మోడీ, యడ్డి జోడీతో కమల వికాసం
- 12 స్థానాల్లో గెలిచే అవకాశం
- అభ్యర్థుల జాబితా దాదాపు సిద్ధం
- బళ్లారి, రాయచూరు స్థానాలు పెండింగ్
- శ్రీరాములు స్పందన కోసం ఎదురు చూపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోజురోజుకు బీజేపీ పుంజుకుంటున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అ భ్యర్థి నరేంద్ర మోడీ పట్ల రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణ కూడా పార్టీ బలోపేతానికి కారణమవుతోంది. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి రావడంతో పార్టీకి కొత్త జవసత్వాలు చేకూరినట్లయింది.
ఈ నేపథ్యంలో ఓ కన్నడ దిన పత్రిక లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల మనోగతం ఎలా ఉందనే విషయమై ఇటీవల సర్వే నిర్వహించింది. రాష్ట్రంలోని మొత్తం 28 సీట్లకు గాను కాంగ్రెస్‌కు 14, బీజేపీకి 12 సీట్లు లభించవచ్చని సర్వే అంచనా వేసింది. రెండు సీట్లతో జేడీఎస్ తృప్తి పడాల్సి వస్తుందని కూడా వెల్లడించింది. గత ఏడాది మేలో శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఫలితాల సరళిని చూస్తే బీజేపీ కేవలం రెండు లోక్‌సభ స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను ప్రదర్శించగలిగింది. కాంగ్రెస్ 22 చోట్ల, జేడీఎస్ నాలుగు స్థానాల్లో పైచేయిగా నిలిచాయి.
2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 19, కాంగ్రెస్ ఆరు, జేడీఎస్ మూడు స్థానాల్లో గెలుపొందాయి. సర్వే అంచనాలు నిజమే అయితే ఈసారి బీజేపీ ఏడు స్థానాలను పోగొట్టుకోవాల్సి వస్తుంది. పాత మైసూరు, హైదరాబాద్-కర్ణాటక, కోస్తాలలో కాంగ్రెస్ హవా కనిపిస్తోందని సర్వే పేర్కొంది. ముంబై-కర్ణాటకలో పూర్తిగా, ఉత్తర, కోస్తాలలో కొన్ని చోట్ల బీజేపీకి ఆదరణ కనిపిస్తోందని వెల్లడించింది. శివమొగ్గ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న యడ్యూరప్ప గెలుపు ఖాయమని కూడా ఆ సర్వే జోస్యం చెప్పింది.
బీజేపీ జాబితా సిద్ధం
లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ సర్కారు ఏర్పాటు కావడం ఖాయమని కమలనాథులు విశ్వసిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను దాదాపుగా సిద్ధం చేశారు. ఒకటి, రెండు స్థానాల్లో నాయకుల మధ్య పోటీ ఉన్నప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల జోక్యంతో రాజీ కుదిరింది. ఆరు నూరైనా బెంగళూరు ఉత్తర స్థానం నుంచే పోటీ చేస్తామని పట్టుబట్టిన మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ, మాజీ మంత్రి శోభా కరంద్లాజెలను అనునయించడంలో వారు సఫలీకృతులయ్యారు.
మైసూరు నుంచి సదానంద గౌడ, ఉడిపి-చిక్కమగళూరు స్థానం నుంచి శోభా కరంద్లాజె పోటీ చేయడానికి ఒప్పించగలిగారు. మొత్తమ్మీద బీజేపీ 20 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. బీఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీరాములు స్పందన కోసం ఎదురు చూస్తూ, బళ్లారి, రాయచూరు స్థానాల విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేక పోతోంది. పార్టీకి అంతగా విజయావకాశాలు లేవనే నియోజక వర్గాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.