కొత్త కంపెనీల చట్టంతో సీఎస్ ఉద్యోగాలకు ఎసరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా అమల్లోకి వచ్చిన కంపెనీల చట్టం కంపెనీ సెక్రటరీల భవితవ్యానికి గుదిబండగా తయారయ్యింది. ముఖ్యంగా ప్రైవేటు కంపెనీలకు కంపెనీ సెక్రటరీల(సీఎస్) నియామకం అవసరం లేదన్న నిబంధన వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. పాత కంపెనీల చట్టంలో రూ.5 కోట్ల చెల్లింపు మూలధనం దాటిన ప్రైవేటు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలన్నీ తప్పనిసరిగా కంపెనీ సెక్రటరీలను కలిగి ఉండాలని ఉంది. కాని ఇప్పుడు కొత్త చట్టంలో ఈ నిబంధన రూ.10 కోట్లు చెల్లింపు మూలధనం దాటిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు మాత్రమే సీఎస్‌లను తప్పనిసరి చేసింది.
దీంతో 70-80 శాతం కంపెనీలకు సీఎస్ అవసరం లేకుండా పోయిందని ఐసీఎస్‌ఐ హైదరాబాద్ చాప్టర్ మాజీ చైర్మన్ రామకృష్ణ గుప్త తెలిపారు. దేశంలో సుమారు 9 లక్షలకు పైగా కంపెనీలుండగా ఈ నిబంధన వల్ల కేవలం 7,500 కంపెనీలకు మించి సీఎస్‌లు అవసరం ఉండదని అంచనా. అయితే చాలావరకూ కంపెనీలకు రూ. 5 కోట్ల చెల్లింపు మూలధనంలోపు మాత్రమే వుండటం వల్ల వాటికి ప్రస్తుతం కంపెనీ సెక్రటరీలు లేరు.
ప్రస్తుతం దేశంలో 35,000 మంది కంపెనీసెక్రటరీలు వివిధ సంస్థల్లో పనిచేస్తుండగా, వీరిలో 15-20 వేల మంది ప్రైవేటు సంస్థల్లోనే ఉన్నారు. ఇప్పుడు ప్రైవేటు కంపెనీలకు సీఎస్‌లు అవసరం లేకపోవడంతో వీరి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో కంపెనీ సెక్రటరీలతో పాటు ఈ కోర్సు చేస్తున్న విద్యార్థులూ ఆందోళనకు గురవుతున్నారు.
ఈ అంశంపై ఇప్పటికే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఈ అంశాన్ని కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్ళింది. సత్యం స్కామ్ తర్వాత కంపెనీల్లో జరిగే లావాదేవీల్లో మరింత పారదర్శకత పెంచేవిధంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి దీనికి పూర్తి భి న్నంగా కంపెనీల చట్టం రూపొందిం చడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ ప్రకటించే ‘ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ఇండెక్స్‌లో ఇండియా, పాకిస్థాన్ కంటే వెనుకబడి ఉందని, ఈ నిర్ణయంతో ఇది మరింత దిగజారే ప్రమాదం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు.