‘విభజన’ సమస్యలపై ఇరు రాష్ట్రాల మంత్రుల భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి సమస్యలను పరిష్కరించుకునేందుకు బుధవారం రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సభ్యులు రాజ్‌భవన్ లో భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి లోబడి ఉద్యోగుల విభజన, భవనాల అప్పగింత, తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన... తదితర అంశాలపై చర్చించారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ చర్చలు కొనసాగాయి. చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం పక్షాన మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. గవర్నర్ సూచనల మేరకు ఇరు రాష్ట్రాల్లోని విభజన సమస్యలపై చర్చించుకుని పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
ఈక్రమంలో అంశాలవారీగా సమావేశాలను కొన్ని హైదరాబాద్‌లో, మరికొన్ని అమరావతిలో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తాజా భేటీలో... పలు అంశాలపై చర్చించినప్పటికీ పరిష్కారం మాత్రం కొలిక్కిరరాలేదు. ఈ నెల 9న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగులో ఉన్న అన్ని అంశాలను చర్చించామని తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిలు తెలిపారు. సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. సమస్యలపై కోర్టులను ఆశ్రయించి సాగదీసుకోకుండా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.