సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలను పరిష్కరించే దిశగా కేంద్రం ఎట్టకేలకు ముందడుగు వేసింది. విభజన వివాదాలపై అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫార్సు చేసేందుకు కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఈ నెల 8న త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తరఫున ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్.ఎస్. రావత్, కె. రామకృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీ ఈ నెల 17న ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా తొలి సమావేశం నిర్వహించనుంది.
వాస్తవానికి 9 అంశాల ఎజెండాతో సమావేశం నిర్వహించనున్నామని రెండు రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ శుక్రవారం లేఖ రాసింది. అయితే ఆ ఎజెండాను 5 అంశాలకు కుదించామంటూ శనివారం సాయంత్రం మరో లేఖను పంపింది. మొదటి లేఖలో త్రిసభ్య కమిటీ పరిష్కారయోగ్యమైన సిఫార్సులు చేయాలని సూచించింది. రెండో సర్క్యులర్‌లో మాత్రం సమావేశం ఎజెండాలో మార్పులు చేసినట్లు పేర్కొంది.
కమిటీ ప్రతి నెలా సమావేశమై..
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా గత నెల 12న నిర్వహించిన సమావేశంలోనూ విభజన చట్టంలోని అంశాల గురించి చర్చించినా ఏ అంశమూ పరిష్కారం దిశగా ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ ప్రతి నెలా సమావేశమై విభజన అంశాలను చర్చించి పరిష్కారమయ్యేలా కృషి చేయాల్సి ఉంటుంది.
ఎజెండాలోని అంశాలు
సవరించిన ఎజెండాలో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)కు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన బకాయిలు, పన్నుల వ్యత్యాసాల తొలగింపు, నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజన, ఏపీ/తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థల రుణాల బట్వాడా అంశాలు ఉన్నాయి.
ఎజెండా నుంచి తొలగించినవి వనరుల లోటు, రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతంలోని వెనుకబడిన 7 జిల్లాలకు అభివృద్ధి నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు.
ఏజెండాలోని అంశాల గురించి..
– తెలంగాణ డిస్కంల నుంచి రూ.3,442 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు రావాల్సి ఉందని ఏపీ జెన్‌కో చెబుతోంది. ఏపీ విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను సర్దుబాటు చేశాక వాటి నుంచి తమకు రూ.12,111 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ విద్యుత్ సంస్థలు వాదిస్తున్నాయి. బకాయిల కోసం ఏపీ విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.
– నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కు కేటాయించిన 250 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోగా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించి స్టే పొందింది. కోర్టు కేసును ఉపసంహరించుకుంటేనే షెడ్యూల్–9లోని సంస్థల విభజనలో పురోగతి సాధ్యం కానుందని తెలంగాణ పేర్కొంటోంది.
– నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన విషయంలో ఏపీ నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన రూ.495 కోట్ల నిధులు రావాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. హైకోర్టు, రాజ్ భవన్ వంటి ఉమ్మడి సంస్థల నిర్వహణకు ఖర్చు చేసిన రూ.315 కోట్లనూ ఏపీ ఇవ్వాల్సి ఉందని వాదిస్తోంది. నిర్మాణంలో ఉన్న భవనాల్లో వాటా, రూ.456 కోట్ల సంక్షేమ నిధి, రూ.208 కోట్ల నికర క్రెడిట్ ఫార్వర్డ్ నిధులు సైతం ఏపీ నుంచి రావాల్సి ఉందంటోంది.
– విభజన సమయంలో వాణిజ్య పన్నుల ఆదాయ పంపకాల్లోని వ్యత్యాసాల పరిష్కారంపై చర్చ జరగనుంది.
– ఉమ్మడి రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ఏ రాష్ట్రం ఎంత భరించాలో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment