మూడు నెలల్లో ప్రత్యేక హైకోర్టు
- స్థలం చూపితే చాలు: కేంద్ర మంత్రి సదానంద
- ఇందుకు సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ ఇవ్వాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు కోసం స్థలం చూపుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు లేఖ ఇస్తే గరిష్టంగా మూడు నెలల్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయించి విధులు కూడా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ తెలిపారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహనరావు విజయాన్ని కాంక్షిస్తూ శనివారం సాయంత్రం నల్లగొండలో జరిగిన పట్టభద్రులు, న్యాయవాదుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సదానంద మాట్లాడుతూ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అయితే మూడేళ్లపాటు ఏపీ హైకోర్టు కూడా ఇక్కడే ఉంటుంది కనుక ఇంకో కోర్టు కోసం భవనాన్ని నిర్మించేందుకు స్థలం చూపించడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు హామీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ ఇస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ అధికారులతో చర్చించి 2 నుంచి 3 నెలల్లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు.
సమాఖ్య స్ఫూర్తితో పాలన సాగించాలన్న కృతనిశ్చయంతో కేంద్రం ఉందని, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు సాయం అందించాలన్న ఆలోచన కూడా కేంద్రానికి ఉందన్నారు. అందుకే 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన విధంగా కేంద్ర ఆదాయంలో ఇప్పటివరకు రాష్ట్రాలకు ఉన్న 32 శాతం వాటాను 42 శాతానికి పెంచామని చెప్పారు. అలాగే పన్నుల ద్వారా వచ్చే రెవెన్యూలో రాష్ట్రాలకు 62 శాతం వాటాను ఇస్తున్నామన్నారు.
ఈ చర్యల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన దానికన్నా దాదాపు రూ. 25 వేల కోట్లు ఈ ఏడాది కేంద్రం నుంచి అదనంగా వస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖరరావు, బీజేపీ జాతీయ జలవనరుల విభాగం కన్వీనర్ వెదిరె శ్రీరాంరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహనరావు, రాష్ట్ర కోశాధికారి జి.మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లాయర్లు ఆందోళన విరమించాలి...
హైకోర్టు విభజన సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. అందువల్ల న్యాయవాదులు ఆందోళన విరమించాలని సదానంద కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్. రాంచంద్రారావును గెలిపించాలంటూ శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో సదానంద మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి మోదీప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూకేటాయింపు చేస్తే 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం కృతనిశ్చయంతో ఉందన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రారావును గెలిపించాలని మంత్రి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల గొంతుకను వినిపించే రాంచంద్రారావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ కుటుంబం ముందు చేతులు కట్టుకుని నిలబడే వ్యక్తులకు తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి ఎన్. రాంచంద్రారావు, టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహ్మరెడ్డి, బీజేపీ నేత ఇంద్రాసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.