సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సహా ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు త్వరలోనే 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తొలిదశలో ఈ మూడు రాష్ట్రాల్లో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. బుధవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో ముచ్చటించారు. విద్యుత్ సమస్యలపై ఇప్పటివరకు 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ‘తెలంగాణ సీఎం చాలా బిజీగా ఉన్నారు. మహా రాష్ట్ర సీఎం ఫోను ఎత్తరు. యూపీ సీఎం మాతో చర్చించరు’ అంటూ.. విద్యుత్ సమస్యలపై కేంద్రాన్ని సంప్రదించని రాష్ట్రాలనుద్దేశించి మంత్రి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి ఒకరు ‘తనది కేబినెట్ ర్యాంక్’ అంటూ వచ్చి విద్యుత్ సమస్యలపై మాట్లాడతారని పరోక్షంగా ఢిల్లీలోని తెలంగాణ అధికార ప్రతినిధులనుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని ఆ రాష్ట్ర సీఎం కేంద్రం దృష్టికి తెస్తే సంతోషిస్తామని, సత్వరమే పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.