రాష్ట్ర రాజకీయాల్లోనే
- కేంద్ర మంత్రి వర్గంలో చేరను : మోడీకి లేఖ
- రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి
- మీ సలహా మేరకే ఈ నిర్ణయం
- రాష్ర్టంలో పార్టీని అధికారంలోకితేవడమే ఇక లక్ష్యం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శివమొగ్గ నియోజక వర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రి వర్గంలో చేరకూడదని నిర్ణయించారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి తన సేవలను అందించడానికి సిద్ధమని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఢిల్లీకి వెళ్లిన యడ్యూరప్ప మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
కర్ణాటక భవన్ పక్కనే ఉన్న గుజరాత్ భవన్‌లో బస చేసిన మోడీ వద్దకు వెళ్లి, తన మనోగతాన్ని వెల్లడించారు. అయితే మోడీ మంత్రి పదవి కన్నా కర్ణాటకలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా సూచించారు. మంత్రి పదవిలో ఏముంటుందని తేలికగా తీసి పారేశారు. పైగా దక్షిణాదిలో సైతం బీజేపీకి అనూహ్య స్పందన లభించడంతో పార్టీని పటిష్టం చేయడానికి ఇదే సరైన తరుణమని సూచించారు. ఈ దిశగా ఆలోచించాలని హితవు పలికారు.
అనంతరం బెంగళూరుకు తిరిగి వచ్చిన యడ్యూరప్ప ఢిల్లీ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాల్లోనే రాణించగలమనే నిర్ధారణకు వచ్చారు. అవసరమైతే తన సన్నిహితురాలు శోభా కరంద్లాజెకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీని కోరారు. దీనిపై శోభా ఉడిపిలో స్పందిస్తూ, తనకు కేంద్ర మంత్రి కావాలనే అత్యాశ లేదని అన్నారు. పార్టీలో తన కన్నా ఎందరో సీనియర్లు ఉన్నారని, కనుక ఆ పదవులు వారికే దక్కాలని అభిప్రాయపడ్డారు.
మోడీకి అప్ప లేఖ
రాష్ర్టంలో మరో సారి బీజేపీ అధికారంలోకి తీసు కు రావడంలో భాగంగా పార్టీ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమేనని యడ్యూరప్ప మోడీకి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయనకు లేఖ రాశారు. ‘మీ సలహా మేరకు బీజేపీని రాష్ర్టంలో బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్ రహిత కర్ణాటకగా మార్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. మొన్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మీ ప్రసంగంతో ప్రభావితుడినయ్యాను.
కనుక కేంద్ర మంత్రి పదవిపై ఆశ వదులుకుని రాష్ట్రంలో పార్టీని సంఘటిత పరుస్తాను. ఎవరి సహాయం, అవసరం లేకుండానే పార్టీని సొంతం గా అధికారంలోకి తీసుకు రావడానికి నా అనుభవాన్నంతా ధారపోస్తాను. పదవుల కంటే కర్తవ్యం ముఖ్యమని గ్రహించాను. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకు రావాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తాను. పరస్పర సహకారం ఇలాగే కొనసాగనీయండి’ అని లేఖలో పేర్కొన్నారు.