న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. కొన్నేళ్ల పాటు లేదా నిర్దిష్ట టర్నోవరు సాధించేదాకా వాటికి ప్రభుత్వపరమైన కొన్ని నిబంధనలు, నియంత్రణల నుంచి మినహాయింపులు ఇవ్వాలని యోచిస్తోంది. సంక్లిష్టమైన కంపెనీ రిజిస్ట్రేషన్, లేబర్ రిజిస్ట్రేషన్ లేదా ఆదాయ పన్ను ప్రక్రియల నుంచి స్టార్టప్‌లకు కొంత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరముందని, ఆ దిశగా కసరత్తు చేస్తున్నామని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ చెప్పారు. పెద్ద యెత్తున వస్తున్న స్టార్టప్‌లు, తయారీ సంస్థలు ఎదిగేందుకు అనువైన పరిస్థితులు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని పరిశ్రమల సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు.
ప్రస్తుతం దేశీయంగా 3,200 పైచిలుకు టెక్నాలజీ స్టార్టప్స్ ఉన్నాయని, ఏటా కొత్తగా 800 పైచిలుకు సంస్థలు వస్తున్నాయని అంచనా. మరోవైపు, ప్రపంచ బ్యాంకు వ్యాపారాలకు అనువైన 189 దేశాల జాబితాలో భారత్‌కు 142వ ర్యాంకునివ్వడంపై కాంత్ స్పందించారు. ప్రపంచ బ్యాంకు అధ్యయనం కేవలం ముంబై, ఢిల్లీకే పరిమితం అయ్యిందని, కానీ చాలా సంస్థలు ప్రస్తుతం హర్యానా, పుణె తదితర ప్రాంతాలకు కూడా విస్తరించిన విషయాన్ని అది పరిగణనలోకి తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా భారత్ ర్యాంకింగ్ ఈ ఏడాది మెరుగుపడగలదని అమితాబ్ కాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించడంలో అటు ప్రభుత్వంతో పాటు ఇటు పరిశ్రమ కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న సీమెన్స్ ఇండియా సీఈవో సునీల్ మాథుర్ అభిప్రాయపడ్డారు. చాలా మటుకు కాంట్రాక్టుల నిబంధనలను పరిశ్రమ వర్గాలు సరిగ్గా పాటించకపోవడం వల్లే వివాదాలు తలెత్తుతున్నాయని, ఇందులో ప్రభుత్వాన్ని అనడానికేమీ లేదని మాథుర్ చెప్పారు.
స్టార్టప్‌లకు నియంత్రణల నుంచి మినహాయింపు!
Published Fri, Oct 2 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM
Advertisement
Advertisement