ప్రమాదంలో ‘ రాష్ట్ర శాంతిభద్రతలు’
ప్రమాదంలో ‘ రాష్ట్ర శాంతిభద్రతలు’
Published Thu, Oct 24 2013 1:44 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
రాష్ట్రంలో మొత్తంగా శాంతిభద్రతల పరిస్థితి అత్యంత కలవరం కలిగించేదిగా ఉందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ స్వయంగా నివేదించారని తెలిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అత్యంత కీలకమైన బిల్లు రూపకల్పన దశకు చేరిన నేపథ్యంలో పిలుపుపై ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారం ప్రణబ్‌తో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర నేతలను కలిసి విభజన ఆంశంపై లోతుగా చర్చలు జరిపారు. ప్రణబ్‌తో భేటీలో శాంతిభద్రతల అంశంపైనే గవర్నర్ విసృ్తతంగా నివేదించినట్టు తెలిసింది. తక్షణం అవసరమైన చర్యలు, జాగ్రత్తలు చేపట్టి పరిస్థితులను అదుపు చేయకపోతే అవి ఎక్కడికైనా దారి తీయవచ్చంటూ ఆందోళన వెలిబుచ్చినట్టు సమాచారం. ‘‘విభజనపై కేంద్రం చురుగ్గా ముందుకెళ్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితి కలవరం కలిగించేలా మారుతోంది.
అందుకే కేంద్రం ఏం చేయదలచుకున్నా చాలా వేగంగా వ్యవహరించాలి. అవసరమైతే ఏ ‘అసాధారణ ప్రక్రియ’కైనా, చర్యకైనా సిద్ధపడాలి. లేనిపక్షంలో రాష్ట్రంలో పరిస్థితి చేజారిపోవడం ఖాయం’’ అని రాష్ట్రపతికి వివరించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తనకున్న సమాచారాన్ని ఉటంకిస్తూ విషయాన్ని అన్ని కోణాల నుంచీ వివరిస్తూ ప్రణబ్ ముందుంచినట్టు చెబుతున్నారు. శాంతిభద్రతలను అత్యంత ప్రాథమ్యాంశంగా పరిగణించాలని ప్రణబ్‌ను కోరినట్టు సమాచారం. సోనియా, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేలతో భేటీలో కూడా ఈ అంశాలన్నింటినీ గవర్నర్ వారి దృష్టికి తీసుకెళ్లారని, అంతేగాక వారికి పలు నివేదికలు కూడా సమర్పించారని తెలిసింది. ముఖ్యంగా రాష్ట్రంలో పాలన, ప్రభుత్వ పనితీరు ఏమాత్రం బాగా లేవని స్పష్టం చేశారంటున్నారు. అంతేగాక విభజన ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలంటే సీమాంధ్ర ప్రాంత ప్రజల భయాందోళనల్ని తొలగించే ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సి ఉంటుందని వారితో అభిప్రాయపడినట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గత జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయించిన తర్వాత గవర్నర్ ఢిల్లీకి రావడం ఇదే మొదటిసారి.గవర్నర్ బుధవారం తొలుత కేంద్ర మంత్రుల బృందంలో కీలక సభ్యుడైన ఆర్థిక మంత్రి చిదంబరంతో దాదాపు 45 నిమిషాలు చర్చలు జరిపారు. విభజనానంతరం తలెత్తే పలు సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన మార్గాలపై మల్లగుల్లాలు పడ్డట్టు సమాచారం. తర్వాత సోనియా నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నెలకొని ఉన్న తాజా పరిస్థితిపై, విభజన ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమెకు వివరమైన నివేదికను సమర్పించారు. అయితే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే సమస్యే లేదని ఈ సందర్భంగా సోనియా స్పష్టం చేసినట్లు గవర్నర్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. సీమాంధ్ర నేతలు ఈ దిశగా గట్టిగా డిమాండ్ చేస్తుండటం, ఈ నేపథ్యంలో ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్ల పాటు హైదరాబాద్‌లో శాంతిభద్రతల యంత్రాంగాన్ని కేంద్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంచాలని హోంశాఖ ప్రతిపాదిస్తుండటం తెలిసిందే. అనంతరం మధ్యాహ్నం గవర్నర్ కేంద్ర హోం శాఖ కార్యాలయానికి వెళ్లి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, హోం శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర విభజన ప్రక్రియ అమలు గురించి చర్చించారు.
తర్వాత షిండే, ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి నారాయణసామి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌లను కూడా కలిశారు. అయితే చర్చల వివరాలను మీడియాకు వెల్లడించడానికి నిరాకరించారు. చాలాకాలం తర్వాత రాజధానికి వచ్చినందున కేంద్ర నాయకులను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నానన్నారు. తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చిందా? అని ప్రశ్నించగా, చాలా విషయాలు మాట్లాడుకున్నామంటూ ముక్తసరిగా బదులిచ్చారు. జీవోఎం సభ్యుడైన రక్షణ మంత్రి ఆంటోనీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలను గవర్నర్ గురువారం కలుస్తారని సమాచారం. శుక్రవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కూడా సమావేశమయ్యే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ బిల్లుకు శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ఆమోదాన్ని పొందాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం, అందుకోసం అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని కూడా ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో గవర్నర్‌ను ఢిల్లీ పిలిపించడం ప్రాధాన్యతను సంతరించుకోవడం తెలిసిందే. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను, సీమాంధ్రలో ఉధృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ తీరుతెన్నులపై తన అంచనాలను, అభిప్రాయాలను పెద్దలకు గవర్నర్ వివరించారని ఆయన సన్నిహిత వర్గాలన్నాయి.
Advertisement