Company Secretary
-
మనీ లాండరింగ్ పరిధిలోకి సీఏలు
న్యూఢిల్లీ: నల్ల ధనం చలామణీ, మనీ లాండరింగ్ కార్యకలాపాలను నిరోధించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కేంద్రం ఆ దిశగా మరో కీలక చర్య తీసుకుంది. బ్లాక్ మనీ చలామణీకి ఆస్కారం ఉండే అయిదు రకాల ఆర్థిక లావాదేవీలను, వాటిని క్లయింట్ల తరఫున నిర్వహించే చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను మనీ–లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి చేర్చింది. దీంతో ఇకపై సదరు లావాదేవీలను నిర్వహించే సీఏలు, సీఎస్‌లు కూడా విచారణ ఎదుర్కొనాల్సి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మే 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థిరాస్తుల కొనుగోలు, విక్రయం; క్లయింట్ల డబ్బు, సెక్యూరిటీలు లేదా ఇతర ఆస్తుల నిర్వహణ; బ్యాంక్, సేవింగ్స్ లేదా సెక్యూరిటీస్ అకౌంట్ల నిర్వహణ; కంపెనీల ఏర్పాటు, నిర్వహణ కోసం నిధులు సమీకరించడంలో తోడ్పాటు; వ్యాపార సంస్థల కొనుగోళ్లు, విక్రయం.. మొదలైన అయిదు రకాల ఆర్థిక లావాదేవీలు ఇందులో ఉన్నాయి. పీఎంఎల్ఏ చట్టం 2002ను ప్రయోగించాల్సి వస్తే క్లయింట్ల స్థాయిలోనే సీఏలు కూడా జరిమానా, విచారణ ఎదుర్కొనాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘పీఎంఎల్ఏ నిబంధనలను అమలు చేస్తే క్లయింట్లతో సమానంగా సీఏలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా లావాదేవీ జరిగినట్లుగా భావిస్తే ఆ విషయాన్ని సీఏలు వెంటనే నియంత్రణా సంస్థకు తెలియజేయాలి‘ అని వివరించాయి. రిపోర్టింగ్ అధికారులుగా సీఏలు.. ఆయా లావాదేవీల విషయంలో సీఏలు ఇకపై నియంత్రణ సంస్థలకు తెలియజేయాల్సిన రిపోర్టింగ్ అధికారులుగా వ్యవహరించాల్సి ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పేర్కొంది. సదరు లావాదేవీలు నిర్వహించే క్లయింట్లందరి వివరాలను సేకరించి (కేవైసీ), రికార్డులను నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని తెలిపింది. క్లయింట్ల తరఫున ఏయే ఆర్థిక లావాదేవీలు జరపకుండా నిషేధం ఉందనే దాని గురించి తమ సభ్యుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ వివరించింది. కొత్త మార్పులు సరైన కోణంలో అమలయ్యేలా చూసేందుకు, వృత్తి నిపుణులు పోషించగలిగే పాత్ర అర్థమయ్యేలా వివరించేందుకు నియంత్రణ సంస్థలు, అధికారులతో కలిసి పనిచేయనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. నల్లధనం కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎంఎల్ఏ నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు .. రాజకీయాలతో ప్రమేయమున్న వ్యక్తుల (పీఈపీ) ఆర్థిక లావాదేవీలను రికార్డు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అలాగే లాభాపేక్ష రహిత సంస్థల ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఆర్థిక సంస్థలు, రిపోర్టింగ్ ఏజెన్సీలు సేకరించాల్సి ఉంటోంది. ఇక వర్చువల్ అసెట్స్ లావాదేవీలు నిర్వహించే క్రిప్టో ఎక్సే్చంజీలు, మధ్యవర్తిత్వ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే యూజర్ల వివరాలను సేకరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
కంపెనీ సెక్రటరీనా.. వెంటనే వచ్చి చేరండి!
కంపెనీ సెక్రటరీనా (సీఎస్).. అయితే మా సంస్థలో అవకాశం ఉంది.. వెంటనే వచ్చి చేరండి! ఇవీ కార్పొరేట్ కంపెనీల నుంచి సీఎస్‌లకు వస్తున్న ఆఫర్స్!! వీటిని బట్టి సీఎస్‌లకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోచ్చు. దాంతో ఇటీవల కాలంలో యువత.. సంస్థల నిర్వహణా నైపుణ్యాలను అందించే కంపెనీ సెక్రటరీ (సీఎస్) కోర్సు వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో.. కంపెనీ సెక్రటరీ కోర్సు తీరుతెన్నులు, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం.. కార్పొరేట్–టాప్ గేర్ సీఎస్ కోర్సు పూర్తిచేసుకొని.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) అసోసియేట్ మెంబర్షిప్ పొందిన అభ్యర్థులకు కార్పొరేట్ రంగం రెడ్ కార్పెట్ పరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ.5కోట్లు అంతకంటే ఎక్కువ పెయిడప్ క్యాపిటల్ కలిగిన సంస్థలన్నీ పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలనే నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదేసమయంలో పలు కంపెనీల్లో అంతర్గత పారదర్శత లోపించడంతో వాటాదారులు(షేర్ హోల్డర్లు/భాగస్వాములు) అభద్రతకు లోనవుతున్నారు. దాంతో కార్పొరేట్ కంపెనీలు భాగస్వాముల విశ్వాసాన్ని నిలుపుకునేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కంపెనీ సెక్రటరీలను నియమించుకొని.. అంతర్గత కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దాంతో కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసిన వారికి మంచి కార్పొరేట్ అవకాశాలతోపాటు వేతనాల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. చదవండి: (విద్య, ఉద్యోగ సమాచారం) విధులు ఇవే ►కంపెనీ సెక్రటరీలు ప్రధానంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు షేర్ హోల్డర్లకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారు. అలాగే కంపెనీస్ యాక్ట్–కంపెనీకి వర్తించే ట్యాక్సేషన్ నిబంధనలు,షేర్ హోల్డర్ల హక్కులు, బిజినెస్ స్వరూపం, చట్టబద్ధమైన నిబంధనలు, పరిశ్రమ, ఆర్థిక చట్టాలకు అనుగుణంగా అడ్మినిస్ట్రేషన్, కార్పొరేట్ పాలనా,విధులు సాగేలా చూస్తారు. ►కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయాలను సమర్థంగా అమలయ్యేలా చూస్తారు. ►నిర్దేశిత చట్టాలు, నియమావళి మేరకు కంపెనీ పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. ►కంపెనీ నిర్వహణ, పరిపాలనా స్వరూపం, నిర్ణయాల్లో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తారు. ►కంపెనీలో అంతర్గతంగా సమాచార సేకరణ, సదరు వివరాల విశ్లేషణ ద్వారా కంపెనీ డైరెక్టర్లకు నివేదికలు అందిస్తారు. తద్వారా కంపెనీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తోడ్పడతారు. ►కంపెనీ పనితీరు, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ►ఆర్థిక నిర్వహణ, ఆఫీస్ నిర్వహణ, మానవ వనరుల నిర్వహణ, కంపెనీ ఆస్తుల నిర్వహణ, రికార్డుల నిర్వహణను చేపడతారు. ►ఆడిట్ కమిటీకి సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఆదాయపన్ను శాఖకు సంబంధించిన ఫైలింగ్స్ సజావుగా జరిగేలా చూస్తారు. ఉద్యోగావకాశాలు ► నైపుణ్యవంతులైన కంపెనీ సెక్రటరీలకు అవకాశాలకు ఢోకా లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ బలపడుతుండటం.. విదేశీ కంపెనీలు సైతం భారత్‌లో కార్యకలాపాల నిర్వహణతోపాటు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే దేశీయంగా వస్తున్న సరళీకరణ విధానాలు నూతన వ్యాపారాలకు నాంది పలుకుతున్నాయి. ఈ పరి ణామాలు సీఎస్‌లకు ఉద్యోగాల పరంగా ఆశాజనక పరిస్థితులను ఏర్పరుస్తున్నాయి. ►క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు ప్రైవేట్, పబ్లిక్, బ్యాంకింగ్ సెక్టార్లలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే స్టాక్ ఎక్ఛేంజ్‌లు, కంపెనీ అఫైర్స్ విభాగాలు, కంపెనీ లా బోర్డులు, ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే సీఎస్‌లు సొంతంగా కన్సెల్టెన్సీ బిజినెస్‌ను కూడా ప్రారంభించొచ్చు. కోర్సు పూర్తి చేసుకున్న వెంటనే రూ.25,000 వేతనంతో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అనుభవం, మెరుగైన అడ్మినిస్ట్రేటివ్, కమ్యూనికేషన్, మేనేజీరియల్ స్కిల్స్ ఉంటే సీఎస్ల వేతనాలు వేగంగా పెరుగుతున్నాయి. ►భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఓఎన్జీసీ, ఎంఎంటీసీ లిమిటెడ్ వంటి సంస్థల్లోనూ అవకాశాలు దక్కించుకోవచ్చు. జాబ్ రోల్స్ » కంపెనీ సెక్రటరీ » అసోసియేట్ కంపెనీ సెక్రటరీ » కంప్లయన్స్ ఆఫీసర్ » కంపెనీ రిజిస్ట్రార్ » లీగల్ అడ్వైజర్ » కార్పొరేట్ పాలసీ మేకర్ » చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ » ప్రిన్సిపుల్ సెక్రటరీ » కార్పొరేట్ ప్లానర్ వంటి హోదాలు లభిస్తాయి. అనుకూలతలు ►జాబ్ మార్కెట్లో సీఎస్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ►కెరీర్ గ్రోత్, వేతనాలు ఆకర్షణీయమని చెప్పొచ్చు. ►కార్పొరేట్ రంగంలో కంపెనీ సెక్రటెరీలకు మంచి గుర్తింపు లభిస్తోంది. ప్రతికూలతలు ►సీఎస్ కోర్సుకు విదేశాల్లో అంతగా గుర్తింపు లేదు. ►బాధ్యతలు, విధులు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాల్సి ఉంటుంది. ఫలితంగా వృత్తిపరమైన ఒత్తిడి అధికం. ►పూర్తి వివరాలకు వెబ్సైట్: www.icsi.edu మూడు దశలు కంపెనీ సెక్రటరీ కోర్సులో మూడు దశలు ఉంటాయి. అవి.. ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. ఇంటర్/తత్సమాన అర్హతతో ఫౌండేషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశించొచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులు నేరుగా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందవచ్చు. ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఇందులో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ లా; బిజినెస్ మేనేజ్మెంట్, ఎథిక్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్; బిజినెస్ ఎకనామిక్స్; ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ పేపర్లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇది 8 పేపర్లు.. రెండు మాడ్యూల్స్‌గా ఉంటుంది. మాడ్యూల్ 1లో.. జ్యూరిస్ప్రుడెన్స్, ఇంటర్‌ప్రిటేషన్ జనరల్ లాస్; కంపెనీ లా; సెట్టింగ్ అప్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ అండ్ క్లోజర్; ట్యాక్స్ లాస్ పేపర్లు ఉంటాయి. మాడ్యూల్ 2లో.. కార్పొరేట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్; సెక్యూరిటీస్ లాస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్; ఎకనామిక్, బిజినెస్ అండ్ కమర్షియల్ లాస్, ఫైనాన్షియల్ అండ్ స్ట్రాటజిక్æ మేనేజ్మెంట్ పేపర్లు ఉంటాయి. ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇది 3 మాడ్యూల్స్.. 9 పేపర్లుగా ఉంటుంది. మాడ్యూల్ 1లో.. గవర్నెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, కాంప్లియన్స్ అండ్ ఎథిక్స్; అడ్వాన్స్డ్ ట్యాక్స్‌లాస్; డ్రాఫ్టింగ్, ప్లీడింగ్స్ అండ్ అప్పీరియెన్సెస్ పేపర్లు, మాడ్యూల్ 2లో.. సెక్రటేరియల్ ఆడిట్; కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్, రిజల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ డిస్ప్యూట్స్ పేపర్లు, మాడ్యూల్ 3లో.. కార్పొరేట్ ఫండింగ్ అండ్ లిస్టింగ్ ఇన్ స్టాక్ ఎక్సే్ఛంజెస్; మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీస్, ఎలక్టివ్ సబ్జెక్ట్ పేపర్లు ఉంటాయి. ప్రాక్టికల్ ట్రైనింగ్ సీఎస్ కోర్సు పూర్తిచేసే క్రమంలో విద్యార్థులు రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా.. తప్పనిసరిగా అప్రెంటీస్‌షిప్ పేరుతో ఉండే ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ అప్రెంటీస్‌షిప్ గరిష్ట వ్యవధి మూడేళ్లు. అభ్యర్థులు సీఎస్ కోర్సు ఏ దశలో చేరారో దానికి అనుగుణంగా ఈ వ్యవధిలో మార్పు ఉంటుంది. -
15 కోట్లతో ఐసీఎస్ఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీ సెక్రటరీల ఉపాధికి విఘాతం కలిగించే విధంగా ఉన్న కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనలకు త్వరలోనే సవరణలు జరగనున్నాయని, దీనికి ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు ఆర్.శ్రీధరన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త కంపెనీల చట్టంలోని దొర్లిన లోపాలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పెలైట్ అంగీకరించారని, వీటిని తప్పక సరిచేస్తానని హామీ ఇచ్చారన్నారు. కొత్త కంపెనీల చట్టంలో ప్రైవేటు కంపెనీలు, రూ.10 కోట్ల లోపు చెల్లింపు మూలధనం ఉన్న పబ్లిక్ కంపెనీలకు కీ మేనేజరియల్ పెర్సనల్ (కేఎంపీ) నుంచి మినహాయింపు ఇవ్వడంతో అనేకమంది కంపెనీ సెక్రటరీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనను సవరించనుండటంతో కంపెనీ సెక్రటరీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటీకి దేశం డిమాండ్‌కు తగ్గట్టుగా కంపెనీ సెక్రటరీలు లేక కొరతను ఎదుర్కొంటోందని శ్రీధరన్ తెలిపారు. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రూ.15 కోట్లతో హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీఎస్ఐ ప్రకటించింది. నెల రోజుల్లో పనులు ప్రారంభించి రెండేళ్లలో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు శ్రీధరన్ తెలిపారు. ముంబై తర్వాత రెండో కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. -
కొత్త కంపెనీల చట్టంతో సీఎస్ ఉద్యోగాలకు ఎసరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా అమల్లోకి వచ్చిన కంపెనీల చట్టం కంపెనీ సెక్రటరీల భవితవ్యానికి గుదిబండగా తయారయ్యింది. ముఖ్యంగా ప్రైవేటు కంపెనీలకు కంపెనీ సెక్రటరీల(సీఎస్) నియామకం అవసరం లేదన్న నిబంధన వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. పాత కంపెనీల చట్టంలో రూ.5 కోట్ల చెల్లింపు మూలధనం దాటిన ప్రైవేటు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలన్నీ తప్పనిసరిగా కంపెనీ సెక్రటరీలను కలిగి ఉండాలని ఉంది. కాని ఇప్పుడు కొత్త చట్టంలో ఈ నిబంధన రూ.10 కోట్లు చెల్లింపు మూలధనం దాటిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు మాత్రమే సీఎస్‌లను తప్పనిసరి చేసింది. దీంతో 70-80 శాతం కంపెనీలకు సీఎస్ అవసరం లేకుండా పోయిందని ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ మాజీ చైర్మన్ రామకృష్ణ గుప్త తెలిపారు. దేశంలో సుమారు 9 లక్షలకు పైగా కంపెనీలుండగా ఈ నిబంధన వల్ల కేవలం 7,500 కంపెనీలకు మించి సీఎస్‌లు అవసరం ఉండదని అంచనా. అయితే చాలావరకూ కంపెనీలకు రూ. 5 కోట్ల చెల్లింపు మూలధనంలోపు మాత్రమే వుండటం వల్ల వాటికి ప్రస్తుతం కంపెనీ సెక్రటరీలు లేరు. ప్రస్తుతం దేశంలో 35,000 మంది కంపెనీసెక్రటరీలు వివిధ సంస్థల్లో పనిచేస్తుండగా, వీరిలో 15-20 వేల మంది ప్రైవేటు సంస్థల్లోనే ఉన్నారు. ఇప్పుడు ప్రైవేటు కంపెనీలకు సీఎస్‌లు అవసరం లేకపోవడంతో వీరి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో కంపెనీ సెక్రటరీలతో పాటు ఈ కోర్సు చేస్తున్న విద్యార్థులూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఈ అంశాన్ని కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్ళింది. సత్యం స్కామ్ తర్వాత కంపెనీల్లో జరిగే లావాదేవీల్లో మరింత పారదర్శకత పెంచేవిధంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి దీనికి పూర్తి భి న్నంగా కంపెనీల చట్టం రూపొందిం చడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ ప్రకటించే ‘ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ఇండెక్స్‌లో ఇండియా, పాకిస్థాన్ కంటే వెనుకబడి ఉందని, ఈ నిర్ణయంతో ఇది మరింత దిగజారే ప్రమాదం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు.