DIPP
-
సులభతర వాణిజ్యానికి గ్రేడింగ్!
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానాల ద్వారా పారిశ్రామికీకరణ, తద్వారా ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డిప్) ప్రతీ ఏటా రా ష్ట్రాలకు ర్యాంకులను కేటాయిస్తోంది. సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) కోసం ఆయా రాష్ట్రాలు చేపట్టే సంస్కరణల ఆధారంగా.. ప్రపంచ బ్యాంకు సహకారంతో డిప్ ఈ ర్యాంకులను నిర్ణయిస్తోంది. పారిశ్రామిక రంగానికి సంబంధించి 340 అంశాల్లో రాష్ట్రాలు చేపట్టే వాణిజ్య సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బ్రాప్)ను ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకులను ఏటా ప్రకటిస్తున్నారు. అయితే ఈ ర్యాంకింగ్‌ల విధానంపై తెలంగాణ, గుజరాత్ సందేహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఈఓడీబీ ర్యాంకింగ్ విధానాన్ని సమీక్షించిన డిప్.. 2019 నుంచి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ర్యాంకులకు బదులుగా గ్రేడింగ్ విధానం పారిశ్రామికీకరణలో ముందంజలో ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ర్యాంకింగులో వెనుకబడి పోవడం కూడా ఈఓడీబీ ర్యాంకింగ్‌పై సందేహాలకు కార ణమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నుంచి మార్కులు కేటాయించే విధానానికి స్వస్తి పలికి.. గ్రేడింగ్ విధానం పాటించాలని డిప్ నిర్ణయించగా, మార్కులకు బదులుగా దశాంశమాన పద్ధతిలో పాయింట్లు కేటాయిస్తోంది. ఒక్కో సంస్కరణకు సంబంధించి కనీసం 75కు పైగా పాయింట్లు వస్తేనే గ్రేడింగ్ సాధ్యమవుతుంది. గతంలో ఇచ్చిన ర్యాంకింగుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేసిన డిప్.. ఈ ఏడాది పరిశ్రమల శాఖ అందిస్తున్న సేవలను గ్రేడ్ల కేటాయింపులో ప్రాతిపదికగా తీసుకుంటోంది. బడ్జెట్లో ఏటా నిధులు కేటాయిస్తున్నా.. విడుదల కాకపోవడంపై పారిశ్రామికవర్గాలు డిప్ సర్వేలో ప్రతికూలంగా స్పందిం చే అవకాశముంది. ర్యాంకుల స్థానంలో టాప్ అచీవర్ (95 శాతానికి పైగా పాయింట్లు), అచీవర్ (90 నుంచి 95), ఫాస్ట్ మూవర్ (80 నుంచి 90), ఆస్పైరర్స్ (80 కంటే తక్కువ పాయింట్లు) పేరిట డిప్ ఈ ఏడాది ఈఓడీబీ గ్రేడ్లను ప్రకటించనుంది. ఈ ఏడాది గ్రేడింగ్‌పై ప్రభావం ఈ ఏడాది సులభతర వాణిజ్య గ్రేడింగ్‌లో తొలి స్థానం చేరుకునేందుకు అవసరమైన సంస్కరణల అమలుపై తెలంగాణ పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోంది. వివిధ అంశాలకు సంబంధించి చేపట్టిన సంస్కరణలపై.. పారిశ్రామికవర్గాల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఈ ఏడాది ఈఓడీబీ గ్రేడింగ్‌లో కీలకం కానుంది. డిప్ నిర్వహించే సర్వేలో పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీలకు సంబంధిం చిన ప్రతిస్పందన కీలకంగా మారే అవకాశముంది. -
అమెజాన్ 3,000 కోట్ల పెట్టుబడికి ఓకే
♦ పచ్చజెండా ఊపిన డీఐపీపీ ♦ ఇక ఆన్లైన్లో ఆహారోత్పత్తుల విక్రయాలు ♦ ఇక్కడ తయారైనవే విక్రయించాలని షరతు న్యూఢిల్లీ: భారత్‌లో ఆహారోత్పత్తుల రిటైల్ అమ్మకాలకు సంబంధించి ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ప్రతిపాదించిన 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,000 కోట్లు) పెట్టుబడుల ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) దీనికి పచ్చజెండా ఊపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి ఇప్పటిదాకా ప్రభుత్వ అనుమతుల్ని విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) మంజూరు చేస్తోంది. అయితే, ఇటీవలే దీన్ని రద్దు చేయటంతో అమెజాన్ ప్రతిపాదనకు డీఐపీపీ ఆమోదముద్ర వేసింది. తాజా ప్రతిపాదన ప్రకారం ఆహారోత్పత్తుల వ్యాపారానికి సంబంధించి అమెజాన్ భారత్‌లో అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఆహారోత్పత్తులను నిల్వ చేసుకుని, ఆన్లైన్లో విక్రయిస్తుంది. ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కేంద్రం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తోంది. ఈ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీలు భారత్‌లో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసి... దేశీయంగా తయారయ్యే ఆహారోత్పత్తులను మాత్రమే విక్రయించాలి. వీటిని స్టోర్స్ లేదా ఆన్లైన్లో విక్రయించవచ్చు. ఆహారోత్పత్తుల రిటైలింగ్‌లో పెట్టుబడులకు సంబంధించి అమెజాన్, గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ సంస్థల నుంచి సుమారు 695 మిలియన్ డాలర్ల విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు కేంద్రానికి వచ్చాయి. అమెరికాకు చెందిన అమెజాన్ భారత్‌లో కీలకమైన ఈ–కామర్స్ సంస్థల్లో ఒకటి కాగా.. గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ సంస్థలు ఆన్లైన్లో నిత్యావసరాలు మొదలైనవి విక్రయిస్తున్నాయి. 2016–17 (ఏప్రిల్ – డిసెంబర్ మధ్య) భారత ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలోకి 663.23 మిలియన్ డాలర్ల పైగా విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు వచ్చాయి. -
సెప్టెంబర్ నాటికి కొత్త పారిశ్రామిక విధానం
న్యూఢిల్లీ: నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ఆరు బృందాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 1991 నాటి పారిశ్రామిక విధానాన్ని సమూలంగా సంస్కరించే నూతన విధానం తయారీ బాధ్యతను వాణిజ్య శాఖ పరిధిలోని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) చేపట్టనుంది. కొత్తగా ఏర్పాటైన బృందాల్లో ప్రభుత్వ అధికారులతోపాటు విద్యావేత్తలు, కంపెనీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సెప్టెంబర్ నాటికి కొత్త పాలసీ ముసాయిదా సిద్ధం కానుంది. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్ఎంఈ), కొత్త ఆవిష్కరణలు, పన్నులు, టెక్నాలజీతోపాటు మౌలికవసతులు, మేథోసంపత్తి హక్కులు, సులభంగా వ్యాపార నిర్వహణ, భవిష్యత్తు ఉద్యోగ సామర్థ్యాలపై నివేదికలను ఈ బృందాలు రూపొందించనున్నాయి. 1991 నాటి పారిశ్రామిక విధానాన్ని పూర్తిగా సంస్కరించాల్సి ఉందని.. ఈ నూతన విధానం ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై భారత్‌లో తయారీ, నైపుణ్య భారత్, స్టార్టప్ ఇండియాలకు ఊతమిచ్చేలా ఉంటుందని ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. -
సత్తా చాటిన తెలుగు రాష్ట్రాలు
-
టాప్‌లో తెలుగురాష్ట్రాలు
న్యూఢిల్లీ. తెలుగు ప్రజలు మరోసారి వార్తల్లోనిలిచారు. సులువుగా వ్యాపార నిర్వహణలో తెలుగురాష్ట్రాలు తమ సత్తా చాటుకున్నాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు టాప్ ప్లేస్ లో నిలిచాయి. ప్రపంచ బ్యాంకు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) సోమవారం విడుదల చేసిన జాబితాలో అగ్రస్థానాన్ని అక్రమించాయి. ఇరు రాష్ట్రాల మధ్య పోటాపోటీగా సాగిన ఈ పోటీలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు 340 కేటగిరీల్లో 98.78 శాతం దక్కించుకున్నాయి. కాగా గుజరాత్ తన మొదటి స్థానాన్ని కోల్పోయి మూడవ స్థానంతో సరిపెట్టుకోగా, ఛత్తీస్ గఢ్ నాలుగవ స్థానాన్ని నిలుపుకుంది. ఆ తరువాత స్థానాల్లో మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర ఉన్నాయి. కాగా కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ "వర్ధమాన నాయకులు" కేటగిరీలో ఉత్తమంగా నిలిచాయి. త్వరితగతిన అభివృద్ధి చెందాల్సిన గ్రూప్ లో తమిళనాడు, డిల్లీ నిలిచాయి. -
రికార్డ్ స్థాయిలో ఎఫ్‌డీఐలు
♦ ప్రభుత్వ చర్యలే ప్రధాన కారణం ♦ డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ న్యూఢిల్లీ: భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్మెంట్-ఎఫ్‌డీఐ) జోరుగా వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలానికి రికార్డ్ స్థాయిలో 5,100 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఈ స్థాయిలో ఎఫ్‌డీఐలు ఇంతవరకూ ఎన్నడూ రాలేదని డీఐపీపీ(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్) కార్యదర్శి రమేశ్ అభిషేక్ వెల్లడించారు. ఆరోగ్యకరమైన వాణిజ్య వాతావరణం భారత్‌లో నెలకొన్నదని, అందుకని ఎఫ్‌డీఐలు జోరుగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక ఫిక్కి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండంకెల వృద్ధి రేటు అవసరం... 2011-12లో 4,655 కోట్లు, 20114-15లో 4,429 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని రమేశ్ అభిషేక్ వివరించారు. తగిన వాణిజ్య వాతావరణం నెలకొల్పడం కష్టమైన పనేనని, అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకొని వ్యాపారం చేయడం సులభమయ్యే పరిస్థితులను మరింతగా మెరుగుపరచిందని వివరించారు. సంక్లిష్టమైన ప్రక్రియలు, వివిధ అనుమతుల్లో తీవ్రమైన జాప్యం జరుగుతుండడం.. దశాబ్దాలుగా భారత్‌లో కనిపించే పరిస్థితులనీ, క్రమంగా ఈ పరిస్థితులన్నీ తొలగిపోయాయని పేర్కొన్నారు. సగటు మనిషికి, వ్యాపారానికి ఊరటనిచ్చే పలు చర్యలు ప్రభుత్వం తీసుకుందని వివరించారు. వెలుపలి నుంచి వచ్చే టెక్నాలజీకి, ఇక్కడ అభివృద్ధి అయ్యే టెక్నాలజీకి అనువైన వాతావరణం సృష్టించడానికి, సృజనాత్మకత, నవకల్పనలకు రక్షణ కల్పిం చడం ముఖ్యమని తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు రక్షించబడతాయనే నమ్మకం వారికి కలిగేలా తగిన వాతావరణం కల్పించచంలో ప్రభుత్వం విజ యవంతమైందని ఈ ఎఫ్‌డీఐ గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. అడ్డంకులను తొలగించడానికి, మొత్తం వ్యాపార వాతావరణం మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. -
ఫిబ్రవరి 13 నుంచి ‘మేకిన్ ఇండియా వీక్’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో ఫిబ్రవరి 13న ‘మేకిన్ ఇండియా వీక్’ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో 60 దేశాలకు చెందిన 1,000కి పైగా కంపెనీలు, ప్రముఖులు పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆవిష్కరణ, రూపకల్పన, స్థిరత్వం అనే అంశాలు థీమ్‌గా ప్రారంభం కానున్న మేకిన్ ఇండియా వీక్... ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు జరుగుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ (డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ తెలిపారు. అధిక మొత్తంలో ఎఫ్‌డీఐలను ఆకర్షించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రకటించిన దగ్గరి నుంచి గడిచిన 17 నెలల్లో (మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టక ముందు 17 నెలలతో పోలిస్తే) ఎఫ్‌డీఐలు 35 శాతంమేర పెరిగాయన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగిందని ఆటోమోటివ్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి తదితర విభాగాల్లో విదేశీ పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. ఫాక్స్‌కాన్, జెనిత్, ఐకియా, వాండా గ్రూప్ ఆఫ్ చైనా వంటి పలు కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయని తెలియజేశారు. స్టార్టప్స్‌కు, దేశీ కంపెనీలకు చేయూతనందించడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో అంతర్జాతీయ ఇన్ఫ్రా అభివృద్ధే తమ ధ్యేయమని చెప్పారు. చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి ఆయా రాష్ట్రాలతో కలిసి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. -
స్టార్టప్‌లకు నియంత్రణల నుంచి మినహాయింపు!
న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. కొన్నేళ్ల పాటు లేదా నిర్దిష్ట టర్నోవరు సాధించేదాకా వాటికి ప్రభుత్వపరమైన కొన్ని నిబంధనలు, నియంత్రణల నుంచి మినహాయింపులు ఇవ్వాలని యోచిస్తోంది. సంక్లిష్టమైన కంపెనీ రిజిస్ట్రేషన్, లేబర్ రిజిస్ట్రేషన్ లేదా ఆదాయ పన్ను ప్రక్రియల నుంచి స్టార్టప్‌లకు కొంత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరముందని, ఆ దిశగా కసరత్తు చేస్తున్నామని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ చెప్పారు. పెద్ద యెత్తున వస్తున్న స్టార్టప్‌లు, తయారీ సంస్థలు ఎదిగేందుకు అనువైన పరిస్థితులు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని పరిశ్రమల సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ప్రస్తుతం దేశీయంగా 3,200 పైచిలుకు టెక్నాలజీ స్టార్టప్స్ ఉన్నాయని, ఏటా కొత్తగా 800 పైచిలుకు సంస్థలు వస్తున్నాయని అంచనా. మరోవైపు, ప్రపంచ బ్యాంకు వ్యాపారాలకు అనువైన 189 దేశాల జాబితాలో భారత్‌కు 142వ ర్యాంకునివ్వడంపై కాంత్ స్పందించారు. ప్రపంచ బ్యాంకు అధ్యయనం కేవలం ముంబై, ఢిల్లీకే పరిమితం అయ్యిందని, కానీ చాలా సంస్థలు ప్రస్తుతం హర్యానా, పుణె తదితర ప్రాంతాలకు కూడా విస్తరించిన విషయాన్ని అది పరిగణనలోకి తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా భారత్ ర్యాంకింగ్ ఈ ఏడాది మెరుగుపడగలదని అమితాబ్ కాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించడంలో అటు ప్రభుత్వంతో పాటు ఇటు పరిశ్రమ కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న సీమెన్స్ ఇండియా సీఈవో సునీల్ మాథుర్ అభిప్రాయపడ్డారు. చాలా మటుకు కాంట్రాక్టుల నిబంధనలను పరిశ్రమ వర్గాలు సరిగ్గా పాటించకపోవడం వల్లే వివాదాలు తలెత్తుతున్నాయని, ఇందులో ప్రభుత్వాన్ని అనడానికేమీ లేదని మాథుర్ చెప్పారు. -
ఎల్ అండ్ టీ, భెల్‌లకు యుద్ధసామగ్రి తయారీ లెసైన్సు
న్యూఢిల్లీ : నౌకాదళానికి అవసరమయ్యే యుద్ధ సామగ్రిని తయారు చేసే వ్యాపారాలకు సంబంధించి పలు ప్రభుత్వ, ప్రైవేట్ దిగ్గజాలకు కేంద్రం లెసైన్సులు మంజూరు చేసింది. వీటిని దక్కించుకున్న వాటిల్లో లార్సన్ అండ్ టూబ్రో, పిపావవ్, భెల్, ఏబీజీ షిప్‌యార్డ్, అల్ఫా డిజైన్ టెక్నాలజీస్ సంస్థలు ఉన్నాయి. యుద్ధనౌకలు, జలాంతర్గాములు, హై స్పీడ్ బోట్లు మొదలైన వాటి పనులకు సంబంధించి ఈ లెసైన్సులు ఇచ్చినట్లు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం డీఐపీపీ తమ వెబ్సైట్లో పేర్కొంది. -
ప్రభుత్వ ఈ-బిజ్ పోర్టల్‌లో 36 సర్వీసులు
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా ఈ-బిజ్ పోర్టల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 36 సర్వీసులను అనుసంధానం చేయాలని కేంద్రం ప్రతిపాదిం చింది. పర్యావరణ అనుమతులు, ఆస్తి పన్ను, ఫ్యాక్టరీల లెసైన్సులు మొదలైనవి వీటిలో ఉండనున్నాయి. పెట్టుబడుల ప్రతిపాదనలన్నింటికి ఒకే చోట అనుమతులు ఇచ్చేలా ఈ-బిజ్ పోర్టల్‌కు ప్రభుత్వం రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ.. ఈ-బిజ్ పోర్టల్‌తో అనుసంధానించేందుకు 12 కేంద్ర ప్రభుత్వ సర్వీసులు గుర్తించినట్లు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) పేర్కొంది. 9 రాష్ట్రాల్లో పైలట్ ప్రాతిపదికన 24 సర్వీసులు అనుసంధానిస్తున్నట్లు పేర్కొంది. -
మార్చిలో 40 శాతం తగ్గిన ఎఫ్‌డీఐలు
గత ఆర్థిక సంవత్సరం 27 శాతం వృద్ధి -డీఐపీపీ వెల్లడి న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఈ ఏడాది మార్చిలో 40 శాతం తగ్గాయి. గత ఏడాది మార్చిలో 353 కోట్ల డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు ఈ ఏడాది మార్చిలో 40 శాతం తగ్గి 211 కోట్ల డాలర్లకు పడిపోయాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) పేర్కొంది. డిఐపీపీ వెల్లడించిన గణాంకాల ప్రకారం..., గత ఆర్థిక సంవత్సరం చివరి నాలుగు నెలల్లో ఇదే తక్కువ మొత్తం. కాగా గతేడాది నవంబర్‌లో 153 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐలు 27 శాతం పెరిగాయి. -
ఇక మేక్ ఇన్ ఇండియా కీచెయిన్లు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని గురించి అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వేలకొద్దీ షర్ట్ పిన్నులు, కీ చెయిన్లను పంచాలని యోచి స్తోంది. 5,000 మేక్ ఇన్ ఇండియా షర్టు పిన్నులు, సింహం లోగోతో 2,500 మేక్ ఇన్ ఇండియా యాక్రిలిక్/మెటల్ కీ చెయిన్ల తయారీ కోసం పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కొటేషన్లను ఆహ్వానించింది. ఇత్తడితో తయారు చేసే షర్ట్ పిన్నులపై పుత్తడి కోటింగ్ ఉండాలని, కీ చెయిన్లను మెటల్ లేదా యాక్రిలిక్ మెటీరియల్‌తో తయారు చేయాల్సి ఉంటుందని సూచించింది. -
తయారీ హబ్‌గా ఎదగాలంటే ఎగుమతులూ కీలకమే
న్యూఢిల్లీ: కేవలం దేశీ వినియోగానికే పరిమితం కాకుండా ఎగుమతులూ పెరిగినప్పుడే భారత్ .. తయారీ హబ్‌గా ఆవిర్భవించగలదని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ చెప్పారు. మేకిన్ ఇండియా నినాదం తీరుతెన్నులపై ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శలు చేసిన నేపథ్యంలో కాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా బాటలో ఎగుమతులపై కాకుండా దేశీ మార్కెట్‌పై దృష్టి సారిస్తూ మేక్ ఫర్ ఇండియా విధానాన్ని అమల్లోకి తేవాలంటూ రాజన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అమితాబ్ కాంత్.. రాజన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా సరే ప్రాథమికంగా దేశీ మార్కెట్ కోసం ఉత్పత్తి చేసినా .. ఆ తర్వాత క్రమంగా విదేశీ మార్కెట్లలోకి విస్తరించాలని యోచిస్తారని, నిజమైన వ్యాపారవేత్త చేయాల్సిన పని కూడా అదేనని కాంత్ పేర్కొన్నారు. ఎగుమతుల ప్రాధాన్యాన్ని గుర్తెరిగి, మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ప్రధాన పాత్ర పోషించాలంటే దేశీ పరిశ్రమ పోటీతత్వాన్ని మరింతగా అలవర్చుకోవాల్సి ఉంటుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్‌ఖేర్ పేర్కొన్నారు. -
నిర్మాణ రంగంలో ఇక విదేశీ నిధుల జోరు..
సడలించిన ఎఫ్‌డీఐ నిబంధనలు నోటిఫై చేసిన ప్రభుత్వం - కనీస నిర్మాణ విస్తీర్ణం తగ్గింపు - మూలధనం, ఎగ్జిట్ నిబంధనల్లో మార్పులు న్యూఢిల్లీ: నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) మరింత ఆకర్షించే దిశగా కేంద్రం నిబంధనలను సడలించింది. కనీస నిర్మాణ విస్తీర్ణం తగ్గించడంతో పాటు మూలధన అవసరాలు, ఇన్వెస్టర్లు వైదొలిగే నిబంధనలను సవరించింది. నిర్మాణ రంగ అభివృద్ధి కోసం క్యాబినెట్ ఆమోదించిన సవరణలను పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) బుధవారం నోటిఫై చేసింది. దీని ప్రకారం కనీస ఫ్లోర్ ఏరియాను 50,000 చ.మీ. నుంచి 20,000 చ.మీ.కు తగ్గించింది. అలాగే, కనీస మూలధన పరిమాణాన్ని 10 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలి యన్ డాలర్లకు తగ్గించింది. అటు ప్లాట్లు అభివృద్ధి చేసే విషయంలో కనీసం 10 హెక్టార్ల స్థలం ఉండాలన్న నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది. ఈ మేరకు కన్సాలిడేటెడ్ ఎఫ్‌డీఐ పాలసీ సర్క్యులర్ 2014ని డీఐపీపీ విడుదల చేసింది. ఈ చర్యలతో నిర్మాణ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు రాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశీయంగా స్మార్ట్ సిటీల ఏర్పాటుకు, అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణానికి ఊతమివ్వగలదని భావిస్తోంది. టౌన్‌షిప్స్ మొదలైన వాటి నిర్మాణాల్లో ఆటోమేటిక్ పద్ధతి కింద 100% ఎఫ్‌డీఐలకు అనుమతి ఉన్నా.. 2005 నుంచి కొన్ని ఆంక్షలు కూడా ఉండేవి. కొన్నాళ్లుగా నిర్మాణ, రియల్టీ రంగంలో ఎఫ్‌డీఐ నిధుల రాక భారీగా తగ్గింది. 2000 ఏప్రిల్-2014 ఆగస్టుమధ్య కాలంలో నిర్మాణ రంగంలో 23.75 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఈ వ్యవధిలో వచ్చిన ఎఫ్‌డీఐల్లో ఇది 10%. 2006-07 నుంచి 2009-10 దాకా భారీగా వచ్చిన పెట్టుబడులు ఆ తర్వాత మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. మరిన్ని విశేషాలు.. పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకెళ్లేందుకు 2 సంవత్సరాల లాకిన్ పీరియడ్ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ప్రాజెక్టు పూర్తయిన వెంటనే ఇన్వెస్టరు వైదొలిగేందుకు అనుమతించింది. బిల్డింగ్ ప్లాన్/లేఅవుట్‌కి సంబంధిత ప్రభుత్వ శాఖ అనుమచ్చిన తేదీనే ప్రాజెక్టు ప్రారంభ తేదీగా వ్యవహరిస్తారు. ప్రాజెక్టు పూర్తయ్యేలోగా విదేశీ ఇన్వెస్టరు తన వాటాను మరో విదేశీ ఇన్వెస్టరుకు కూడా బదలాయించేందుకు అవకాశాలు ఉన్నాయి. పరిస్థితిని బట్టి ఇలాంటి అనుమతులు ఇస్తారు. ఇక, ఎలాంటి గందరగోళం ఉండకుండా డెవలప్డ్ ప్లాట్లు, ఫ్లోర్ ఏరియా, రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలైన వాటి నిర్వచనాలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. పూర్తయిపోయిన టౌన్‌షిప్‌లు, మాల్స్ మొదలైన వాటి నిర్వహణ కార్యకలాపాల్లోను 100 శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ పద్ధతి వర్తిస్తుంది. -
వ్యాపార సంస్కరణలపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించే దిశగా చర్యలపై కేంద్రం దృష్టి సారిస్తోంది. వ్యాపార రిజిస్ట్రేషన్ వ్యవధిని ఒక్క రోజుకు తగ్గించడం, అన్ని అనుమతులకు ఒకే దరఖాస్తు, కార్మిక చట్టాలను సవరించడం, వివిధ రకాల పన్నులను క్రమబద్ధీకరించడం తదితర అంశాలపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో భారత ర్యాంకింగ్‌ను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన కొన్ని సంస్కరణలు, దృష్టి సారించాల్సిన రంగాలను పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) గుర్తించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ విభాగాలు తీసుకోతగిన 46 యాక్షన్ పాయింట్లతో డీఐపీపీ ఒక జాబితా రూపొందించింది. కెనడా, న్యూజిల్యాండ్ తరహాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వ్యవధిని ప్రస్తుత 27 రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సూచించింది. ఇక, జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ కింద వేగవంతంగా బెంచీలను ఏర్పాటు చేయడం, దివాలా చట్టాన్ని ప్రవేశపెట్టడం తదితర సిఫార్సులు కూడా చేసింది. అలాగే, సంక్లిష్టమైన పన్ను ప్రక్రియలను సరళతరం చేయడం, ప్రత్యక్ష పన్నుల కోడ్, వస్తు .. సేవల పన్నుల విధానాన్ని సత్వరం అమలు చేయడం మొదలైన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని డీఐపీపీ పేర్కొంది. సింగిల్ విండో క్లియరెన్సుల కోసం రాష్ట్రాలన్నింటిలోనూ ఒకే రకమైన విధానాలను అమల్లోకి తేవాల్సి ఉందని వివరించింది. ఈ అంశాలపై వివిధ శాఖలతో డీఐపీపీ ఇప్పటికే చర్చలు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.