
న్యూఢిల్లీ: నిర్దిష్ట చైనా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు భారత్‌లో నమోదు చేసుకోవడంలో జరిగిన ఉల్లంఘనలపై నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందుకు సహకరించిన అనేక మంది చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్లకు చర్యలకు ఉపక్రమించాయి. దీనికి సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ)కి కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి 400 పైచిలుకు ఫిర్యాదులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉల్లంఘనలకు పాల్పడిన సభ్యుల వివరాలను ఆయా సంస్థలకు కేంద్రం ఇచ్చిందని, తగు చర్యలు తీసుకోవాలని సూచించిందని పేర్కొన్నాయి. దీంతో ఐసీఏఐ, ఐసీఎస్‌ఐలతో పాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా తమ తమ సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాయి. కంపెనీల చట్టం నిబంధనలను వారు ఉల్లంఘించారని నిర్ధారణ అయిన పక్షంలో వారిపై తగు క్రమశిక్షణ చర్యలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ తమకు 200 కేసుల వివరాలు వచ్చినట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ దేబాషీస్ మిత్రా తెలిపారు.
ఆయా సంస్థలు నిబంధనల ప్రకారమే రిజిస్టర్ అయ్యాయా, చిరునామాలను సరిగ్గానే ధృవీకరించుకున్నారా లేదా వంటి అంశాలు వీటిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఐసీఏఐలో 3.50 లక్షల మంది పైగా, ఐసీఎస్‌ఐలో 68,000 మంది, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్‌లో 90,000 పైచిలుకు సభ్యులు ఉన్నారు. ఈ మూడు సంస్థలు కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలో పనిచేస్తాయి. ఇటీవలి కాలంలో భారత్‌లో అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్న చైనా కంపెనీలపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment