సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన వివాదాలను ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో పరిష్కరించుకునే దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. గత నెల 30న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకుందామని, ఏపీ ప్రగతికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేసీఆర్ ప్రకటించిన విదితమే. రాజ్‌భవన్‌లో శనివారం జరిగిన ఇఫ్తార్ విందు సందర్భంగా కూడా అధికారుల స్థాయిలో చర్చలు నిర్వహించి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలు నిరుపయోగంగా ఉన్న నేపథ్యంలో వాటిని తమకు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు విభాగానికి కొత్తగా ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని అభ్యర్థించింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మాన పత్రాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి అందజేశారు. దీంతో గవర్నర్ తక్షణమే స్పందించి భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏపీ పోలీసు విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8 కింద తనకు సంక్రమించిన అధికారులను ఉపయోగించుకొని గవర్నర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న భవనాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం బకాయిపడిన ఆస్తి పన్నులు, ఇతర చార్జీలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయాలని గవర్నర్ సూచించారు. అయితే ఈ భవనాల విలువను పరిహారంగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం కోరనుందని ఆ రాష్ట్ర అధికార వర్గాల ద్వారా తెలిసింది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకొని...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు నిర్వహించుకునేలా విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాలను చెరి సగం కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అమరావతి నుంచి పని చేస్తుండటంతో హైదరాబాద్‌లో ఆ రాష్ట్రానికి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. వాటిని వాడుకోనప్పటికీ ఏపీ ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తోంది. దాదాపు నాలుగేళ్లుగా ఖాళీగా ఉండటం, సరైన నిర్వహణ లేకపోవడంతో ఈ భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటికి సంబంధించి రూ. 10 కోట్లకుపైగా విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్నులను ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. నిరుపయోగంగా ఉన్న ఈ భవనాలకు రక్షణగా వందల మంది ఏపీ ప్రభుత్వ భద్రత సిబ్బందితోపాటు నిర్వహణ కోసం మరికొందరు ఉద్యోగులు గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు.
సీఎం కేసీఆర్ హర్షం...
హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంపట్ల సీఎం కేసీఆర్‌హర్షం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజాప్రయోజనాలే పరమావధిగా, స్నేహభావంతో ముందడుగు వేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రతి విషయంలోనూ వాస్తవిక దృష్టితో ఆలోచించి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రభుత్వాలు పని చేస్తాయని సీఎం ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, రెండు రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉండాలని, అపరిష్కృత సమస్యలన్నీ సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమని సీఎం పేర్కొన్నారు.
వివాదాలపై రెండు రాష్ట్రాల సీఎస్‌ల కమిటీ...
తెలంగాణ, ఏపీల మధ్య అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు లేదా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాగల ఇతర సీనియర్ ఐఏఎస్‌ల నేతృత్వంలో ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో శనివారం రాజ్‌భవన్‌లో సమావేశమైన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వై.ఎస్. జగన్ ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో ఈ కమిటీ ఏర్పాటు విషయంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఉమ్మడిగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన వివాదాల పరిష్కారానికి గత ఐదేళ్లలో తీసుకున్న చర్యలేమిటి? రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ప్రభుత్వరంగ సంస్థల విభజన అంశంపై షీలా బిడే కమిటీ చేసిన సిఫారసులను యథాతథంగా అమలు చేయవచ్చా? లేక ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటుందా? అనే అంశాలపై సీఎస్‌ల కమిటీ సమావేశమై చర్చలు జరపనుంది.
షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఆస్తులు, అప్పుల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, రూ. వేల కోట్లలో ఉన్న విద్యుత్ బిల్లుల వివాదాలు తదితర అంశాలపై అధ్యయనం జరపనుంది. కనీసం వారానికోసారి కమిటీ సమావేశమై అంశాలవారీగా చర్చలు జరపనుంది. చర్చలు కొలిక్కి వచ్చాక కమిటీలోని ఇరు రాష్ట్రాల అధికారులు వేర్వేరుగా నివేదికలను సమర్పించనున్నారు. ఈ నివేదికల ఆధారంగా ఇరు రాష్ట్రాల సీఎంలు మళ్లీ గవర్నర్ సమక్షంలో సమావేశమై చర్చల ద్వారా వివాదాల పరిష్కారానికి కృషి చేయనున్నారు. సమస్యలపై ఏకభిప్రాయం కుదిరే వరకు సీఎంలు సైతం ఒకటికి రెండుసార్లు సమావేశమయ్యే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment