Institute of Company Secretaries of India
-
చైనా కంపెనీల సీఏలపై నియంత్రణ సంస్థల కన్ను
న్యూఢిల్లీ: నిర్దిష్ట చైనా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు భారత్‌లో నమోదు చేసుకోవడంలో జరిగిన ఉల్లంఘనలపై నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందుకు సహకరించిన అనేక మంది చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్లకు చర్యలకు ఉపక్రమించాయి. దీనికి సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ)కి కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి 400 పైచిలుకు ఫిర్యాదులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉల్లంఘనలకు పాల్పడిన సభ్యుల వివరాలను ఆయా సంస్థలకు కేంద్రం ఇచ్చిందని, తగు చర్యలు తీసుకోవాలని సూచించిందని పేర్కొన్నాయి. దీంతో ఐసీఏఐ, ఐసీఎస్ఐలతో పాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా తమ తమ సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాయి. కంపెనీల చట్టం నిబంధనలను వారు ఉల్లంఘించారని నిర్ధారణ అయిన పక్షంలో వారిపై తగు క్రమశిక్షణ చర్యలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ తమకు 200 కేసుల వివరాలు వచ్చినట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ దేబాషీస్ మిత్రా తెలిపారు. ఆయా సంస్థలు నిబంధనల ప్రకారమే రిజిస్టర్ అయ్యాయా, చిరునామాలను సరిగ్గానే ధృవీకరించుకున్నారా లేదా వంటి అంశాలు వీటిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఐసీఏఐలో 3.50 లక్షల మంది పైగా, ఐసీఎస్ఐలో 68,000 మంది, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్‌లో 90,000 పైచిలుకు సభ్యులు ఉన్నారు. ఈ మూడు సంస్థలు కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలో పనిచేస్తాయి. ఇటీవలి కాలంలో భారత్‌లో అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్న చైనా కంపెనీలపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఐసీఎస్ఐ కొత్త కార్యవర్గం
హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్‌కు (తెలంగాణ) నూతన కార్యవర్గం ఎన్నికైంది. 2021 సంవత్సరానికి గాను చైర్మన్‌గా హైదరాబాద్‌లోని ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ సీఎస్ నవజ్యోత్ పుట్టపర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా సీఎస్ సుధీర్ కుమార్ పోలా, సెక్రటరీగా సీఎస్ లలితాదేవి తంగిరాల, ట్రెజరర్‌గా సీఎస్ అక్షితా సురానా నియమితులయ్యారు. మేనేజింగ్ కమిటీ మెంబర్లుగా సీఎస్ పీ విక్రమ్ రెడ్డి, సీఎస్ రాధాకృష్ణ, సీఎస్ ఏ రాజా మోగ్లీలు ఉంటారు. సీఎస్ వీ ఆహ్లాదరావు, ఆర్ వెంకటరమణలు ఇతర సభ్యులుగా కొనసాగుతారు. -
కంపెనీ సెక్రటరీల పాత్ర కీలకం
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ప్రపంచం అవసరాలను గుర్తించేందుకు, మెరుగైన విధానాలు, పథకాలను రూపొందించేందుకు కంపెనీ సెక్రటరీలు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. కరోనా కష్టకాలంలో కార్పొరేట్ రంగాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని, ఉద్యోగ కల్పనకు సాయపడుతున్న కంపెనీలకు ప్రత్యేక రాయితీలు, పథకాలను అందిస్తోందని తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) 46వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన వెబినార్‌కు హరీశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు రుణాలు పొందేందుకు కంపెనీలు పాటించాల్సిన పద్ధతుల్లో కొన్నింటిపై స్టాంప్ డ్యూటీ మాఫీ చేసినట్టు చెప్పారు. కార్పొరేట్ ప్రపంచం సుస్థిర అభివృద్ధి సాధించాలంటే మారుతున్న టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్–19 పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని.. కంపెనీలు, వృత్తి నిపుణులు కూడా తమ వంతు సాయం అందించాలని కోరారు. ఐసీఎస్ఐ 45 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి.. సంస్థ గత 45 ఏళ్లలో సాధించిన విజయాలకు సంబంధించిన డిజిటల్ ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. ఐసీఎస్ఐ అధ్యక్షుడు సీఎస్ అశీష్ గార్గ్ మాట్లాడుతూ.. దేశంలోని ఇతర ఐసీఎస్ఐ కేంద్రాలకు హైదరాబాద్ కేంద్రం రోల్ మోడల్‌గా నిలుస్తోందని కొనియాడారు. ఐసీఎస్ఐ ఉపాధ్యక్షుడు సీఎస్ నాగేందర్ డి.రావు, సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ చైర్మన్ సీఎస్ కన్నన్‌లతోపాటు సీఎస్ ఆహ్లాదరావు, కౌన్సిల్ సభ్యులు సీఎస్ ఆర్.వెంకటరమణ, సీఎస్ పల్లవి విక్రమ్‌రెడ్డి, సీఎస్ నవజ్యోత్ పుట్టపర్తి, ఐసీఎస్ఐ హైదరాబాద్ ఛాప్టర్ కార్యదర్శి సీఎస్ సుధీర్ కుమార్ పోలా తదితరులు వెబినార్‌లో పాల్గొన్నారు. -
కంపెనీ సెక్రటరీలకు డిమాండ్
ఐసీఎస్ఐ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రానున్న రోజుల్లో కంపెనీ సెక్రటరీలకు మంచి డిమాండ్ ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) తెలిపింది. కంపెనీస్ యాక్టు-2013, సెక్రటేరియల్ ఆడిట్ నిబంధనలు ఇందుకు కారణమని ఐసీఎస్ఐ జాతీయ ప్రెసిడెంట్ అతుల్ హెచ్ మెహతా పేర్కొన్నారు. సెక్రటేరియల్ ఆడిట్‌పై బుధవారమిక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం 4 లక్షల మంది విద్యార్థులు, 39,000 మంది సభ్యులున్నారు. ఏటా 3,500 మంది కొత్త సీఎస్‌లు వచ్చి చేరుతున్నారు. ప్రస్తుత అవసరాలకు వీరు సరిపోతారు. అయితే భవిష్యత్తులో ఇంకా ఈ సంఖ్య పెరగాల్సిందే’ అని చెప్పారు. కంపెనీ కార్యకలాపాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రాంతీయ డెరైక్టర్ బీఎన్ హరీశ్ ఈ సందర్భంగా అన్నారు. కాగా, హైదరాబాద్‌లో రూ.20 కోట్లతో ఏర్పాటవుతున్న ఐసీఎస్ఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ త్వరలోనే రెడీ అవుతుందని ఐసీఎస్ఐ కౌన్సిల్ సభ్యులు అహ్లాదరావు తెలిపారు. ఈ కేంద్రంలో సీఎస్ల నైపుణ్య అభివృద్ధికి కోర్సులను నిర్వహిస్తాం. పరిశోధనతోపాటు విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. సదస్సులో ఐసీఎస్ఐ దక్షిణ భారత ప్రాంతీయ చైర్మన్ నాగేంద్ర రావు, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ ఇసాక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కంపెనీల చట్టంతో సీఎస్ ఉద్యోగాలకు ఎసరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా అమల్లోకి వచ్చిన కంపెనీల చట్టం కంపెనీ సెక్రటరీల భవితవ్యానికి గుదిబండగా తయారయ్యింది. ముఖ్యంగా ప్రైవేటు కంపెనీలకు కంపెనీ సెక్రటరీల(సీఎస్) నియామకం అవసరం లేదన్న నిబంధన వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. పాత కంపెనీల చట్టంలో రూ.5 కోట్ల చెల్లింపు మూలధనం దాటిన ప్రైవేటు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలన్నీ తప్పనిసరిగా కంపెనీ సెక్రటరీలను కలిగి ఉండాలని ఉంది. కాని ఇప్పుడు కొత్త చట్టంలో ఈ నిబంధన రూ.10 కోట్లు చెల్లింపు మూలధనం దాటిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు మాత్రమే సీఎస్‌లను తప్పనిసరి చేసింది. దీంతో 70-80 శాతం కంపెనీలకు సీఎస్ అవసరం లేకుండా పోయిందని ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ మాజీ చైర్మన్ రామకృష్ణ గుప్త తెలిపారు. దేశంలో సుమారు 9 లక్షలకు పైగా కంపెనీలుండగా ఈ నిబంధన వల్ల కేవలం 7,500 కంపెనీలకు మించి సీఎస్‌లు అవసరం ఉండదని అంచనా. అయితే చాలావరకూ కంపెనీలకు రూ. 5 కోట్ల చెల్లింపు మూలధనంలోపు మాత్రమే వుండటం వల్ల వాటికి ప్రస్తుతం కంపెనీ సెక్రటరీలు లేరు. ప్రస్తుతం దేశంలో 35,000 మంది కంపెనీసెక్రటరీలు వివిధ సంస్థల్లో పనిచేస్తుండగా, వీరిలో 15-20 వేల మంది ప్రైవేటు సంస్థల్లోనే ఉన్నారు. ఇప్పుడు ప్రైవేటు కంపెనీలకు సీఎస్‌లు అవసరం లేకపోవడంతో వీరి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో కంపెనీ సెక్రటరీలతో పాటు ఈ కోర్సు చేస్తున్న విద్యార్థులూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఈ అంశాన్ని కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్ళింది. సత్యం స్కామ్ తర్వాత కంపెనీల్లో జరిగే లావాదేవీల్లో మరింత పారదర్శకత పెంచేవిధంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి దీనికి పూర్తి భి న్నంగా కంపెనీల చట్టం రూపొందిం చడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ ప్రకటించే ‘ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ఇండెక్స్‌లో ఇండియా, పాకిస్థాన్ కంటే వెనుకబడి ఉందని, ఈ నిర్ణయంతో ఇది మరింత దిగజారే ప్రమాదం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు.