
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో ఉన్న సరుకు రవాణా పంపిణీ (లీడ్స్)–2021కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 3.17 స్కోర్ సాధించింది. తెలంగాణ మొత్తంగా 3.14 స్కోర్‌తో పదో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు రహదారుల నాణ్యతలో 3.59, రైల్వే మౌలిక వసతులు నాణ్యతలో 3.26, మల్టీమోడల్ టెర్మినల్ నాణ్యతలో 3.38, గిడ్డంగుల నాణ్యతలో 3.27, యూనిమోడల్ టెర్మినల్ నాణ్యతలో 2.92, సరుకు రవాణా పంపిణీ నాణ్యతలో 3.55, సరుకు రవాణా పంపిణీ సేవలందించే సామర్థ్యంలో 3.50, సరుకు రోడ్డు రవాణా ధరల సహేతుకతలో 2.35, టెర్మినల్ సర్వీస్ ధరల సహేతుకతలో 2.47, కార్గో డెలివరీ రవాణాలో 3.48, మొబైల్, ఇంటర్‌నెట్ సర్వీస్‌లో 3.60 స్కోర్ లభించింది.
అలాగే రవాణా సమయంలో సురక్షితం, భద్రతకు 3.61, టెర్మినళ్లల్లో సురక్షితం, భద్రతకు 3.78 స్కోర్ సాధించింది. కాగా, రాబోయే ఐదేళ్లలో సరుకు రవాణా ఖర్చులు ఐదు శాతం తగ్గుముఖం పట్టనున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. లీడ్స్ –2021 నివేదిక విడుదల సందర్భంగా సోమవారం ఆయన న్యూఢిల్లీలో మాట్లాడారు. కాగా, లీడ్స్‌లో తొలి మూడు స్థానాలు.. గుజరాత్ , హరియాణా, పంజాబ్ దక్కించుకున్నాయి. ఆయా రాష్ట్రాలకు సంబంధించి పరిశ్రమల భాగస్వాములు అందించిన సమాచారం, వారి సమస్య ఆధారంగా లీడ్స్ నివేదికను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయా అంశాలపై రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలు చేసింది.