ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 15 కోట్లు!
తమ ఎమ్మెల్యేలను బీజేపీ మభ్యపెడుతోందని కాంగ్రెస్ ఆరోపణలు
సాక్షి, బెంగళూరు/దొడ్డబళ్లాపురం: బీజేపీ వల నుంచి తమ గుజరాత్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బెంగళూరుకు తరలించామని కాంగ్రెస్ నేతలు ఆదివారం చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి పోటీచేస్తున్న తమ అభ్యర్థి అహ్మద్ పటేల్‌ను ఓడించేందుకు బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార బీజేపీలోకి చేర్చుకునేందుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు వల వేస్తున్నారన్నారనీ.. ఐటీ, సీబీఐ దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 44 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు శివార్లలోని ఈగల్‌టన్ రిసార్ట్‌కు తరలించడం తెలిసిందే.
ఇక్కడ తమ ప్రభుత్వం ఉండడంతో వారిని భద్రంగా కాపాడుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఎమ్మెల్యేల వసతి బాధ్యతలను కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు. డీకే శివకుమార్ ఆదివారం ఈగల్‌టన్ రిసార్ట్ సమీపంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలందరినీ మీడియాకు చూపించారు. తాము ఎమ్మెల్యేలను బంధించలేదనీ, వారి ఫోన్లను లాక్కోలేదని ఆయన చెప్పారు. తమ ఎమ్మెల్యేల హత్యకు కూడా బీజేపీ పథకం పన్నిన సమాచారం అందడంతో వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు.