![Foreign lenders file insolvency proceedings against Byjus before NCLT Bangalore bench - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/27/BYJU.jpg.webp?itok=dMPUVfw5)
న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ సంస్థ బైజూస్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)–బెంగళూరులో దివాలా పిటిషన్ దాఖలైంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల మేర టర్మ్ లోన్–బీ (టీఎల్‌బీ) ఇచి్చన రుణదాతల్లో 80 శాతం సంస్థలు కలిసి గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ద్వారా దీన్ని దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దివాలా పిటిషన్ విషయం ఇంకా బహిరంగంగా వెల్లడి కాలేదు.
బైజూస్ ఈ వ్యవహారమంతా నిరాధారమైనదని పేర్కొంది. రుణదాతల చర్యలపై అమెరికా కోర్టుల్లో పలు కేసులు నడుస్తుండగా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించడం సరికాదని వ్యాఖ్యానించింది. అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణాలను తీర్చేసుకునేందుకు టీఎల్‌బీ రుణదాతలతో చర్చలు జరుపుతున్నట్లు బైజూస్ చెబుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకులు కాకుండా సంస్థాగత ఇన్వెస్టర్లు ఇచ్చిన రుణాన్ని టీఎల్‌బీ లోన్‌గా వ్యవహరిస్తున్నారు.
వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టీఎల్‌బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును ఆశ్రయించారు. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment