రాష్ట్రపతితో గవర్నర్ నరసింహన్ భేటీ
- ఏపీ, తెలంగాణల్లోని తాజా పరిస్థితులపై చర్చ
- పలు వివాదాలపై నివేదిక సమర్పణ
- విద్యుత్ వివాదాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం
- హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతో చర్చ
- నేడూ ఢిల్లీలోనే గవర్నర్ నరసింహన్
- ప్రధాని, కేంద్ర హోం మంత్రి, హోంశాఖ కార్యదర్శిని కలిసే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలు, రెండు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, రాష్ట్రపతి ప్రణ బ్ ముఖర్జీకి వివరించారు. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఆయన రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. దాదాపు నలభై నిమిషాలపాటు రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీతో పలు అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఓ నివేదికను సమర్పించినట్టు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు గవర్నర్ అయినందున త్వరలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఎక్కడ పాల్గొనాలన్న అంశంపైనా స్పష్టత ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అంతకుముందు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతోనూ భేటీ అయ్యారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో భేటీ కావాల్సి ఉన్నా.. వారెవరూ అందుబాటులో లేకపోవడంతో కలవలేకపోయారు.
సోమవారం ఉదయం ఏపీభవన్‌కు చేరుకున్న ఆయన, ఓ హోటల్‌లో ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం సాయంత్రం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో శ్రమశక్తి భవన్‌లో భేటీ అయ్యారు. పీపీఏ రద్దు సహా రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ కేటాయింపులకు సంబంధించి వస్తున్న సమస్యలపై ఆయనతో చర్చించారు. ఇరు రాష్ట్రాల వాదనలను వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్రం ఏయే చర్యలు తీసుకోవాల్సి ఉందన్న అంశాలపైనా మాట్లాడినట్టు సమాచారం.
అనంతరం కేంద్రన్యాయశాఖ మంత్రి సదానందగౌడతో భేటీలో హైకోర్టు విభజన అంశాన్ని చర్చించారు. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం వినతులను, హైకోర్టు విభజనను ఏవిధంగా పూర్తి చేయాలన్న అంశాలూ ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. గవర్నర్ రెండోరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో సమావేశం కానున్నట్టు సమాచారం. శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో భేటీ అనంతరం కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ను ఢిల్లీకి పిలిచిన విషయం తెలిసిందే.
ఇదే అంశంపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై గవర్నర్ ప్రత్యేక నివేదిక తయారు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా విద్యుత్ కేటాయింపులు, నీటి పంపకాలతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య ఇటీవల తీవ్ర చర్చకు దారితీసిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల అంశాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే మావోయిస్టులు ఎన్‌కౌంటర్ చేసిన ప్రాంత పర్యటన నిమిత్తం హోంమంత్రి రాజ్‌నాథ్ మంగళవారం ఛత్తీస్‌గఢ్ వెళుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యే అవకాశాలు తక్కువే అని హోంశాఖ వర్గాలు తెలిపాయి.
కాగా, రాత్రి 8 గంటలకు ఏపీభవన్‌లోని శబరిబ్లాక్‌లో గవర్నర్ నరసింహన్‌ను ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి తేజావత్ రామచంద్రు, టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాంనాయక్ కలిశారు. పోలవరం ముంపు మండలాలకు సంబంధించి ఓ వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగానే తెలంగాణలోని ఏడు మండలాలను తమ రాష్ట్రంలో కలుపుకొంటోందని, దీంతో స్థానిక గిరిజనులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వివరించారు.
యాటపాక, పురుషోత్తపట్నం, పిచ్చుకల పాడు, చిన్నాయిగూడెం గ్రామ పంచాయ తీల్లోని 15 రెవెన్యూ గ్రామాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముంపునకు గురికావడం లేదని, వాటిని తెలంగాణలోనే ఉంచాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఐదో షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంతాలకు సంరక్షకుడు గవర్నర్ కాబట్టి ముందు ఈ గ్రామాలను తెలంగాణలోనే కొనసాగించాలని, తర్వాత మిగిలిన మండలాలను తెలంగాణలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు.