Foreclosure
-
Foreclosure: వేలంలో ‘ప్రాపర్టీ’ కొనొచ్చా?
సొంతిల్లు ప్రతి ఒక్కరి లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుంది. కానీ, మార్కెట్లో ఇళ్ల ధరలు చూస్తే.. అంత పెట్టి కొనగలమా? అనేట్టు ఉన్నాయి. మధ్యతరగతి వారు కూడా కొనలేని విధంగా కొన్ని ప్రాంతాల్లో రేట్లు ఉన్నాయంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ పరిస్థితుల్లో కొంచెం అందుబాటు ధరల ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? కొన్నేళ్ల పాతది అయినా ఫర్వాలేదని భావించే వారికి.. ‘ఫోర్ క్లోజ్డ్’ ప్రాపర్టీలు (జప్తు చేసిన ఆస్తులు) ఒక మార్గం. బ్యాంకులు జప్తు చేసిన ఈ ఆస్తులలో తమ స్థోమతకు తగ్గట్టు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలి? అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటి? ఇందులో ఉండే లాభ, నష్టాల వివరాలను తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోలుకు రుణాలు ఇస్తుంటాయి. రుణ గ్రహీతలు నెలవారీ ఈఎంఐల చెల్లింపుల్లో విఫలమైతే ఆయా ఆస్తులను బ్యాంక్‌లు స్వాధీనం చేసుకుంటాయి. నిర్ణీత కాలం పాటు రుణ వాయిదాలు చెల్లించకపోతే రుణ గ్రహీతకు నోటీసు ఇచ్చిన తర్వాత బ్యాంకులు ఈ చర్యలు చేపడతాయి. ఇలా బ్యాంకుల స్వాధీనంలోకి వెళ్లిన వాటిని ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీస్‌గా చెబుతారు. ఇలాంటి ఆస్తులకు బ్యాంకులు వేలం నిర్వహిస్తుంటాయి. వేలంలో విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రుణ వసూలుగా అవి ఖాతాల్లో చూపిస్తాయి. అంటే తాము ఇచ్చిన రుణాన్ని ఈ రూపంలో అవి రికవరీ చేసుకుంటాయి. ఒక్కసారి బ్యాంక్ ఓ ఇంటిని స్వాధీనం చేసుకుందంటే.. సర్ఫేసీ చట్టం కింద దానికి యజమానిగా మారిపోతుంది. అటువంటి ఇళ్లను విక్రయించేందుకు నూరు శాతం హక్కులు వాటికి దఖలు పడతాయి. ఈ తరహా ప్రాపర్టీలను మార్కెట్లో పలుకుతున్న రేటు కంటే తక్కువకే బ్యాంకులు సాధారణంగా విక్రయిస్తుంటాయి. ఎందుకంటే తమ రుణ బకాయిలను రాబట్టుకోవడమే ఇక్కడ బ్యాంకులకు ప్రాధాన్యంగా ఉంటుంది. అంతేకానీ, మార్కెట్ రేటు కంటే మెరుగైన ధరకు విక్రయించుకుని, కాస్త లాభపడదామన్న సగటు వినియోగదారుని ధోరణి బ్యాంకులకు ఉండదు. పైగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 70–80 శాతానికే రుణం ఇస్తాయి. అది కూడా ప్రభుత్వ రికార్డుల్లోని వ్యాల్యుయేషన్ ఆధారంగానే ఉంటుంది. మార్కెట్ రేటు ఆధారంగా రుణాలు ఇవ్వవు. ప్రాపర్టీని సగం ధరకు విక్రయించినా వాటి రుణం మొత్తం వసూలైపోతుంది. అందుకనే తక్కువ రేటుకు ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీలు లభిస్తుంటాయి. అనుకూలతలు... ప్రతికూలతలు బ్యాంకులు వేలానికి పెట్టే ఇళ్ల ధరలు మార్కెట్ రేటు కంటే తక్కువకు లభించడమే ప్రధాన అనుకూలతగా చెప్పుకోవాలి. ఎంత మేర తక్కువకు వస్తాయంటే..? కచ్చితంగా ఇంత శాతం అని కాకుండా, సంబంధిత ప్రాపర్టీ పట్టణంలోనా, పట్టణ శివారులోనా, మండల కేంద్రంలోనా అనే దాని ఆధారంగా రేట్ల వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా 20–30 శాతం వరకు మార్కెట్ రేటు కంటే చౌకగా ఇవి లభిస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే రుణ బకాయి ఎంత మేరకు బ్యాంకుకు వసూలు కావాల్సి ఉందన్న అంశం కూడా ధరను నిర్ణయిస్తుంది. ఇచ్చిన రుణంలో సగమే తిరిగి రావాలనుకుంటే బ్యాంకులు ఇంకాస్త తక్కువ ధరకే వాటిని విడిచిపెట్టొచ్చు. ఇలా వేలంలో కొనుగోలు చేసే జప్తు ఆస్తులకు న్యాయపరమైన చిక్కులు దాదాపుగా ఉండవు. ఎందుకంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఆయా ప్రాపర్టీలకు రుణాలు ఇచ్చే ముందు న్యాయపరమైన అన్ని కోణాలను పరిశీలిస్తాయి. పైగా బ్యాంక్ వేలాలకు చట్టపరమైన రక్షణ ఉంది. ఇవి సర్ఫేసీ చట్టం, డీఆర్టీ చట్టం పరిధిలోకి వస్తాయి. బ్యాంకుల వేలంలో కొనుగోలు చేసిన వాటి బదిలీ ప్రక్రియ రెండు మూడు నెలల్లో పూర్తయిపోతుంది. యాజమాన్య హక్కులు ఒక నెలలోనే లభిస్తాయి. కాకపోతే వాటి స్వాధీనానికి మరో నెల, రెండు నెలలు పట్టొచ్చు. ∙ బ్యాంకులు స్వాధీనం చేసుకుని విక్రయించే ఇళ్ల నాణ్యత ఏ మేరకు అన్నది సందేహమే. బ్యాంకులు రుణం వసూలు కాకపోతే రుణ గ్రహీత నుంచి ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని వేలం పెడతాయే కానీ, దాని వయసు ఎంత? కండీషన్ బాగుందా, లేదా, నాణ్యత ఇత్యాది అంశాలేవీ అవి పట్టించుకోవు, ఆ వివరాలను వెల్లడించవు. ఏవైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే అవి వేలంలో కొనుగోలు చేసుకున్న వ్యక్తే భరించాల్సి ఉంటుంది. బ్యాంకులు చేయించి ఇవ్వవు. వాటిపై ఆ బాధ్యత కూడా ఉండదు. ఉన్నది ఉన్న స్థితిలోనే వేలం పెడుతున్నట్టు నియమ, నిబంధనల్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు స్పష్టంగా పేర్కొంటాయి. కనుక నాసిరకం నిర్మాణం అయితే ఆ మేరకు కొనుగోలుదారు నిరాశకు గురికావచ్చు. చూడాల్సినవి.. ముందు జాగ్రత్తలు.. జప్తు చేసిన ఇంటికి పూర్వపు యజమాని (రుణం చెల్లించలేకపోయిన) నుంచి కొన్ని బాకీలు ఉండొచ్చు. ప్రాపర్టీ పన్నులు, సొసైటీ మెయింటెనెన్స్ చార్జీలు, విద్యుత్ బిల్లులు, ఇతరత్రా ఏవైనా బకాయిలు ఉంటే వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. వేలంలో కొనుగోలు చేసిన వారే స్వయంగా ఆయా బకాయిలు తీర్చేయాల్సి ఉంటుంది. వేలానికి పెట్టిన ఇల్లు, ధర ఆకర్షణీయంగా ఉన్నాయని, ఇంకేవీ తెలుసుకోకుండా ఉత్సాహంగా పాల్గొని కొనేయడం కాకుండా.. ముందస్తుగా ఈ వివరాలు అన్నీ ఆరాతీయాలి. కనుక ప్రాపర్టీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. వారితో డాక్యుమెంట్లను తనిఖీ చేయించాలి. మరీ పాత ఇళ్లను కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే 20–30 ఏళ్లు దాటిన ఇళ్లకు ఏమంత విలువ ఉండదు. అందులో నివాసం ఉండేట్టు అయితే పూర్తిగా నవీకరించుకోవాల్సి రావచ్చు. అందుకోసం ఖర్చు అంచనా ఉండాలి. వేలానికి వచ్చే ఇళ్లు/ఫ్లాట్లలో ఎవరైనా అద్దెకు ఉంటే, వారిని ఖాళీ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా కొనుగోలుదారుపైనే ఉంటుంది. చాలా కాలంగా కిరాయిదారు ఉంటే, కొన్ని సందర్భాల్లో ఖాళీ చేసి వెళ్లిపోవడానికి నిరాకరించొచ్చు. అందుకని వేలానికి ఉంచిన ఇళ్లల్లో కిరాయిదారు ఉంటున్నట్టు అయితే వాటిని ఎంపిక చేసుకోకుండా ఉండడమే మంచి నిర్ణయం అవుతుంది. గుర్తించడం ఎలా..? జప్తు చేసిన ఆస్తులకు సంబంధించిన సమాచారం అంతగా ప్రచారంలో ఉండదు. వీటి గురించి తెలియజేసే ఓ ఏకీకృత డేటాబేస్ అంటూ లేదు. అందుకని ఫోర్ క్లోజ్డ్ ఆస్తులకు సంబంధించిన సమాచారం కోసం ప్రత్యేకంగా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. ‘ఫోర్క్లోజర్ఇండియా డాట్ కామ్’, ఎన్‌పీఏసోర్స్ డాట్ కామ్, బ్యాంక్ ఈఆక్షన్స్, బ్యాంకుడీఆర్టీ డాట్ కామ్ పోర్టళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే, స్థానిక పత్రికల్లోనూ బ్యాంకులు ప్రకటనలు ఇచ్చి వేలం నిర్వహిస్తుంటాయి. వీటికి సంబంధించి బ్యాంక్ శాఖల వద్ద బ్యానర్లు కూడా కనిపిస్తుంటాయి. ఎస్బీఐ అయితే తన పోర్టల్‌లోనే ఇలాంటి వేలం ఆస్తులకు ప్రత్యేక పేజీ నిర్వహిస్తోంది. బ్యాంకు శాఖలను సంప్రదించడం ద్వారా వేలానికి వచ్చే ప్రాపర్టీల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రాపర్టీ ఎంపిక, వేలంలో పాల్గొనడం..? వేలానికి సంబంధించి ప్రాథమిక సమాచారం తెలుసుకున్న తర్వాత బ్యాంక్ అధికారితో కలసి జప్తు చేసిన ఇంటిని సందర్శించొచ్చు. వేలం పోర్టల్‌లో ఇంటిపై రుణం తీసుకుని చెల్లించలేకపోయిన వ్యక్తి పేరు, ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది?, రిజర్వ్ ధర, వేలం తేదీ, సమయం, ముందస్తుగా చేయాల్సిన డిపాజిట్, ఇలాంటి వివరాలు అన్నీ ఉంటాయి. వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకుంటే దరఖాస్తుతోపాటు, కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంక్‌కు సమర్పించాలి. అలాగే బిడ్ విలువలో 5–20 శాతాన్ని వేలానికి ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. వేలం రోజున అధికంగా బిడ్ చేసిన వ్యక్తిని విజేతగా బ్యాంక్ ప్రకటిస్తుంది. సంబంధిత వ్యక్తి బిడ్ ధరలో ముందుగా చెల్లించింది మినహాయించగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు చెప్పిన తేదీలోపు చెల్లించాలి. దీనికి ఎంత వ్యవధి, నియమ, నిబంధనలను బ్యాంకులు ముందే ప్రకటిస్తాయి. అవసరమైతే అప్పుడు రుణ మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ముందుగా సంబంధిత ప్రాపర్టీకి సరిపడా తమ వంతుగా సమకూర్చుకునే సామర్థ్యం ఉంటేనే వేలంలో పాల్గొనాలి. -
రూ.110 కోట్ల ‘మైత్రీ ప్లాంటేషన్స్’ ఆస్తుల జప్తు
సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి మదుపరులను మోసగించిన కేసులో మైత్రీ ప్లాంటేషన్స్–హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.110 కోట్ల విలువైన 210 స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఆ కంపెనీతోపాటు దాని అనుబంధ కంపెనీలైన శ్రీనక్షత్ర బిల్డర్స్–డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మైత్రీ రియల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థల డైరెక్టర్లు లక్కు కొండారెడ్డి, లక్కు మాల్యాద్రిరెడ్డి, లక్కు మాధవరెడ్డి, కొలికపూడి బ్రహ్మారెడ్డి పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ సంస్థలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 2013లో నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఆస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన 210 స్థిరాస్తుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 196, తెలంగాణలో 13, కర్ణాటకలో ఒకటి ఉన్నాయి. మైత్రీ ప్లాంటేషన్స్–హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లక్కు కొండారెడ్డి, ఇతరులు నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి డిపాజిట్లు సేకరించారని ఏపీ పోలీసులు 2013లో 12 ఎఫ్ఐఆర్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును ఈడీ చేపట్టడంతో కుంభకోణం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. లక్కు కొండారెడ్డి, తదితరులు అధిక కమీషన్లు ఎరజూపి ఏజెంట్లను నియమించుకుని మరీ డిపాజిట్ల సేకరణ చేపట్టారు. మదుపరులకు అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపించి ఏకంగా రూ.288.42 కోట్లను డిపాజిట్లుగా సేకరించారు. అనంతరం ఆ నిధులను నిబంధనలకు విరుద్ధంగా తమ రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి మళ్లించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఈ కేసులో ఆస్తులను జప్తు చేసిన ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. -
వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తుల జప్తు!
ముంబై: వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తుల స్తంభన, జప్తునకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ముంబై బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల వల్ల ప్రమోటర్లు తమ ఆస్తుల తనఖా, వేలం, అమ్మకంసహా వాటిపై ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేరు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్సీఎల్టీ తాజా ఆదేశాలు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. కీలక ఆదేశాల్లో అంశాలను పరిశీలిస్తే... ► సీడీఎస్ఎల్, ఎన్‌ఎస్‌డీఎల్‌లకు..: వీడియోకాన్ ప్రమోటర్లకు ఏదైనా కంపెనీ లేదా సొసైటీలో ఉన్న షేర్లను స్తంభింపజేయలని, ఎటువంటి అమ్మకం, బదలాయింపునైనా నిషేధించాలని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)లను ఎన్సీఎల్టీ ఆదేశించింది. ఆలాగే ఆయా వివరాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు తెలియజేయాలని కూడా సూచించింది. ► సీబీడీటీకి..: వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తులకు సంబంధించి తెలిసిన వివరాలను వెల్లడించాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ)ను కూడా ట్రిబ్యునల్ ఆదేశించింది. ప్రమోటర్ల బ్యాంక్ అకౌంట్లు, లాకర్ల వివరాలను వెల్లడించాలని, తక్షణం ఆయా అకౌంట్లను లాకర్లను స్తంభింపజేయడానికి చర్యలు తీసుకోవాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు ఆదేశాలు ఇచ్చింది. ► పీఎంసీఏకు సూచనలు: వీడియోకాన్ ప్రమోటర్లకు ఉన్న చరాస్తుల వివరాలను గుర్తించి తెలియజేయలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు లేఖలు రాయడానికి కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ)కు ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. కేసు వివరాలు ఇవీ... కంపెనీలోఆర్థిక అవకతవకలు, కుంభకోణాల విషయంలో వీడియోకాన్ వ్యవస్థాపకుడు, సీఎండీ వేణుగోపాల్ ధూత్, ఇతర మాజీ డైరెక్టర్లు, సీనియర్ అధికారులను విచారించి తగిన చర్యలు తీసుకోడానికి, అక్రమ సంపాదన రికవరీకి తగిన అనుమతులు ఇవ్వాలంటూ కంపెనీల చట్టం సెక్షన్ 241, 242 కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. వీడియోకాన్ లిమిటెడ్‌లో మిగులు, నిల్వలు మొత్తంగా రూ.10,028.09 కోట్లని 2014 ఫైనాన్షియల్ రిపోర్ట్ పేర్కొంది. కేవలం ఐదేళ్ల కాలంలో (2018–19 నాటికి) కంపెనీ రూ.2,972.73 కోట్ల నష్టాల్లోకి వెళ్లిపోవడంపై భాస్కర పంతుల్ మహన్, నారిన్ కుమార్ భోలాలతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కంపెనీరుణాలు రూ.20,149.23 కోట్ల నుంచి రూ.28,586.87 కోట్లకు పెరిగిపోవడం గమనార్హం. ‘‘మునిగిపోతున్న నౌకకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ భారీగా రుణాలను మంజూరు చేయడం, అదే సంస్థ దివాలా కోడ్ సెక్షన్ 7 కింద పిటిషన్ దాఖలు చేయడం అశ్చర్యంగా ఉంది’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఆయా అంశాలన్నింటిపై సమగ్రంగా విచారించాలని ఎన్సీఎల్టీ ఆదేశాలు ఇచ్చింది. తీవ్ర మోసపూరితమైన కేసులను విచారించే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)కు కూడా తన ఉత్తర్వు ప్రతిని అందించాలని ఆదేశించింది. -
ముసద్దిలాల్ జ్యువెలర్స్ ఆస్తులు జప్తు
సాక్షి, హైదరాబాద్: ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. ఆ సంస్థకు చెందిన 130 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని మార్చుకునేందుకు బోగస్ విక్రయాలకు పాల్పడిందని నిర్ధారణ కావడంతో ఈడీ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) కేసు నమోదైవుంది. దీనికి అనుబంధంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. కాగా, గతంలో ఇదే కేసుకు సంబంధించి 82.11 కోట్ల విలువైన 145 కేజీల బంగారాన్ని ఈడీ సీజ్ చేసింది. -
మాజీ టీడీపీ నేత ఆస్తుల జప్తుకు నోటీసులు
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాకు చెందిన మాజీ టీడీపీ నేత, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాకు గట్టి షాక్ తగిలింది. ఆయన ఆస్తుల జప్తుకు రిజస్టర్ ఆఫ్ కోపరేటివ్ సోసైటీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రాజా నివాసానికి అధికారులు నోటీసులు అంటించారు. వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడు మండలం లంపకలోప వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రూ. 18,96,38,222 అవినీతి బాగోతం వెలుగుచూసింది. చనిపోయిన వ్యక్తులు, బినామీ పేర్ల మీద లోన్లు మంజూరు చేసి నిధులు కాజేశారని రాజాతోపాటు 12 మంది డైరెక్టర్లు, సోసైటీ సీఈవో వెంకటరావుపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలోనే సహకార సంఘం అధికారులు లంపకలోప వ్యవసాయ సహకార పరపతి సంఘం మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనంతరం రాజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీకి మనుగడ లేదని, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని వ్యాఖ్యానించారు. -
రూ.147 కోట్ల నీరవ్ మోదీ ఆస్తులు జప్తు
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, ఆయన కంపెనీలకు సంబంధించి రూ.147 కోట్ల విలువ చేసే ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ముంబై, సూరత్‌లో ఈ స్థిర, చరాస్తులు (కార్లు, ప్లాంట్ మెషినరీ, పెయింటింగ్స్, భవనాలు) ఉన్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసం చేసి నీరవ్ మోదీ విదేశాలకు పారిపోవడం తెలిసిందే. నల్లధన చలామణి నియంత్రణ చట్టం(పీఎంఎల్ఏ) 2002 కింద ఆస్తులను జప్తు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఈ నెల 15న నీరవ్‌మోదీ, పలువురు ఇతరులకు వ్యతిరేకంగా మనీలాండరింగ్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దేశ, విదేశాల్లోని రూ.1,725 కోట్ల విలువైన ఆస్తులను గతంలోనూ జప్తు చేసిన విషయం గమనార్హం. -
కాగ్నిజెంట్ ఖాతాల జప్తు తొలగింపు
ముంబై: ఆదాయపు పన్ను వివాదానికి సంబంధించి స్తంభింపజేసిన తమ సంస్థ ఖాతాల్లో కార్యకలాపాలకు మద్రాసు హైకోర్టు అనుమతించినట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ తెలియజేసింది. ఆదాయపు పన్ను శాఖ చర్యలపై స్టే విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించిందని సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే స్టే ఉత్తర్వు ప్రకారం– రూ.2,800 కోట్ల పన్ను వివాదంలో 15 శాతం అంటే దాదాపు రూ.490 కోట్లను తాము డిపాజిట్ చేస్తున్నట్లు కాగ్నిజెంట్ తెలిపింది. దీనికి కోర్టు రెండు రోజుల గడువిచ్చిందని, ఈ పేమెంట్‌కు వీలుగా జేపీ మోర్గాన్... ముంబైలో కంపెనీకి ఉన్న బ్యాంక్ అకౌంట్‌ను జప్తును కోర్టు తొలగించింది. 15 శాతం చెల్లింపులతో పాటు వివాదాస్పద మిగిలిన మొత్తానికి వడ్డీని కూడా కేసు పరిష్కారమయ్యేంతవరకూ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా పడింది. 2016లో కాగ్నిజెంట్ దాదాపు 1.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్ బై బ్యాక్ చేపట్టింది. ఆ సమయంలో తన విదేశీ మాతృ సంస్థకు కాగ్నిజెంట్ చెల్లించిన డివిడెండ్‌పై ఎలాంటి పన్నూ చెల్లించలేదని భారత ఐటీ శాఖ ఆరోపించింది. దీనికి సంబంధించి కంపెనీకి చెందిన దాదాపు రూ.2,500 కోట్లమేర విలువైన 60 డిపాజిట్లను రెండు వారాల క్రితం జప్తు చేసింది. కార్పొ బ్రీఫ్స్... ఎన్సీసీ: మార్చి నెలలో రూ.1,085 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. ఇందులో ఎలక్ట్రికల్ విభాగంలో రూ.741 కోట్ల విలువ చేసే మూడు ఆర్డర్లతోపాటు, వాటర్, ఎన్విరాన్మెంట్ విభాగం నుంచి రూ.344 కోట్ల కాంట్రాక్టు ఉంది. నాట్కో: నరాల సంబంధ చికిత్సలో వాడే టెరిఫ్లూనమైడ్ జనరిక్ వర్షన్‌ను భారత్‌లో తొలిసారిగా విడుదల చేసింది. జగిల్: కస్టమర్లకు మెరుగైన సౌకర్యాల కోసం మార్కెటింగ్ ఆటోమేషన్ కంపెనీ రిటైన్లీ టెక్నాలజీస్‌తో చేతులు కలిపింది. -
రూ.380 కోట్ల శశికళ బినామీ ఆస్తుల జప్తు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ బంధువులకు చెందిన రూ.380 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ జప్తు చేసింది. దివంగత తమిళనాడు సీఎం జయలలిత, శశికళ బంధువులు, మిత్రులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై గత ఏడాది ఐటీ శాఖ పెద్దస్థాయిలో సోదాలు నిర్వహించడం తెల్సిందే. జయ, శశికళ పేర్లతో అనేక బినామీ సంస్థలు ఉన్నట్లు ఈ సోదాల్లో తేలింది. వీటిలోని చాలా సంస్థలకు చిరునామా.. చెన్నై టీనగర్‌లోని ఒకే అపార్టుమెంటు కావడం గమనార్హం. -
కలెక్టరేట్ జప్తునకు ఆదేశం
‘ఎల్టా’కు బకారుులుచెల్లించకపోవడమే కారణం వారంలోగా చెల్లిస్తామనే ఒప్పందంతో ముగిసిన వివాదం హన్మకొండ అర్బన్ : ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా) కు రూ.2.06లక్షలు బకాయిలు చెల్లించని కారణంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం జప్తు చేసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఎల్టా ప్రతినిధులు తమ న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి కోర్టు ఆదేశాల పత్రాలను అధికారులకు అప్పగించారు. దీంతో కలెక్టరేట్లో కొద్ది సేపు ైెహ డ్రామా నెలకొనగా చివరకు డబ్బు చెల్లించేందుకు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. 2006 నాటి ఘటన జిల్లాలో డీపెప్ ఆధ్వర్యాన 2006సంవత్సరంలో జిల్లా యంత్రాంగం సుమారు 500 మంది ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషపై ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఇందుకోసం రూ.1.50 లక్షలు ఎల్టాకు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నా శిక్షణ పూర్తయిన తర్వాత డబ్బు చెల్లించలేదు. దీంతో ‘ఎల్టా’ బాధ్యులు జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. వెంటనే డబ్బు చెల్లిం చాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ కార్యాలయం జప్తు చేసుకోవాలని(మూవబుల్ ప్రాపర్టీ) తీర్పునిచ్చింది. అరుుతే, ఈ తీర్పుపై అధికారులు స్టే తెచ్చుకోవడంతో పాటు హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. కానీ హైకోర్టు కూడా పిటీషనర్లకు డబ్బు చెల్లించని కారణంగా కలెక్టరేట్ జప్తునకు గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఎత్తివేయడంతో అవే ఉత్తర్వులు అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఎల్టా బాధ్యులు జిల్లా కోర్టులో ఎగ్జిక్యూటివ్ పిటీషన్ వేసుకుని గతంలో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని కోరారు. ఈ మేరకు కోర్టు ఖర్చులతో కలిపి బాధితులకు బకారుు రూ.1.50లక్షలతో పాటు ఖర్చులు కలిపి రూ.2.06లక్షలు చెలించాలని, లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని జప్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు ఉత్తర్వులు అమల్లో భాగంగా ఫీల్డ్ అధికారి సత్తార్, ఎల్టా తరపున జిల్లాకోర్టులో వాదించిన న్యాయవాది హరిహరరావు బుధవారం కలెక్టరేట్ అధికారులకు ఉత్తర్వుల కాపీలు అందజేశారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఎల్టా ప్రతినిధులతో మధ్యవర్తి ద్వారా మాట్లాడి డబ్బులు చెక్కు రూపంలో చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో తమకు డబ్బులు చెల్లిస్తామని అధికారులు చెప్పారని ఎల్టా గౌరవ అధ్యక్షుడు బత్తిని కొమురయ్య, అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఇది రెండో సారి.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో ఆత్మకూరు మండలంలో భూ బాదితులకు పరిహారం ఇచ్చే విషయంలో కూడా అధికారుల నిర్లక్ష్యం వహించగా వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో 2009లో కూడా ఇదే విధంగా కోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయం గెలిచింది : కొమురయ్య, శ్రీనివాస్, ఎల్టా బాధ్యులు మేం ఎల్టా ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. జిల్లా కలెక్టర్, యంత్రాంగంపై మాకు గౌరవం ఉంది. డబ్బు సమస్య కాకున్నా అధికారులు మమ్మల్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతూ కోర్టుకు వెళ్లే వరకు పట్టిం చుకోలేదు. మొదటి సారి కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే తెచ్చుకున్నారు. మొత్తానికి హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిం ది. అధికారులు ఇకనైనా నిర్లక్ష్య ధోరణి వీడి నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. -
ఇనుప చక్రంతో రోడ్డెక్కితే రంగు పడుద్ది
