సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ భారీ ఎదురుదెబ్బ తగలింది. ప్రత్తిపాడు నియోజకవర్గ నేత వరుపుల రాజా టీడీపీకి గురువారం రాజీనామా చేశారు. టీడీపీ మునిగిపోయే పడవ లాంటిదని, ఈ పార్టీకి భవిష్యత్తు లేదని విమర్శించారు. టీడీపీకి మనుగడ లేదని, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పేదల అవసరాలను గుర్తించడంలో టీడీపీ వైఫ్యలం చెందిందని అన్నారు.
కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదని వాపోయారు. టీడీపీ పూర్తిగా వెనుకబడిపోయిందని, తానెప్పుడో టీడీపీ నుంచి బయటకు రావాలనికున్నానని వెల్లడించారు. టీడీపీలో ఒకే సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కాపులకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. టీడీపీలో ఉన్న 80 శాతం కాపు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కాపులను చంద్రబాబు పట్టించుకోకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కాపుల విషయంలో సీఎం వైఎస్ జగన్ మొదటి నుంచీ ఒకే విధానంతో ఉన్నారని అన్నారు.
మాటపై నిలబడే వ్యక్తులు టీడీపీలో లేరని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చాలా బాగుందని, పేద ప్రజల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో ఆయన పనిచేస్తున్నారని ప్రశంసించారు. మూడు నెలల పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చి పక్షాళన చేశారని మెచ్చుకున్నారు. రాజధాని మారుస్తానని సీఎం జగన్ ఎక్కడా చెప్పలేదని, టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. రాజధానిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు 90 శాతం భూములు కొన్నారని వెల్లడించారు. కొద్ది రోజుల తర్వాత కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ వరుపుల రాజా 4611 ఓట్ల తేడాతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment