ముంబై: ఆదాయపు పన్ను వివాదానికి సంబంధించి స్తంభింపజేసిన తమ సంస్థ ఖాతాల్లో కార్యకలాపాలకు మద్రాసు హైకోర్టు అనుమతించినట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ తెలియజేసింది. ఆదాయపు పన్ను శాఖ చర్యలపై స్టే విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించిందని సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే స్టే ఉత్తర్వు ప్రకారం– రూ.2,800 కోట్ల పన్ను వివాదంలో 15 శాతం అంటే దాదాపు రూ.490 కోట్లను తాము డిపాజిట్ చేస్తున్నట్లు కాగ్నిజెంట్ తెలిపింది. దీనికి కోర్టు రెండు రోజుల గడువిచ్చిందని, ఈ పేమెంట్‌కు వీలుగా జేపీ మోర్గాన్... ముంబైలో కంపెనీకి ఉన్న బ్యాంక్ అకౌంట్‌ను జప్తును కోర్టు తొలగించింది. 15 శాతం చెల్లింపులతో పాటు వివాదాస్పద మిగిలిన మొత్తానికి వడ్డీని కూడా కేసు పరిష్కారమయ్యేంతవరకూ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా పడింది. 2016లో కాగ్నిజెంట్ దాదాపు 1.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్ బై బ్యాక్ చేపట్టింది. ఆ సమయంలో తన విదేశీ మాతృ సంస్థకు కాగ్నిజెంట్ చెల్లించిన డివిడెండ్‌పై ఎలాంటి పన్నూ చెల్లించలేదని భారత ఐటీ శాఖ ఆరోపించింది. దీనికి సంబంధించి కంపెనీకి చెందిన దాదాపు రూ.2,500 కోట్లమేర విలువైన 60 డిపాజిట్లను రెండు వారాల క్రితం జప్తు చేసింది.
కార్పొ బ్రీఫ్స్...
ఎన్‌సీసీ: మార్చి నెలలో రూ.1,085 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. ఇందులో ఎలక్ట్రికల్ విభాగంలో రూ.741 కోట్ల విలువ చేసే మూడు ఆర్డర్లతోపాటు, వాటర్, ఎన్విరాన్‌మెంట్ విభాగం నుంచి రూ.344 కోట్ల కాంట్రాక్టు ఉంది.
నాట్కో: నరాల సంబంధ చికిత్సలో వాడే టెరిఫ్లూనమైడ్ జనరిక్ వర్షన్‌ను భారత్‌లో తొలిసారిగా విడుదల చేసింది.
జగిల్: కస్టమర్లకు మెరుగైన సౌకర్యాల కోసం మార్కెటింగ్ ఆటోమేషన్ కంపెనీ రిటైన్లీ టెక్నాలజీస్‌తో చేతులు కలిపింది.
Comments
Please login to add a commentAdd a comment