వ్యాపార సంస్కరణలపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించే దిశగా చర్యలపై కేంద్రం దృష్టి సారిస్తోంది. వ్యాపార రిజిస్ట్రేషన్ వ్యవధిని ఒక్క రోజుకు తగ్గించడం, అన్ని అనుమతులకు ఒకే దరఖాస్తు, కార్మిక చట్టాలను సవరించడం, వివిధ రకాల పన్నులను క్రమబద్ధీకరించడం తదితర అంశాలపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో భారత ర్యాంకింగ్‌ను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన కొన్ని సంస్కరణలు, దృష్టి సారించాల్సిన రంగాలను పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) గుర్తించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ విభాగాలు తీసుకోతగిన 46 యాక్షన్ పాయింట్లతో డీఐపీపీ ఒక జాబితా రూపొందించింది. కెనడా, న్యూజిల్యాండ్ తరహాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వ్యవధిని ప్రస్తుత 27 రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సూచించింది.
ఇక, జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ కింద వేగవంతంగా బెంచీలను ఏర్పాటు చేయడం, దివాలా చట్టాన్ని ప్రవేశపెట్టడం తదితర సిఫార్సులు కూడా చేసింది. అలాగే, సంక్లిష్టమైన పన్ను ప్రక్రియలను సరళతరం చేయడం, ప్రత్యక్ష పన్నుల కోడ్, వస్తు .. సేవల పన్నుల విధానాన్ని సత్వరం అమలు చేయడం మొదలైన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని డీఐపీపీ పేర్కొంది. సింగిల్ విండో క్లియరెన్సుల కోసం రాష్ట్రాలన్నింటిలోనూ ఒకే రకమైన విధానాలను అమల్లోకి తేవాల్సి ఉందని వివరించింది. ఈ అంశాలపై వివిధ శాఖలతో డీఐపీపీ ఇప్పటికే చర్చలు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.