
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాకు చెందిన మాజీ టీడీపీ నేత, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాకు గట్టి షాక్ తగిలింది. ఆయన ఆస్తుల జప్తుకు రిజస్టర్ ఆఫ్ కోపరేటివ్ సోసైటీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రాజా నివాసానికి అధికారులు నోటీసులు అంటించారు. వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడు మండలం లంపకలోప వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రూ. 18,96,38,222 అవినీతి బాగోతం వెలుగుచూసింది. చనిపోయిన వ్యక్తులు, బినామీ పేర్ల మీద లోన్లు మంజూరు చేసి నిధులు కాజేశారని రాజాతోపాటు 12 మంది డైరెక్టర్లు, సోసైటీ సీఈవో వెంకటరావుపై ఆరోపణలు వచ్చాయి.
అయితే ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలోనే సహకార సంఘం అధికారులు లంపకలోప వ్యవసాయ సహకార పరపతి సంఘం మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టారు.
కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనంతరం రాజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీకి మనుగడ లేదని, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని వ్యాఖ్యానించారు.