు) పక్కా. ఇక మిగిలిన 31 మంది ఎమ్మెల్యే బలంతో మూడో స్థానంలోనూ గెలవాలనుకున్న బీజేపీ.. బల్వంత్ రాజ్‌పుత్‌ను కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్‌పై పోటీగా నిలిపింది. అవసరమైన 14 ఓట్లను ఇతర పార్టీలను చీల్చి రాబట్టాలనుకుంది.
కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయానికి 45 మంది ఎమ్మెల్యేలు అవసరం. కానీ బెంగళూరు రిసార్ట్స్ నుంచి అహ్మదాబాద్‌కు ఓటేయడానికి వచ్చిన వారి సంఖ్య 44 మాత్రమే! ఇద్దరు ఎన్సీపీ సభ్యుల మద్దతు కూడా కలుపుకొంటే 46 ఓట్లతో పటేల్ గెలుపు ఖాయం కావాలి. కానీ 44 మందిలో అందరికి అందరూ సొంత పార్టీ అభ్యర్థికే ఓటేశారో, లేక క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారో ఫలితాలనాడు తేలుతుంది.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 176 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 121, కాంగ్రెస్‌కు 57 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 51కి పడిపోయింది. వాఘేలా వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. దీంతో మిగిలిన 44 మంది ఎమ్మెల్యేల్ని రక్షించుకునేందుకు వారిని బెంగళూరు రిసార్టుకు తరలించిన సంగతి తెలిసిందే.