కేజ్‌వీల్ ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు ఇక జప్తు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు {పభుత్వ ఆదేశం తీవ్రంగా దెబ్బతింటున్న రోడ్లు కొత్త రోడ్ల నిర్మాణం నేపథ్యంలో కఠినంగా వ్యవహరించనున్న సర్కార్ హైదరాబాద్: ఇనుప పట్టాతో ఉన్న ఎడ్ల బండి రోడ్డెక్కితే ఇక ఎడ్లు, బండి రెండూ పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు త్వరలో స్పష్టమైన ఆదేశాలు అందనున్నాయి. పొలం పనులకు వాడే కేజ్ వీల్స్ (ఇనుప చట్రాల చక్రాలు) ఉన్న వాహనాల వల్ల రోడ్లు పాడవుతుండటంతో నేరుగా రోడ్లపై తిరగకూడదనే నిబంధనను కఠినతరం చేసే క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 వేల కోట్ల వ్యయంతో కొత్తగా రోడ్లు నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు కఠినంగా వ్యవహరించనుంది. మంగళవారం మధ్యాహ్నం రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ ఉన్నతాధికారులతో దీనిపై చర్చించారు. ఐదేళ్లు మనాల్సిన రోడ్లు రెండేళ్లకే నాశనం కేజ్ వీల్స్ బిగించిన ట్రాక్టర్లు, ఇనుప పట్టాలున్న ఎడ్ల బండ్ల మూలంగా ఐదేళ్లు మనాల్సిన రోడ్లు కాస్తా రెండేళ్లకే పూర్తిగా దెబ్బతింటున్నాయి. దీంతో వాటి మరమ్మతుకు కొత్త రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చు చేయాల్సి వస్తోంది. అసలే కాంట్రాక్టర్లు అంతంతమాత్రం నాణ్యతప్రమాణాలను పాటిస్తుండటంతో రోడ్లు ఎక్కువకాలం మన్నటం లేదు. ఎడ్లబండ్లకూ టైర్లు... రైతులు వ్యవసాయ పనుల సమయంలో మాత్రమే ఎడ్లబండ్లకు కేజ్ వీల్స్ ఏర్పాటు చేసి ఆ తర్వాత వాటిని తొలగించి సాధారణ టైర్లను బిగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక చెరుకు పంట ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో చెరుకు తరలించే సమయంలో ఎడ్లబండ్లు భారీగా రోడ్లెక్కుతున్నాయి. దీనిపై రైతుల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. ఒకసారి చెప్పినా మళ్లీ ఆ వాహనం రోడ్డెక్కితే సీజ్ చేయాలని ఆదేశాలివ్వనుంది. వెంటనే ఇది అమలులోకి రాబోతోంది. -
ఫోన్ స్విచ్ ఆన్ చేస్తే స్వాధీనమే
సభ్యులకు శాసన మండలి చైర్మన్ శంకరమూర్తి హెచ్చరిక బెంగళూరు : శాసన మండలి కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఎవరైనా సరే తమ మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆన్ చేస్తే.. వాటిని జప్తు చేసుకుంటామని శాసనమండలి చైర్మన్ డీ హెచ్ శంకరమూర్తి హెచ్చరించారు. శాసనసభ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రభుచౌహాన్ తన ఫోన్లో ప్రియాంకగాంధీ చిత్రాలు చూడడంపై గురువారం కూడా శాసనమండలిలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం నెలకొంది. ఈ సందర్భంగా మండలి చైర్మన్ శంకరమూర్తి మాట్లాడుతూ...‘మండలిలోకి ప్రవేశించే ముందు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా ఇప్పటికే అనేక సార్లు సభ్యులకు చెప్పాను. అయినా ఎవరూ నా మాటకు విలువ ఇవ్వడం లేదు. బెంగళూరులో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మండలి కవరేజ్‌కు వచ్చిన ఓ రిపోర్టర్ సెల్‌ఫోన్ మోగింది. ఆ సమయంలో అతని ఫోన్‌ను నేను జప్తు చేసుకున్నాను. రెండు రోజుల తర్వాత ఆ ఫోన్‌ను తిరిగి ఇచ్చేశాను. ఇకపై మండలి సభ్యుల సెల్ఫోన్లు కనుక స్విచ్ ఆఫ్ చేయకుండా కనిపిస్తే వారి ఫోన్లను కూడా జప్తు చేసుకుంటాం. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి’ అని సభ్యులను హెచ్చరించారు.