Central Trade Department
-
‘లీడ్స్’లో ఏపీకి తొమ్మిదో ర్యాంక్
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో ఉన్న సరుకు రవాణా పంపిణీ (లీడ్స్)–2021కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 3.17 స్కోర్ సాధించింది. తెలంగాణ మొత్తంగా 3.14 స్కోర్‌తో పదో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు రహదారుల నాణ్యతలో 3.59, రైల్వే మౌలిక వసతులు నాణ్యతలో 3.26, మల్టీమోడల్ టెర్మినల్ నాణ్యతలో 3.38, గిడ్డంగుల నాణ్యతలో 3.27, యూనిమోడల్ టెర్మినల్ నాణ్యతలో 2.92, సరుకు రవాణా పంపిణీ నాణ్యతలో 3.55, సరుకు రవాణా పంపిణీ సేవలందించే సామర్థ్యంలో 3.50, సరుకు రోడ్డు రవాణా ధరల సహేతుకతలో 2.35, టెర్మినల్ సర్వీస్ ధరల సహేతుకతలో 2.47, కార్గో డెలివరీ రవాణాలో 3.48, మొబైల్, ఇంటర్నెట్ సర్వీస్‌లో 3.60 స్కోర్ లభించింది. అలాగే రవాణా సమయంలో సురక్షితం, భద్రతకు 3.61, టెర్మినళ్లల్లో సురక్షితం, భద్రతకు 3.78 స్కోర్ సాధించింది. కాగా, రాబోయే ఐదేళ్లలో సరుకు రవాణా ఖర్చులు ఐదు శాతం తగ్గుముఖం పట్టనున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. లీడ్స్ –2021 నివేదిక విడుదల సందర్భంగా సోమవారం ఆయన న్యూఢిల్లీలో మాట్లాడారు. కాగా, లీడ్స్‌లో తొలి మూడు స్థానాలు.. గుజరాత్ , హరియాణా, పంజాబ్ దక్కించుకున్నాయి. ఆయా రాష్ట్రాలకు సంబంధించి పరిశ్రమల భాగస్వాములు అందించిన సమాచారం, వారి సమస్య ఆధారంగా లీడ్స్ నివేదికను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయా అంశాలపై రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. -
ఎగుమతులు రయ్..
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఊతంతో డిసెంబర్లో ఎగుమతులు 12.36 శాతం మేర వృద్ధి చెందాయి. విలువపరంగా 27.03 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, ముడిచమురు, పసిడి దిగుమతులు భారీగా పెరగడంతో ఇంపోర్ట్ బిల్లు సైతం 21.12 శాతం ఎగిసి రూ. 41.91 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం వార్షిక ప్రాతిపదికన చూస్తే డిసెంబర్లో 41 శాతం ఎగిసి 14.88 బిలియన్ డాలర్లకు చేరింది. ‘గతేడాది అక్టోబర్‌లో 1.1 శాతం తగ్గుదల మినహా.. 2016 ఆగస్టు నుంచి 2017 డిసెంబర్ దాకా ఎగుమతుల ధోరణి సానుకూలంగానే నమోదవుతూ వస్తోంది‘ అని కేంద్రం పేర్కొంది. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్వీటర్లో పేర్కొన్నారు. ఎగుమతులు.. గతేడాది నవంబర్‌లో 26.19 బిలియన్ డాలర్లు కాగా, 2016 డిసెంబర్లో 24.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 300 బిలియన్ డాలర్ల మైలురాయి దాటతాం: ఎఫ్ఐఈవో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల వ్యవధిలోనే 224 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేశ్‌కుమార్ గుప్తా తెలిపారు. 2018లో అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి మెరుగ్గా ఉండనున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం 300 బిలియన్ డాలర్ల మైలురాయిని సులభంగా దాటేయగలమని ధీమా వ్యక్తం చేశారు. 2015–16లో మొత్తం ఎగుమతులు 262 బిలియన్ డాలర్లు కాగా, 2016–17లో 275 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో.. దిగుమతులు దేశీయంగా ఉత్పత్తికి తోడ్పడేవేనా లేక సవాలుగా మారే అవకాశముందా అన్న అంశాన్ని పరిశీలించాలని గుప్తా పేర్కొన్నారు. మరోవైపు, పన్ను విభాగం అధికారుల మొండివైఖరి, అవగాహన లేమి కారణంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్ పొందటంలో ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక వివిధ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల తీరుతెన్నులు ఇలా ఉన్నాయి. ♦ మొత్తం 30 ప్రధాన ఉత్పత్తుల్లో 21 ఉత్పత్తుల ఎగుమతులు వృద్ధి నమోదు చేశాయి. ఇంజనీరింగ్, పెట్రోలియం, సేంద్రియ.. నిరింద్రియ రసాయనాలు, వజ్రాభరణాలు, ఔషధాలు వీటిలో ఉన్నాయి. ♦ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి 25 శాతం. ♦రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 8 శాతం క్షీణించి 1.33 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. ♦పసిడి దిగుమతులు 71.5 శాతం ఎగిసి 3.39 బిలియన్ డాలర్లుగా నమోదు. 2016 డిసెంబర్లో ఈ పరిమాణం 1.97 బిలియన్ డాలర్లే. ♦పెట్రోలియం ఉత్పత్తులు, ముడిచమురు దిగుమతులు 35% పెరిగి 7.66 బిలియన్ డాలర్ల నుంచి 10.34 బిలియన్ డాలర్లకు చేరాయి. ♦ఏప్రిల్–డిసెంబర్ మధ్య తొమ్మిది నెలలకాలంలో ఎగుమతులు 12 శాతం వృద్ధి చెంది 223.51 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు సుమారు 22 శాతం పెరిగి 338.37 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 114.85 బిలియన్ డాలర్లకు చేరింది. -
సెప్టెంబర్ నాటికి కొత్త పారిశ్రామిక విధానం
న్యూఢిల్లీ: నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ఆరు బృందాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 1991 నాటి పారిశ్రామిక విధానాన్ని సమూలంగా సంస్కరించే నూతన విధానం తయారీ బాధ్యతను వాణిజ్య శాఖ పరిధిలోని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) చేపట్టనుంది. కొత్తగా ఏర్పాటైన బృందాల్లో ప్రభుత్వ అధికారులతోపాటు విద్యావేత్తలు, కంపెనీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సెప్టెంబర్ నాటికి కొత్త పాలసీ ముసాయిదా సిద్ధం కానుంది. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్ఎంఈ), కొత్త ఆవిష్కరణలు, పన్నులు, టెక్నాలజీతోపాటు మౌలికవసతులు, మేథోసంపత్తి హక్కులు, సులభంగా వ్యాపార నిర్వహణ, భవిష్యత్తు ఉద్యోగ సామర్థ్యాలపై నివేదికలను ఈ బృందాలు రూపొందించనున్నాయి. 1991 నాటి పారిశ్రామిక విధానాన్ని పూర్తిగా సంస్కరించాల్సి ఉందని.. ఈ నూతన విధానం ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై భారత్‌లో తయారీ, నైపుణ్య భారత్, స్టార్టప్ ఇండియాలకు ఊతమిచ్చేలా ఉంటుందని ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.