Varupula Raja
-
టీడీపీ సీనియర్ నేత వరుపుల రాజా హఠాన్మరణం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వరుపుల రాజా (49) మృతి చెందారు. శనివారం ప్రత్తిపాడులో గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రాజాను కాకినాడ అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో వైద్యులు ఆయనను ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి 11 గంటలకు రాజా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా వరుపుల రాజా పనిచేశారు. -
కోట్ల కుంభకోణం: టీడీపీ నేత వరుపుల పరారీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ/ప్రత్తిపాడు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ను కొల్లగొట్టిన అప్పటి డీసీసీబీ చైర్మన్, ప్రత్తిపాడు టీడీపీ ఇన్చార్జి వరుపుల రాజా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్తిపాడులో రాజా ఇంటివద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకపక్క పోలీసులు, మరోపక్క టీడీపీ శ్రేణులు మోహరించారు. అయితే, రాత్రి 8.30 గంటల సమయంలో తాము రాజా ఇంటిలోకి ప్రవేశించే ముందు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, అదే సమయంలో రాజా పరారయ్యారని పోలీసులు భావిస్తున్నారు. రాజా చైర్మన్‌గా ఉన్న సమయంలో బినామీ పేర్లతో డీసీసీబీ బ్రాంచిలు, పలు సహకార సంఘాల నుంచి కోట్లు రుణాలు స్వాహా చేశారని సహకార చట్టం 51 ప్రకారం జరిపిన విచారణలో ప్రాథమికంగా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఈ కుంభకోణం నిగ్గు తేల్చేందుకు కేసును సీఐడీకి అప్పగించింది. మరోపక్క ప్రత్తిపాడు డీసీసీబీ బ్రాంచి పరిధిలోని ధర్మవరం సొసైటీలో రైతుల క్రాప్ ఇన్సూ్యరెన్స్ నిధులు సుమారు రూ.45 లక్షలు గోల్మాల్ అయ్యాయంటూ పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో కొంతకాలంగా రాజా తప్పించుకు తిరుగుతున్నారు. రాజా ఇంటిలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారంతో శుక్రవారం సీఐడీ ఏఎస్పీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్ఐలు ప్రత్తిపాడులోని రాజా ఇంటికి వెళ్లారు. ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు రాజా ఇంటి వద్దకు చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ, తుని టీడీపీ ఇన్చార్జి యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు రాజా తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ వాదించారు. గతంలో ఉన్న డీసీసీబీ పెండింగ్ కేసుల్లో నోటీసు ఇచ్చినా తప్పించుకు తిరుగుతుండటం వల్లే నేరుగా అరెస్టుకు వచ్చామని సీఐడీ పోలీసులు చెప్పినా వినలేదు. అరెస్టు చేయడానికి వీల్లేదంటూ గొడవ చేశారు. తలుపులు వేసుకుని ఇంటిలో ఉన్న రాజాను బయటకు తీసుకువచ్చేందుకు సీఐడీ డీఎస్పీలు రామకృష్ణ, జి.రమేష్‌బాబు, సీఐలు ప్రయత్నించారు. లొంగిపోవాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. ఇంతలో టీడీపీ నేతలు బయట పోలీసులతో సంప్రదింపులంటూ హైడ్రామా నిర్వహించారు. 8.30 గంటల సమయంలో రాజా ఇంటిలోకి సీఐడీ పోలీసులు ప్రవేశించారు. మహిళా పోలీసులు ఇంటిలో ఉన్న రాజా తల్లి వరుపుల సత్యవతి, మేనకోడలు కొమ్ముల వాణిని ప్రశ్నించారు. గదులు అన్నింటినీ వెతికి ఇంటిలో రాజా లేకపోవడంతో పోలీసులు బయటకు వచ్చేశారు. అంతకంటే ముందుగా మూడు నిమిషాలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఇంటి బయట టీడీపీ నేతలు పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలోనే రాజా తమ కళ్లుగప్పి పరారైనట్టుగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. రాజా పరారైన విషయాన్ని సీఐడీ రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ గోపాలకృష్ణ ధృవీకరించారు. -
‘పచ్చ’నేతలు దొరికారు!
గత టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ అవినీతి తమ హక్కు అన్నట్టుగా ఆ నేతలు చలాయించడంతో కోట్ల రూపాయలకు కాళ్లు వచ్చాయి. రానున్న ఐదేళ్లూ కూడా తమవే అన్న రీతిలో రెచ్చిపోవడంతో మృతులు కూడా వీరికి ఆదాయ వనరులుగా మారిపోయారు. సహకార వ్యవస్థకు తూట్లు పొడిచిన ‘పచ్చ’ నేతలు రైతులను మోసం చేశారు. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లాలో సహకార రంగాన్ని భ్రష్టు పట్టించి కోట్లు కొట్టేసిన ప్రబుద్ధుల బండారాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. పచ్చ నేతలు పచ్చని పొలాలను పావులుగా వాడుకుని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, మృతుల పేర్లతో పాస్‌పుస్తకాలు, బినామీ ఆస్తులను కుదువ పెట్ట డం ద్వారా సహకార వ్యవస్థను అధఃపాతాళంలోకి నెట్టేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనా కాలంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)ను లూటీ చేసేశారు. ఈ కుంభకోణాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డీసీసీబీ సీఈఓ మంచాల ధర్మారావు సహా పలు బ్రాంచీల మేనేజర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులపై డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ సస్పెన్షన్ వేటు వేశారు. గత పాలకవర్గంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విచారణ కు ఆదేశించి, అవినీతి కుంభకోణాల మూలాలను తవ్వి తీస్తోంది. ఈ క్రమంలో తాజాగా మెట్ట ప్రాంతంలో అప్పటి డీసీసీబీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రస్తుత ఇన్చార్జి వరుపుల రాజా అధ్యక్షుడిగా వ్యవహరించిన లంపకలోవ సొసైటీలో కోట్ల రూపాయల అవినీతి గుట్టును 51 విచారణ రట్టు చేసింది. ఇప్పుడైతే లంపకలోవలో అవినీతి కుంభకోణం బయట పడింది కానీ ఆ ఐదేళ్ల పాలనా కాలంలో జిల్లాలో ఏ సహకార సంఘాన్ని కదలించినా భారీగానే అక్రమాలు బయటపడుతున్నాయి. గత నెలలో ఆత్రేయపురం బ్రాంచి పరిధిలోని వద్దిపర్రు సొసైటీలో అంతా కుమ్మక్కై వ్యవసాయ కూలీలను రైతులుగా చూపించి రూ.1.50 కోట్లు కొట్టేసిన సంగతి ‘సాక్షి’ బయటపట్టిన నేపథ్యంలో పలువురిపై చర్యలు తీసుకున్నారు. పలు కేసుల నమోదు దాదాపు ఇదే రీతిన ప్రత్తిపాడు మండలం లంపకలోవ పీఏసీఎస్‌లో ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.16 కోట్లు పైనే నొక్కేసినట్టు నిర్థారణ కావడం జిల్లా సహకారశాఖను ఒక కుదుపు కుదిపేస్తోంది. ఈ సొసైటీలో రూ.16,47,59,023 దుర్వినియోగానికి పాల్పడ్డ అప్పటి సొసైటీ అధ్యక్షుడు, నాటి డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాతోపాటు మరో నలుగురిపై శుక్రవారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం తీవ్ర సంచలనమైంది. రాజాతో పాటు ఇద్దరు మాజీ సీఈఓలు, మాజీ బ్రాంచి మేనేజర్లపై పెద్దాపురం డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్ రాధాకృష్ణారావు పోలీసుల కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. డొంక కదిలింది ఇలా... లంపకలోవ సొసైటీలో 2018 మే 11 నుంచి 2019 జూలై 30 మధ్య కాలంలో నిధులు అడ్డంగా దోచేశారంటూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ అవినీతి డొంక కదిలింది. ఎమ్మెల్యే పర్వత శాసనసభలో ప్రస్తావించడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణలో నిధు ల దుర్వినియోగం రుజువుకావడంతో ప్రత్తిపాడు డీసీసీబీ మేనేజర్ ఎం.నరసింహమూర్తిని సస్పెండ్ చేశారు. ఈ చర్య ఎంత మాత్రం సరిపోదని, లోతైన విచారణ జరిపి ప్రతిపైసా తిరిగి సొసైటీకి జమవ్వాలని ఎమ్మెల్యే పర్వత, ఇటు డీసీసీబీ చైర్మన్ అనంతబాబు పట్టుబట్టి మరీ ఏపీ సహకార చట్టం 1964 ప్రకా రం 51 విచారణ జరిపించారు. ఈ అవినీతిని వెలుగులోకి తీసుకురావడానికి జిల్లా సహకార అధికారి డి.పాండురంగారావు సొసైటీ పరిధిలో 5050 మంది సభ్యులలో రుణాలు పొందిన సుమారు 4000 మంది సభ్యులను సుమారు రెండు నెలల పాటు విచారించిన మీదట నిధుల దుర్వినియోగాన్ని నిర్థారించారు. అడ్డగోలుగా రుణాలు మంజూరు ఒకరి పేరునే రెండు, మూడు రుణాలు తీసుకోవడం, మృతుల పేర్ల మీద, నకిలీ పాస్ పుస్తకాలపైన అడ్డగోలుగా రుణాలు మంజూరు చేయడం వంటి అనేక అవకతవకలు ఈ విచారణలో వెలుగులోకి వచ్చాయి. గత నవంబర్ నెలలో రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలను తనిఖీ చేసి, అధిక శాతం నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్టు నిర్ధారించారు. ఇదే లంపకలోవ సొసైటీలో అవకతవకలపై గత అక్టోబర్ నెలలో కుంభకోణంలో క్రియాశీలక పాత్ర పోషించిన డీసీసీబీ మాజీ చైర్మన్ వరుపుల రాజాతోపాటు సొసైటీ డైరెక్టర్లు, మాజీ సీఈఓ చాగంటి వెంకట్రావుల ఆస్థులపై జప్తు నోటీసులను కూడా జారీ చేశారు. ఇప్పుడు రాజాతోపాటు ఈ కుంభకోణ బాధ్యులుపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వరుపుల రాజాతో పాటు నలుగురిపై కేసులు ప్రత్తిపాడు: మండలంలోని లంపకలోవ వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో నిధుల అవకతవకలపై అప్పటి సొసైటీ అధ్యక్షుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాతోపాటు మరో నలుగురిపై శుక్రవారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక పోలీసుల కథనం మేరకు లంపకలోవ సొసైటీలో 2018 మే 11–2019 జూలై 30 మధ్య కాలంలో తప్పుడు లెక్కలు నమోదు చేయడం, అవకతవకలకు పాల్పడి రూ.16,47,59,023 నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని పెద్దాపురం డివిజన్ కోఆపరేటివ్ అధికారి ఎ. రాధాకృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అప్పటి లంపకలోవ సొసైటీ అధ్యక్షుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ వరుపుల జోగిరాజు అనే రాజా, సొసైటీ మాజీ సీఈఓ సీహెచ్ వెంకట్రావు, సీఈఓ కె.అప్పారావు, ప్రత్తిపాడు డీసీసీబీ మాజీ బ్రాంచ్ మేనేజర్లు ఎం.నరసింహమూర్తి, పి.మురళీకృష్ణలపై 409, 419, 420, 468, 471, 477(ఎ), 109 రెడ్‌విత్ 34 సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడు సీఐ వై.రాంబాబు ఆధ్వర్యంలో ఏఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు. పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం లంపకలోవ సొసైటీలో విచారణ చేపట్టారు. ప్రత్తిపాడు, జగ్గంపేట సీఐలు వై.రాంబాబు, సురేష్, సొసైటీ అధ్యక్షుడు గొంతిన సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ టీడీపీ నేత ఆస్తుల జప్తుకు నోటీసులు
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాకు చెందిన మాజీ టీడీపీ నేత, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాకు గట్టి షాక్ తగిలింది. ఆయన ఆస్తుల జప్తుకు రిజస్టర్ ఆఫ్ కోపరేటివ్ సోసైటీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రాజా నివాసానికి అధికారులు నోటీసులు అంటించారు. వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడు మండలం లంపకలోప వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రూ. 18,96,38,222 అవినీతి బాగోతం వెలుగుచూసింది. చనిపోయిన వ్యక్తులు, బినామీ పేర్ల మీద లోన్లు మంజూరు చేసి నిధులు కాజేశారని రాజాతోపాటు 12 మంది డైరెక్టర్లు, సోసైటీ సీఈవో వెంకటరావుపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలోనే సహకార సంఘం అధికారులు లంపకలోప వ్యవసాయ సహకార పరపతి సంఘం మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనంతరం రాజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీకి మనుగడ లేదని, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని వ్యాఖ్యానించారు. -
టీడీపీకి మరో ఎదురుదెబ్బ; రాజా రాజీనామా
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ భారీ ఎదురుదెబ్బ తగలింది. ప్రత్తిపాడు నియోజకవర్గ నేత వరుపుల రాజా టీడీపీకి గురువారం రాజీనామా చేశారు. టీడీపీ మునిగిపోయే పడవ లాంటిదని, ఈ పార్టీకి భవిష్యత్తు లేదని విమర్శించారు. టీడీపీకి మనుగడ లేదని, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పేదల అవసరాలను గుర్తించడంలో టీడీపీ వైఫ్యలం చెందిందని అన్నారు. కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదని వాపోయారు. టీడీపీ పూర్తిగా వెనుకబడిపోయిందని, తానెప్పుడో టీడీపీ నుంచి బయటకు రావాలనికున్నానని వెల్లడించారు. టీడీపీలో ఒకే సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కాపులకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. టీడీపీలో ఉన్న 80 శాతం కాపు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కాపులను చంద్రబాబు పట్టించుకోకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కాపుల విషయంలో సీఎం వైఎస్ జగన్ మొదటి నుంచీ ఒకే విధానంతో ఉన్నారని అన్నారు. మాటపై నిలబడే వ్యక్తులు టీడీపీలో లేరని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చాలా బాగుందని, పేద ప్రజల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో ఆయన పనిచేస్తున్నారని ప్రశంసించారు. మూడు నెలల పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చి పక్షాళన చేశారని మెచ్చుకున్నారు. రాజధాని మారుస్తానని సీఎం జగన్ ఎక్కడా చెప్పలేదని, టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. రాజధానిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు 90 శాతం భూములు కొన్నారని వెల్లడించారు. కొద్ది రోజుల తర్వాత కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ వరుపుల రాజా 4611 ఓట్ల తేడాతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేతిలో ఓడిపోయారు.