సజావుగా విభజన ప్రక్రియ
* రాష్ట్రపతి, ప్రధానితో గవర్నర్
* రాష్ట్ర విభజన, ఉద్యోగుల పంపిణీ అంశాలపై నివేదికలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీలతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశాలతోపాటు ఇరు రాష్ట్రాల్లోని పరిస్థితులు, ఉద్యోగుల పంపిణీ వంటి విషయాలపై వారికి వివరించారు. ముందుగా ప్రధానిని ఆయన అధికార నివాసంలో నరసింహన్ కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం రాష్ట్ర విభజన సాగుతున్న తీరు, జూన్ 2 తర్వాత ఏర్పడనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు శాఖలవారీగా విభ జన జరిగిన తీరు, ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపులకు సంబంధించిన నివేదికలను ప్రధానికి సమర్పించారు. ఇదేసమయంలో ఉద్యోగుల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాల ఉద్యోగ సంఘాలమధ్య ఘర్షణకు కారణమైన అంశాలను మోడీ దృష్టికి తీసుకెళ్లారు. స్థానికత ఆధారంగా విభజన జరగాలన్న తెలంగాణ ఉద్యోగుల డిమాండ్ కారణంగా వివాదం రేగుతోందని గవర్నర్ వివరించినట్టు సమాచారం.
ఈ కారణంగా ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు తాత్కాలిక ఉద్యోగుల విభజనే చేపట్టారని, రెండు ప్రభుత్వాల ఏర్పాటు తర్వాత వారి ఆలోచనలకు అనుగుణంగా శాశ్వత విభ జన చేయాలని పలు కమిటీలు నిర్ణయించిన విషయాన్ని గవర్నర్.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విభజనకు సంబంధించి అన్ని ప్రక్రియలు దాదాపుగా ముగిశాయని, జూన్ 2 అపాయింటెడ్ డే తర్వాత కొత్త రాష్ట్రాల్లో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపినట్టు సమాచారం.
జూన్ 2న తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వచ్చే నెల 8 వరకు కొనసాగుతుందని, ఈ దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని నరసింహన్‌కు ప్రధాని సూచించినట్లు తెలిసింది. తదుపరి నరసింహన్ రాష్ట్రపతిని కలసి విభజన అంశాలపై వివరణ ఇచ్చారు. అనంతరం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులు, విభజన అనంతరం దృష్టి సారించాల్సిన అంశాలపై ఒక నివేదికను సమర్పించారు. ఈ భేటీ తర్వాత నరసింహన్ జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా జరుగుతోందని ప్రధానికి, రాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు.