ఎన్నికల ఫలితాలు: బీజేపీకి 2, కాంగ్రెస్‌కు 1
అహ్మదాబాద్: గుజరాత్‌లో మూడు రాజ్యసభ స్థానాల కోసం జరిగిన ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరికి వెల్లడైన ఫలితాల్లో బీజేపీ రెండు స్థానాల్లో నెగ్గగా, అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయం సాధించారు. అహ్మద్ పటేల్ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలలో మునిగితేలాయి.
బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీలు నెగ్గగా, బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్ మాత్రం ఓటమి పాలయ్యారు. అమిత్‌షాకు 46 ఓట్లు, స్మృతీ ఇరానీకి 45 ఓట్లు, అహ్మద్ పటేల్‌కు మ్యాజిక్ ఫిగర్ అయిన 44 ఓట్లు పోలవ్వగా, బల్వంత్ సిన్హ్ రాజ్‌పుత్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు.
అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 176 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపర్ చూపిస్తూ ఓటేయగా వివాదం మొదలైంది. కాంగ్రెస్ ఫిర్యాదుతో వీరిద్దరి ఓట్లను రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించగానే లెక్కింపు ప్ర్రక్రియ మొదలైంది. దీంతో ఓట్ల సంఖ్య 174కు పడిపోయింది. బీజేపీకి 121, కాంగ్రెస్‌కు 57 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 51కి పడిపోగా.. వాఘేలా వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కు దూరంగా ఉండటంతో సంఖ్య 44 గా మారింది. ఈ ఓట్లన్నీ సొంతం చేసుకోవడంతో అహ్మద్ పటేల్ ఐదోసారి ఎన్నికైనట్లయింది.