Department of Corporate Affairs
-
చైనా కంపెనీల సీఏలపై నియంత్రణ సంస్థల కన్ను
న్యూఢిల్లీ: నిర్దిష్ట చైనా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు భారత్లో నమోదు చేసుకోవడంలో జరిగిన ఉల్లంఘనలపై నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందుకు సహకరించిన అనేక మంది చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్లకు చర్యలకు ఉపక్రమించాయి. దీనికి సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ)కి కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి 400 పైచిలుకు ఫిర్యాదులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉల్లంఘనలకు పాల్పడిన సభ్యుల వివరాలను ఆయా సంస్థలకు కేంద్రం ఇచ్చిందని, తగు చర్యలు తీసుకోవాలని సూచించిందని పేర్కొన్నాయి. దీంతో ఐసీఏఐ, ఐసీఎస్ఐలతో పాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా తమ తమ సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాయి. కంపెనీల చట్టం నిబంధనలను వారు ఉల్లంఘించారని నిర్ధారణ అయిన పక్షంలో వారిపై తగు క్రమశిక్షణ చర్యలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ తమకు 200 కేసుల వివరాలు వచ్చినట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ దేబాషీస్ మిత్రా తెలిపారు. ఆయా సంస్థలు నిబంధనల ప్రకారమే రిజిస్టర్ అయ్యాయా, చిరునామాలను సరిగ్గానే ధృవీకరించుకున్నారా లేదా వంటి అంశాలు వీటిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఐసీఏఐలో 3.50 లక్షల మంది పైగా, ఐసీఎస్ఐలో 68,000 మంది, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్లో 90,000 పైచిలుకు సభ్యులు ఉన్నారు. ఈ మూడు సంస్థలు కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలో పనిచేస్తాయి. ఇటీవలి కాలంలో భారత్లో అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్న చైనా కంపెనీలపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. -
వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తుల జప్తు!
ముంబై: వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తుల స్తంభన, జప్తునకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ముంబై బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల వల్ల ప్రమోటర్లు తమ ఆస్తుల తనఖా, వేలం, అమ్మకంసహా వాటిపై ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేరు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) దాఖలు చేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ తాజా ఆదేశాలు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. కీలక ఆదేశాల్లో అంశాలను పరిశీలిస్తే... ► సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్లకు..: వీడియోకాన్ ప్రమోటర్లకు ఏదైనా కంపెనీ లేదా సొసైటీలో ఉన్న షేర్లను స్తంభింపజేయలని, ఎటువంటి అమ్మకం, బదలాయింపునైనా నిషేధించాలని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)లను ఎన్సీఎల్టీ ఆదేశించింది. ఆలాగే ఆయా వివరాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు తెలియజేయాలని కూడా సూచించింది. ► సీబీడీటీకి..: వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తులకు సంబంధించి తెలిసిన వివరాలను వెల్లడించాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ)ను కూడా ట్రిబ్యునల్ ఆదేశించింది. ప్రమోటర్ల బ్యాంక్ అకౌంట్లు, లాకర్ల వివరాలను వెల్లడించాలని, తక్షణం ఆయా అకౌంట్లను లాకర్లను స్తంభింపజేయడానికి చర్యలు తీసుకోవాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు ఆదేశాలు ఇచ్చింది. ► పీఎంసీఏకు సూచనలు: వీడియోకాన్ ప్రమోటర్లకు ఉన్న చరాస్తుల వివరాలను గుర్తించి తెలియజేయలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు లేఖలు రాయడానికి కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ)కు ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. కేసు వివరాలు ఇవీ... కంపెనీలోఆర్థిక అవకతవకలు, కుంభకోణాల విషయంలో వీడియోకాన్ వ్యవస్థాపకుడు, సీఎండీ వేణుగోపాల్ ధూత్, ఇతర మాజీ డైరెక్టర్లు, సీనియర్ అధికారులను విచారించి తగిన చర్యలు తీసుకోడానికి, అక్రమ సంపాదన రికవరీకి తగిన అనుమతులు ఇవ్వాలంటూ కంపెనీల చట్టం సెక్షన్ 241, 242 కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. వీడియోకాన్ లిమిటెడ్లో మిగులు, నిల్వలు మొత్తంగా రూ.10,028.09 కోట్లని 2014 ఫైనాన్షియల్ రిపోర్ట్ పేర్కొంది. కేవలం ఐదేళ్ల