Sadanand Gowda
-
'కోర్టు తీర్పుతో ఆశ్చర్యం కలిగింది'
న్యూఢిల్లీ: నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్ మెంట్ కమిషన్(ఎన్ జేఏసీ) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆశ్చర్యం కలిగించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని, న్యాయనిపుణులతో చర్చించిస్తామని తెలిపారు. మెజారిటీ రాష్ట్రాలు ఎన్ జేఏసీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. దేశ ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్ సభ, రాజ్యసభ సభ్యుల పూర్తి మద్దతుతో ఎన్ జేఏసీ ఏర్పాటైందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి పాఠం ఇంకా చదవలేదని, ఈ సమయంలో తీర్పుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని, పాత పద్ధతిలోని కొలీజియం ద్వారానే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని సుప్రీంకోర్టు నేడు స్పష్టం చేసింది. -
మూడు నెలల్లో ప్రత్యేక హైకోర్టు
స్థలం చూపితే చాలు: కేంద్ర మంత్రి సదానంద ఇందుకు సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ ఇవ్వాలి సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు కోసం స్థలం చూపుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు లేఖ ఇస్తే గరిష్టంగా మూడు నెలల్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయించి విధులు కూడా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ తెలిపారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహనరావు విజయాన్ని కాంక్షిస్తూ శనివారం సాయంత్రం నల్లగొండలో జరిగిన పట్టభద్రులు, న్యాయవాదుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదానంద మాట్లాడుతూ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అయితే మూడేళ్లపాటు ఏపీ హైకోర్టు కూడా ఇక్కడే ఉంటుంది కనుక ఇంకో కోర్టు కోసం భవనాన్ని నిర్మించేందుకు స్థలం చూపించడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు హామీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ ఇస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ అధికారులతో చర్చించి 2 నుంచి 3 నెలల్లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. సమాఖ్య స్ఫూర్తితో పాలన సాగించాలన్న కృతనిశ్చయంతో కేంద్రం ఉందని, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు సాయం అందించాలన్న ఆలోచన కూడా కేంద్రానికి ఉందన్నారు. అందుకే 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన విధంగా కేంద్ర ఆదాయంలో ఇప్పటివరకు రాష్ట్రాలకు ఉన్న 32 శాతం వాటాను 42 శాతానికి పెంచామని చెప్పారు. అలాగే పన్నుల ద్వారా వచ్చే రెవెన్యూలో రాష్ట్రాలకు 62 శాతం వాటాను ఇస్తున్నామన్నారు. ఈ చర్యల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన దానికన్నా దాదాపు రూ. 25 వేల కోట్లు ఈ ఏడాది కేంద్రం నుంచి అదనంగా వస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖరరావు, బీజేపీ జాతీయ జలవనరుల విభాగం కన్వీనర్ వెదిరె శ్రీరాంరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహనరావు, రాష్ట్ర కోశాధికారి జి.మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాయర్లు ఆందోళన విరమించాలి... హైకోర్టు విభజన సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. అందువల్ల న్యాయవాదులు ఆందోళన విరమించాలని సదానంద కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్. రాంచంద్రారావును గెలిపించాలంటూ శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో సదానంద మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి మోదీప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూకేటాయింపు చేస్తే 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రారావును గెలిపించాలని మంత్రి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల గొంతుకను వినిపించే రాంచంద్రారావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ కుటుంబం ముందు చేతులు కట్టుకుని నిలబడే వ్యక్తులకు తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి ఎన్. రాంచంద్రారావు, టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహ్మరెడ్డి, బీజేపీ నేత ఇంద్రాసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతితో గవర్నర్ నరసింహన్ భేటీ
ఏపీ, తెలంగాణల్లోని తాజా పరిస్థితులపై చర్చ పలు వివాదాలపై నివేదిక సమర్పణ విద్యుత్ వివాదాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతో చర్చ నేడూ ఢిల్లీలోనే గవర్నర్ నరసింహన్ ప్రధాని, కేంద్ర హోం మంత్రి, హోంశాఖ కార్యదర్శిని కలిసే అవకాశం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలు, రెండు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, రాష్ట్రపతి ప్రణ బ్ ముఖర్జీకి వివరించారు. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఆయన రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. దాదాపు నలభై నిమిషాలపాటు రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఓ నివేదికను సమర్పించినట్టు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు గవర్నర్ అయినందున త్వరలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఎక్కడ పాల్గొనాలన్న అంశంపైనా స్పష్టత ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అంతకుముందు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతోనూ భేటీ అయ్యారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో భేటీ కావాల్సి ఉన్నా.. వారెవరూ అందుబాటులో లేకపోవడంతో కలవలేకపోయారు. సోమవారం ఉదయం ఏపీభవన్‌కు చేరుకున్న ఆయన, ఓ హోటల్లో ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం సాయంత్రం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో శ్రమశక్తి భవన్లో భేటీ అయ్యారు. పీపీఏ రద్దు సహా రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ కేటాయింపులకు సంబంధించి వస్తున్న సమస్యలపై ఆయనతో చర్చించారు. ఇరు రాష్ట్రాల వాదనలను వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్రం ఏయే చర్యలు తీసుకోవాల్సి ఉందన్న అంశాలపైనా మాట్లాడినట్టు సమాచారం. అనంతరం కేంద్రన్యాయశాఖ మంత్రి సదానందగౌడతో భేటీలో హైకోర్టు విభజన అంశాన్ని చర్చించారు. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం వినతులను, హైకోర్టు విభజనను ఏవిధంగా పూర్తి చేయాలన్న అంశాలూ ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. గవర్నర్ రెండోరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో సమావేశం కానున్నట్టు సమాచారం. శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో భేటీ అనంతరం కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ను ఢిల్లీకి పిలిచిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై గవర్నర్ ప్రత్యేక నివేదిక తయారు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా విద్యుత్ కేటాయింపులు, నీటి పంపకాలతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య ఇటీవల తీవ్ర చర్చకు దారితీసిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల అంశాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే మావోయిస్టులు ఎన్కౌంటర్ చేసిన ప్రాంత పర్యటన నిమిత్తం హోంమంత్రి రాజ్‌నాథ్ మంగళవారం ఛత్తీస్‌గఢ్ వెళుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యే అవకాశాలు తక్కువే అని హోంశాఖ వర్గాలు తెలిపాయి. కాగా, రాత్రి 8 గంటలకు ఏపీభవన్‌లోని శబరిబ్లాక్లో గవర్నర్ నరసింహన్‌ను ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి తేజావత్ రామచంద్రు, టీఆర్ఎస్ ఎంపీ సీతారాంనాయక్ కలిశారు. పోలవరం ముంపు మండలాలకు సంబంధించి ఓ వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగానే తెలంగాణలోని ఏడు మండలాలను తమ రాష్ట్రంలో కలుపుకొంటోందని, దీంతో స్థానిక గిరిజనులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వివరించారు. యాటపాక, పురుషోత్తపట్నం, పిచ్చుకల పాడు, చిన్నాయిగూడెం గ్రామ పంచాయ తీల్లోని 15 రెవెన్యూ గ్రామాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముంపునకు గురికావడం లేదని, వాటిని తెలంగాణలోనే ఉంచాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఐదో షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంతాలకు సంరక్షకుడు గవర్నర్ కాబట్టి ముందు ఈ గ్రామాలను తెలంగాణలోనే కొనసాగించాలని, తర్వాత మిగిలిన మండలాలను తెలంగాణలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాలకు 5 కొత్త రైళ్లు
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు 2014-15 రైల్వే బడ్జెట్లో 5 కొత్త రైళ్లను రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రకటించారు. రెండు రైళ్ల వేగం పెంచినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో 29 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 20 వేల 680 కోట్ల రూపాయల కేటాయించారు. పోర్టుల కనెక్టివిటీకి 4వేల కోట్ల రూపాయలు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్ రేవులకు మాత్రం మొండిచేయి చూపారు. 5 జన సాధారణ్ రైళ్లు ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్కటీ దక్కలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన కొత్త రైళ్లు: 1.విజయవాడ - న్యూఢిల్లీ డైలీ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైల్ 2.సికింద్రాబాద్ - నిజాముద్దీన్ మధ్య ప్రీమియం ఏసీ రైలు 3.ముంబై - కాజీపేట వీక్లీ ఎక్స్‌ప్రెస్ వయా బల్లార్షా 4.విశాఖ - చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ 5.పారాదీప్- విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ వేగం పెంచిన రైళ్లు 1.నాగపూర్-సికింద్రాబాద్ సెమీ బుల్లెట్ రైలు 2.చెన్నై - హైదరాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు -
ప్రగతి ‘రైలు’.. పట్టాలెక్కేనా..!?
నేడు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి సదానందగౌడ నత్తనడకన శ్రీకాళహస్తి-నడికుడి, కడప-బెంగళూరు రైల్వే మార్గాలు తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు ఊపు సాక్షి ప్రతినిధి, తిరుపతి: రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజానీకం పెట్టుకున్న కొండంత ఆశలను మంత్రి సదానందగౌడ సాకారం చేస్తారా? గత రైల్వే మంత్రుల తరహాలోనే వమ్ము చేస్తారా? అన్నది కొద్ది గంటల్లో వెల్లడి కానుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటున్న నేపథ్యంలో మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది. విభజన నేపథ్యంలో రాష్ట్ర, రైల్వేశాఖ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన శ్రీకాళహస్తి-నడికుడి, కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టులకు రైల్వేశాఖే నిధులను సమకూర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను కేంద్రం ఏ మేరకు అంగీకరిస్తుందన్నది నేడు తేలిపోనుంది. వివరాల్లోకి వెళితే.. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్‌సభలో 2014-15 (పూర్తి స్థాయి) రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. కానీ.. జిల్లాలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇందులో ప్రధానమైన రైల్వే మార్గాల పరిస్థితి అంతంత మాత్రమే. ఇదే జిల్లా పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతంగా మారింది. అపార ఖనిజ సంపదకూ.. వ్యవసాయ ఉత్పత్తులకు.. పర్యాటక రంగానికి పెట్టింది పేరైన జిల్లా, అభివృద్ధిలో మాత్రం అథమ స్థానంలో ఉండటానికి ప్రధాన కారణం రైల్వే మార్గాలు సక్రమంగా లేకపోవడమేనని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పశ్చిమ మండలాల్లో పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేసేలా కడప-మదనపల్లె-బంగారుపేట-బెంగళూరు రైల్వే మార్గాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించారు. తూర్పు మండలాల సమగ్రాభివృద్ధికి దోహదం చేసేలా శ్రీకాళహస్తి-నడికుడి మార్గాన్ని మంజూరు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. వాటా నిధుల కేటాయింపే సాకుగా... నిధుల లభ్యత లేదనే సాకు చూపి ఆ రెండు రైల్వే మార్గాలను మంజూరు చేసేందుకు అప్పట్లో రైల్వేశాఖ అంగీకరించలేదు. దీంతో ఆ మార్గాలకు అయ్యే వ్యయంలో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అప్పట్లో వైఎస్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 2008-09 రైల్వే బడ్జెట్లో ఆ రెండు మార్గాలను మంజూరు చేసింది. 2008-09, 2009-10 బడ్జెట్లలో దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఆ రెండు రైల్వే మార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా నిధులను ఇచ్చారు. ఫలితంగా కడప-బెంగళూరు, శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే మార్గాల పనులను కేంద్రం ప్రారంభించింది. ప్రస్తుతం కడప-బెంగళూరు రైల్వే మార్గం పనులు రూ.129 కోట్ల వ్యయంతో కడప నుంచి పెండ్లిమర్రి వరకూ 21.59 కి.మీల మేర సాగుతున్నాయి. శ్రీకాళహస్తి-నడికుడి రైల్వేమార్గం సర్వే పనులు 2010 నాటికే పూర్తయ్యాయి. పనులు మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. ఐదేళ్లలో పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టులు ఎన్నటికి పూర్తవుతాయన్నది రైల్వేశాఖే ఓ అంచనాకు రాలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం వైఎస్ హఠాన్మరణం తర్వాత శ్రీకాళహస్తి-నడికుడి, బెంగళూరు-కడప రైల్వే మార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడదల చేయకపోవడమే. ఇదే సాకుగా చూపి రైల్వేశాఖ కూడా ఆ మార్గాలకు నిధులు కేటాయించడం లేదు. ఈ నేపథ్యంలో సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులకు రైల్వేశాఖే నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కోరడం గమనార్హం. డివిజన్ పోయి జోన్ వచ్చె.. గుంతకల్లు డివిజన్, గుంటూరు డివిజన్లో కొన్ని భాగాలను వేరు చేసి.. తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రెండు దశబ్దాలుగా విన్పిస్తూనే ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికీ, రైల్వేశాఖకూ రాజకీయ, పారిశ్రామిక వర్గాలు ప్రతిపాదనలు కూడా పంపాయి. మంగళవారం రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత రానుంది. -
గౌడ రైలు ‘కూత’పెట్టేనా?
సబర్బన్ రైలు సంచారంపై ఆశలు ప్రతిపాదనలకే పరిమితమైన రైళ్ల పరుగు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, రాష్ట్రానికి చెందిన రైల్వే మంత్రి డీవీ. సదానంద గౌడ మంగళవారం తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. గత యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా వ్యవహరించిన మల్లిఖార్జున ఖర్గే, అంతకు ముందు రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేసిన కేహెచ్. మునియప్పలు కర్ణాటక వారే అయినా, సొంత రాష్ట్రంపై కాక తాము ప్రాతినిథ్యం వహించే నియోజక వర్గాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రానికి సుమారు 12 కొత్త రైళ్లను ఖర్గే ప్రతిపాదించగా, అందులో తొమ్మిది రైళ్లు తన సొంత నియోజక వర్గం గుల్బర్గ మీదుగా పోయేట్లు ‘జాగ్రత్తలు’ తీసుకున్నారు. అందుకే అప్పట్లో విమర్శకులు ‘ఖర్గే రైలు వయా గుల్బర్గ’ అని చమత్కరించే వారు. అవిభక్త గుల్బర్గ జిల్లాలోని యాదగిరికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా ఖర్గే మంజూరు చేశారు. అంతకు ముందు మునియప్ప తన సొంత నియోజక వర్గం కోలారుకు కూడా ఓ కోచ్ ఫ్యాక్టరీని ప్రతిపాదించుకున్నారు. ఇవన్నీ ఆచరణలో సాధ్యమా, కాదా...అనేది వేయి డాలర్ల ప్రశ్న. సబర్బన్ రైలు కావాలి బెంగళూరులో మెట్రో రైలు సంచరిస్తున్నప్పటికీ, చెన్నై, ముంబైలలో లాగా సబర్బన్ రైలు కావాలనే డిమాండ్ ఉంది. దీని వల్ల నగర వాసులకు ఎంతో ఉపయోగం ఉంటుంది కనుక వచ్చే బడ్జెట్లో సబర్బన్ రైలును ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ గౌడ ఇటీవల బెంగళూరులో సదానంద గౌడకు వినతి పత్రాన్ని సమర్పించారు. దాంతో పాటు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో సేకరించిన పది వేల సంతకాలను కూడా జతపరిచారు. బీజేపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ ఈసారి రైల్వే బడ్జెట్లో సబర్బన్ రైలు ప్రకటిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త రైళ్ల కోసం విన్నపం రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల నుంచి ఇంకా రాజధాని బెంగళూరుకు రైల్వే కనెక్టివిటీ లేదనే విమర్శలున్నాయి. దీనిపై తాను గతంలో అనేక మంది రైల్వే మంత్రులను కలిశానని దక్షిణ రైల్వే జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు ప్రకాశ్ మండోత్ తెలిపారు. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లైన చిక్కమగళూరు-బెంగళూరు, హరిహర, దావణగెరె-బెంగళూరు, మంగళూరు-బెంగళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్‌లను ప్రకటించాలని కోరామని వివరించారు. బెంగళూరు-ముంబై ఏసీ సూపర్ ఫాస్ట్, బెంగళూరు-రామేశ్వరం, బెంగళూరు-నిజాముద్దీన్ (రాజధాని) వయా హుబ్లీ లాంటి అంతర్ రాష్ట్ర రైళ్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఇంకా...యశ్వంతపుర-కార్వార రోజూ రైలు, యశ్వంతపుర-మిరాజ్ స్పెషల్ వయా హుబ్లీ డెయిలీ సర్వీస్‌లకు డిమాండ్లు ఉన్నాయి. ఇంకా...చామరాజ నగర-బెంగళూరు, హొస్పేట-బెంగళూరు, హుబ్లీ-బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, అంతర్ రాష్ర్ట సర్వీసులైన బెంగళూరు-వారణాసి వయా జబల్పూర్, బెంగళూరు-హరిద్వార్ వయా ఢిల్లీ, బెంగళూరు-షిర్టీ వయా రాయచూరు, బెంగళూరు-ఉదయ్‌పూర్ వయా పుణె, హుబ్లీ-చెన్నై వయా బళ్లారి, రేణిగుంట రైళ్లను ప్రవేశ పెట్టాలనే డిమాండ్లు కూడా ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. -
‘పెద్దపల్లి’ రైల్వేలైన్ పూర్తి చేయండి
రైల్వే మంత్రి సదానంద్గౌడకు ఎంపీ కవిత వినతి ఖలీల్‌వాడి : నిజామాబాద్ జిల్లాకు అధిక మేలు చేసే రైల్వేలైన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వేమంత్రి సదానంద్గౌడను ఎంపీ కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఢిల్లీలో సోమవారం మంత్రికి వినతిపత్రం అందించారు. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వేలైన్‌కు 1993 -94లోనే బడ్జెట్లో మంజూరైందని, కానీ ఇప్పటి వరకు పూర్తి కాలేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో మంజూరు చేయబడిన 177.46 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్లో కేవలం 28 కిలోమీటర్లు పెండింగ్ ఉండడం వల్ల జిల్లా ప్రజలకు సేవలందించకుండా నిరూపయోగంగా ఉందన్నారు. ప్రతిపాదిత కొత్త లైన్లలో మొదటి ప్రా దాన్యతగా ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ రై ల్వేలైన్లను చేపట్టాలని కోరారు. 2011లోనే సర్వే పనులు పూర్తిచేసి *700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినప్పటికీ రైల్వేబడ్జెట్‌లో కేటాయించకపోవడం బాధాకరమన్నా రు. తెలంగాణ జిల్లాలను మధ్య భారతదేశం తో అనుసంధానించే ఈ రైల్వేలైన్‌కు తగు కేటాయింపులు జరిపి పనులు ప్రారంభించాలని కో రారు. పెద్దపల్లి-ఆర్మూర్, నిజామాబాద్ రైల్వేలైన్, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ లైను పూర్తయితే ఆర్మూర్ రైల్వే జంక్షన్ కావడంతో పాటు ఇక్కడి పంటలకు దేశ వ్యాప్త మార్కెట్‌తో అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు. సికింద్రాబాద్-నిజామాబాద్-ముథ్కేడ్ రూట్లలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. గ త ప్రభుత్వాల ఆలసత్వం వల్ల ఒక్క చెప్పుకోదగ్గ పని కూడా జిల్లాలో పూర్తి కాలేదన్నారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. జిల్లాలో హెవీ వెహికిల్ నిర్మాణ యూనిట్ ఏర్పాటు చేయండి జిల్లాలో హెవీ వెహికిల్ నిర్మాణ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీని ఎంపీ కోరారు. దీంతో నిజామాబాద్, ఆ దిలాబాద్, కరీంనగర్ జిల్లాతో పాటు జిల్లాకు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న యువకులు ఉపాధి అవకాశాలు మెరుగుపడాతాయన్నారు. మెదక్‌జిల్లా ఎద్దుమైలారంలోని ఓడిఎఫ్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ఆపాలని మంత్రిని కోరారు. త్వరలోనే అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.