హీరో ఎలక్ట్రిక్‌పై దివాలా చర్యలు | Hero Electric enters insolvency process following Metro Tyres petition | Sakshi
Sakshi News home page

హీరో ఎలక్ట్రిక్‌పై దివాలా చర్యలు

Dec 29 2024 4:23 AM | Updated on Dec 29 2024 4:23 AM

Hero Electric enters insolvency process following Metro Tyres petition

ఎన్‌సీఎల్‌టీ ఢిల్లీ బెంచ్‌ ఆదేశాలు

న్యూఢిల్లీ: హీరో ఎలక్ట్రిక్‌ పై దివాలా  చర్యలకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), ఢిల్లీ బెంచ్‌  ఆదేశించింది. మెట్రో టైర్స్‌ అనే ఆపరేషనల్‌ క్రెడిటర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్‌ తాజా చర్య తీసుకుంది. హీరో ఎలక్ట్రిక్‌ రూ. 1.85 కోట్లు బకాయి పడినట్లు మెట్రో టైర్స్‌ తన పిటిషన్‌లో పేర్కొంది. దివాల ప్రక్రియ ప్రకారం,  హీరో ఎలక్ట్రిక్‌ బోర్డును సస్పెండ్‌ చేసి భూపేష్‌ గుప్తాను మధ్యంతర పరిష్కార అధికారి (ఐఆర్‌పీ)గా ఎన్‌సీఎల్‌టీ నియమించింది. దివాలా ప్రక్రియ కింద కంపెనీపై  ఇతర కోర్టులు, ట్రిబ్యునల్స్‌ లేదా ఆర్బిట్రేషన్‌ ప్యానెల్స్‌ నుండి ఆదేశాలను నిలిపివేయాలని ఆదేశించిన ఎన్‌సీఎల్‌టీ,   ఈ కంపెనీ ఆస్తులను బదిలీ చేయడం, నిలిపివేయడం, విక్రయించడం లేదా ఏ విధమైన మార్పులు చేయడం పై నిషేధాన్ని విధించింది. 

హీరో ఎలక్ట్రిక్‌ అభ్యంతరాల తిరస్కరణ 
మెట్రో టైర్స్‌తో తన వివాదం ‘‘లిమిటేషన్‌లోలేని గత ఎంతో కాలానికి సంబంధించినదని’’  హీరో ఎలక్ట్రిక్‌ చేసిన వాదనను ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది. దివాలా పరిష్కార చట్టాల ప్రకారం, ఇలాంటి వాదన న్యాయ సమ్మతమైనది కాదని స్పష్టం చేసింది. టైర్లు, ట్యూబులు సరఫరా చేసిన మెట్రో టైర్స్‌తో ఉన్న బకాయిల పరిష్కారానికి హీరో ఎలక్ట్రిక్‌ గత తొమ్మిది నెలలుగా ఎటువంటి చర్చలూ జరపలేదని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది.  

వివాద నేపథ్యం 
తాను సరఫరా చేసిన టైర్లు, ట్యూబులకు సంబంధించి రూ.1.85 కోట్ల బకాయిల కోసం మెట్రో టైర్స్‌ 2022 ఆగస్ట్‌ 9 నుండి డిసెంబర్‌ 3 మధ్య హీరో ఎలక్ట్రిక్‌కు పలు డిమాండ్‌ నోటీసులు పంపింది. అయితే  సరఫరా నాణ్యత వల్ల దీనిపై స్పందించదలేదన్నది హీరో ఎలక్ట్రిక్‌ వాదన. కాగా, సరఫరా నాణ్యతపై  మెట్రో టైర్స్‌ వద్ద హీరో ఎలక్ట్రిక్‌ నుండి అసలు ఎటువంటి వివాదం లేవనెత్తలేదని నిర్ధారణ అయినట్లు ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ పేర్కొంది.   బ్యాలెన్స్‌ కన్ఫర్మేషన్‌ లెటర్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు పేర్కొంది. పైగా హీరో ఎలక్ట్రిక్‌ యూజర్‌ మాన్యువల్‌ ప్రకారం టైర్లు అలాగే ట్యూబులు వారంటీ కింద రావని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో  మెట్రో టైర్స్‌ చేసిన క్లెయిమ్‌ ప్రామాణికమైనదిగా పరిగణించి హీరో ఎలక్ట్రిక్‌పై ఇన్సాల్వెన్సీ చర్యలు ప్రారంభించాలని ఎన్‌సీఎల్‌టీ నిర్ణయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement