సెప్టెంబర్ నాటికి కొత్త పారిశ్రామిక విధానం
న్యూఢిల్లీ: నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ఆరు బృందాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 1991 నాటి పారిశ్రామిక విధానాన్ని సమూలంగా సంస్కరించే నూతన విధానం తయారీ బాధ్యతను వాణిజ్య శాఖ పరిధిలోని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) చేపట్టనుంది. కొత్తగా ఏర్పాటైన బృందాల్లో ప్రభుత్వ అధికారులతోపాటు విద్యావేత్తలు, కంపెనీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సెప్టెంబర్ నాటికి కొత్త పాలసీ ముసాయిదా సిద్ధం కానుంది.
సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్‌ఎంఈ), కొత్త ఆవిష్కరణలు, పన్నులు, టెక్నాలజీతోపాటు మౌలికవసతులు, మేథోసంపత్తి హక్కులు, సులభంగా వ్యాపార నిర్వహణ, భవిష్యత్తు ఉద్యోగ సామర్థ్యాలపై నివేదికలను ఈ బృందాలు రూపొందించనున్నాయి. 1991 నాటి పారిశ్రామిక విధానాన్ని పూర్తిగా సంస్కరించాల్సి ఉందని.. ఈ నూతన విధానం ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై భారత్‌లో తయారీ, నైపుణ్య భారత్, స్టార్టప్ ఇండియాలకు ఊతమిచ్చేలా ఉంటుందని ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.