కాలంలో (2018–19 నాటికి) కంపెనీ రూ.2,972.73 కోట్ల నష్టాల్లోకి వెళ్లిపోవడంపై భాస్కర పంతుల్ మహన్, నారిన్ కుమార్ భోలాలతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కంపెనీరుణాలు రూ.20,149.23 కోట్ల నుంచి రూ.28,586.87 కోట్లకు పెరిగిపోవడం గమనార్హం. ‘‘మునిగిపోతున్న నౌకకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ భారీగా రుణాలను మంజూరు చేయడం, అదే సంస్థ దివాలా కోడ్ సెక్షన్ 7 కింద పిటిషన్ దాఖలు చేయడం అశ్చర్యంగా ఉంది’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఆయా అంశాలన్నింటిపై సమగ్రంగా విచారించాలని ఎన్సీఎల్టీ ఆదేశాలు ఇచ్చింది. తీవ్ర మోసపూరితమైన కేసులను విచారించే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)కు కూడా తన ఉత్తర్వు ప్రతిని అందించాలని ఆదేశించింది. -
భారత్లో అమెజాన్ రూ. 1,700 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్లో జోరుగా కార్యకలాపాలు విస్తరిస్తున్న అమెరికన్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. చెల్లింపులు, హోల్సేల్ వ్యాపార విభాగాల్లోకి రూ. 1,700 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్ పే ఇండియా విభాగానికి అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్డాట్కామ్డాట్ఐఎన్సీఎస్ నుంచి రూ. 1,355 కోట్లు వచ్చాయి. ఇందుకు ప్రతిగా ఆయా సంస్థలకు అమెజాన్ పే ఇండియా షేర్లు కేటాయించింది. ఆ రెండు సంస్థల నుంచి రూ. 360 కోట్లు అందుకున్న అమెజాన్ హోల్సేల్ (ఇండియా) కూడా షేర్లు కేటాయించింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన పత్రాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. గతేడాది అక్టోబర్లోనే వివిధ విభాగాలపై అమెజాన్ రూ. 4,400 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. -
వ్యాపార సంస్కరణలపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించే దిశగా చర్యలపై కేంద్రం దృష్టి సారిస్తోంది. వ్యాపార రిజిస్ట్రేషన్ వ్యవధిని ఒక్క రోజుకు తగ్గించడం, అన్ని అనుమతులకు ఒకే దరఖాస్తు, కార్మిక చట్టాలను సవరించడం, వివిధ రకాల పన్నులను క్రమబద్ధీకరించడం తదితర అంశాలపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో భారత ర్యాంకింగ్ను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన కొన్ని సంస్కరణలు, దృష్టి సారించాల్సిన రంగాలను పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) గుర్తించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ విభాగాలు తీసుకోతగిన 46 యాక్షన్ పాయింట్లతో డీఐపీపీ ఒక జాబితా రూపొందించింది. కెనడా, న్యూజిల్యాండ్ తరహాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వ్యవధిని ప్రస్తుత 27 రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సూచించింది. ఇక, జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ కింద వేగవంతంగా బెంచీలను ఏర్పాటు చేయడం, దివాలా చట్టాన్ని ప్రవేశపెట్టడం తదితర సిఫార్సులు కూడా చేసింది. అలాగే, సంక్లిష్టమైన పన్ను ప్రక్రియలను సరళతరం చేయడం, ప్రత్యక్ష పన్నుల కోడ్, వస్తు .. సేవల పన్నుల విధానాన్ని సత్వరం అమలు చేయడం మొదలైన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని డీఐపీపీ పేర్కొంది. సింగిల్ విండో క్లియరెన్సుల కోసం రాష్ట్రాలన్నింటిలోనూ ఒకే రకమైన విధానాలను అమల్లోకి తేవాల్సి ఉందని వివరించింది. ఈ అంశాలపై వివిధ శాఖలతో డీఐపీపీ ఇప్పటికే చర్చలు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ప్రైవేట్ కంపెనీలకు ఊరట
ఫాస్ట్ ట్రాక్... కొత్త కంపెనీల చట్టానికి త్వరలో సవరణలు న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీలపై పాలనా సంబంధ భారాన్ని తగ్గించే ఉద్దేశంతో కొత్త కంపెనీల చట్టంలోని కొన్ని నిబంధనలను సరళతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో దాదాపు 13 సడలింపులను కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రతిపాదించింది. షేర్ క్యాపిటల్, ఓటింగ్ హక్కులు, ఆడిటర్, డెరైక్టర్ల నియామకం, పబ్లిక్ డిపాజిట్ల స్వీకరణపై నిషేధం, బోర్డు హక్కులు, డెరైక్టర్లకు రుణాలు, ఉన్నత యాజ మాన్య స్థాయి సిబ్బంది నియామకాలపై పరిమితుల నిబంధనలను సడలించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ మేరకు రూపొం దించిన ముసాయిదా నోటిఫికేషన్పై ప్రజలు తమ సూచనలు, వ్యాఖ్యానాలను జూలై 1లోగా పంపాలనీ, తర్వాత నోటిఫికేషన్ను పార్లమెంటు ఉభయ సభల ముందుంచుతామని ఆ శాఖ ఓ సర్క్యులర్లో తెలిపింది.