ముంబై: వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తుల స్తంభన, జప్తునకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), ముంబై బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల వల్ల ప్రమోటర్లు తమ ఆస్తుల తనఖా, వేలం, అమ్మకంసహా వాటిపై ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేరు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ తాజా ఆదేశాలు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.
కీలక ఆదేశాల్లో అంశాలను పరిశీలిస్తే...
► సీడీఎస్‌ఎల్, ఎన్‌ఎస్‌డీఎల్‌లకు..: వీడియోకాన్ ప్రమోటర్లకు ఏదైనా కంపెనీ లేదా సొసైటీలో ఉన్న షేర్లను స్తంభింపజేయలని, ఎటువంటి అమ్మకం, బదలాయింపునైనా నిషేధించాలని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్‌ఎల్), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్)లను ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. ఆలాగే ఆయా వివరాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు తెలియజేయాలని కూడా సూచించింది.
► సీబీడీటీకి..: వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తులకు సంబంధించి తెలిసిన వివరాలను వెల్లడించాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ)ను కూడా ట్రిబ్యునల్ ఆదేశించింది. ప్రమోటర్ల బ్యాంక్ అకౌంట్లు, లాకర్ల వివరాలను వెల్లడించాలని, తక్షణం ఆయా అకౌంట్లను లాకర్లను స్తంభింపజేయడానికి చర్యలు తీసుకోవాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు ఆదేశాలు ఇచ్చింది.
► పీఎంసీఏకు సూచనలు: వీడియోకాన్ ప్రమోటర్లకు ఉన్న చరాస్తుల వివరాలను గుర్తించి తెలియజేయలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు లేఖలు రాయడానికి కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ)కు ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది.
కేసు వివరాలు ఇవీ...
కంపెనీలోఆర్థిక అవకతవకలు, కుంభకోణాల విషయంలో వీడియోకాన్ వ్యవస్థాపకుడు, సీఎండీ వేణుగోపాల్ ధూత్, ఇతర మాజీ డైరెక్టర్లు, సీనియర్ అధికారులను విచారించి తగిన చర్యలు తీసుకోడానికి, అక్రమ సంపాదన రికవరీకి తగిన అనుమతులు ఇవ్వాలంటూ కంపెనీల చట్టం సెక్షన్ 241, 242 కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. వీడియోకాన్ లిమిటెడ్‌లో మిగులు, నిల్వలు మొత్తంగా రూ.10,028.09 కోట్లని 2014 ఫైనాన్షియల్ రిపోర్ట్ పేర్కొంది. కేవలం ఐదేళ్ల కాలంలో (2018–19 నాటికి) కంపెనీ రూ.2,972.73 కోట్ల నష్టాల్లోకి వెళ్లిపోవడంపై భాస్కర పంతుల్ మహన్, నారిన్ కుమార్ భోలాలతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఇదే సమయంలో కంపెనీరుణాలు రూ.20,149.23 కోట్ల నుంచి రూ.28,586.87 కోట్లకు పెరిగిపోవడం గమనార్హం. ‘‘మునిగిపోతున్న నౌకకు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ భారీగా రుణాలను మంజూరు చేయడం, అదే సంస్థ దివాలా కోడ్ సెక్షన్ 7 కింద పిటిషన్ దాఖలు చేయడం అశ్చర్యంగా ఉంది’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఆయా అంశాలన్నింటిపై సమగ్రంగా విచారించాలని ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు ఇచ్చింది. తీవ్ర మోసపూరితమైన కేసులను విచారించే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ)కు కూడా తన ఉత్తర్వు ప్రతిని అందించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment