కంపెనీ సెక్రటరీనా.. వెంటనే వచ్చి చేరండి! | Huge Demand For Company Secretary Jobs, Full Details | Sakshi
Sakshi News home page

కంపెనీ సెక్రటరీ.. కార్పొరేట్‌ కింగ్‌!

Published Mon, Mar 15 2021 9:19 AM | Last Updated on Mon, Mar 15 2021 10:19 AM

Huge Demand For Company Secretary Jobs, Full Details - Sakshi

కంపెనీ సెక్రటరీనా (సీఎస్‌).. అయితే మా సంస్థలో అవకాశం ఉంది.. వెంటనే వచ్చి చేరండి! ఇవీ కార్పొరేట్‌ కంపెనీల నుంచి సీఎస్‌లకు వస్తున్న ఆఫర్స్‌!! వీటిని బట్టి సీఎస్‌లకు మార్కెట్‌లో ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోచ్చు. దాంతో ఇటీవల కాలంలో యువత.. సంస్థల నిర్వహణా నైపుణ్యాలను అందించే కంపెనీ సెక్రటరీ (సీఎస్‌) కోర్సు వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో.. కంపెనీ సెక్రటరీ కోర్సు తీరుతెన్నులు, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం..

కార్పొరేట్‌–టాప్‌ గేర్‌
సీఎస్‌ కోర్సు పూర్తిచేసుకొని.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీ ఆఫ్‌ ఇండియా(ఐసీఎస్‌ఐ) అసోసియేట్‌ మెంబర్‌షిప్‌ పొందిన అభ్యర్థులకు కార్పొరేట్‌ రంగం రెడ్‌ కార్పెట్‌ పరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ.5కోట్లు అంతకంటే ఎక్కువ పెయిడప్‌ క్యాపిటల్‌ కలిగిన సంస్థలన్నీ పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలనే నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదేసమయంలో పలు కంపెనీల్లో అంతర్గత పారదర్శత లోపించడంతో వాటాదారులు(షేర్‌ హోల్డర్లు/భాగస్వాములు) అభద్రతకు లోనవుతున్నారు. దాంతో కార్పొరేట్‌ కంపెనీలు భాగస్వాముల విశ్వాసాన్ని నిలుపుకునేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కంపెనీ సెక్రటరీలను నియమించుకొని.. అంతర్గత కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దాంతో కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసిన వారికి మంచి కార్పొరేట్‌ అవకాశాలతోపాటు వేతనాల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది.

చదవండి: (విద్య, ఉద్యోగ సమాచారం)

విధులు ఇవే
►కంపెనీ సెక్రటరీలు ప్రధానంగా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కు షేర్‌ హోల్డర్లకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారు. అలాగే కంపెనీస్‌ యాక్ట్‌–కంపెనీకి వర్తించే ట్యాక్సేషన్‌ నిబంధనలు,షేర్‌ హోల్డర్ల హక్కులు, బిజినెస్‌ స్వరూపం, చట్టబద్ధమైన నిబంధనలు, పరిశ్రమ, ఆర్థిక చట్టాలకు అనుగుణంగా అడ్మినిస్ట్రేషన్, కార్పొరేట్‌ పాలనా,విధులు సాగేలా చూస్తారు. 
►కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ తీసుకున్న నిర్ణయాలను సమర్థంగా అమలయ్యేలా చూస్తారు.
►నిర్దేశిత చట్టాలు, నియమావళి మేరకు కంపెనీ పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. 
►కంపెనీ నిర్వహణ, పరిపాలనా స్వరూపం, నిర్ణయాల్లో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తారు.
►కంపెనీలో అంతర్గతంగా సమాచార సేకరణ, సదరు వివరాల విశ్లేషణ ద్వారా కంపెనీ డైరెక్టర్లకు నివేదికలు అందిస్తారు. తద్వారా కంపెనీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తోడ్పడతారు. 
►కంపెనీ పనితీరు, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.
►ఆర్థిక నిర్వహణ, ఆఫీస్‌ నిర్వహణ, మానవ వనరుల నిర్వహణ, కంపెనీ ఆస్తుల నిర్వహణ, రికార్డుల నిర్వహణను చేపడతారు. 
►ఆడిట్‌ కమిటీకి సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఆదాయపన్ను శాఖకు సంబంధించిన ఫైలింగ్స్‌ సజావుగా జరిగేలా చూస్తారు. 

ఉద్యోగావకాశాలు 
► నైపుణ్యవంతులైన కంపెనీ సెక్రటరీలకు అవకాశాలకు ఢోకా లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ బలపడుతుండటం.. విదేశీ కంపెనీలు సైతం భారత్‌లో కార్యకలాపాల నిర్వహణతోపాటు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే దేశీయంగా వస్తున్న సరళీకరణ విధానాలు నూతన వ్యాపారాలకు నాంది పలుకుతున్నాయి. ఈ పరి ణామాలు సీఎస్‌లకు ఉద్యోగాల పరంగా ఆశాజనక పరిస్థితులను ఏర్పరుస్తున్నాయి. 
►క్వాలిఫైడ్‌ కంపెనీ సెక్రటరీలకు ప్రైవేట్, పబ్లిక్, బ్యాంకింగ్‌ సెక్టార్లలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే స్టాక్‌ ఎక్ఛేంజ్‌లు, కంపెనీ అఫైర్స్‌ విభాగాలు, కంపెనీ లా బోర్డులు, ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే సీఎస్‌లు సొంతంగా కన్సెల్టెన్సీ బిజినెస్‌ను కూడా ప్రారంభించొచ్చు. కోర్సు పూర్తి చేసుకున్న వెంటనే రూ.25,000 వేతనంతో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అనుభవం, మెరుగైన అడ్మినిస్ట్రేటివ్, కమ్యూనికేషన్, మేనేజీరియల్‌ స్కిల్స్‌ ఉంటే సీఎస్‌ల వేతనాలు వేగంగా పెరుగుతున్నాయి. 
►భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్, నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, కొచ్చిన్‌ షిప్‌ యార్డ్‌ లిమిటెడ్, ఓఎన్‌జీసీ, ఎంఎంటీసీ లిమిటెడ్‌ వంటి సంస్థల్లోనూ అవకాశాలు దక్కించుకోవచ్చు.

జాబ్‌ రోల్స్‌
» కంపెనీ సెక్రటరీ » అసోసియేట్‌ కంపెనీ సెక్రటరీ » కంప్లయన్స్‌ ఆఫీసర్‌ » కంపెనీ రిజిస్ట్రార్‌ » లీగల్‌ అడ్వైజర్‌ » కార్పొరేట్‌ పాలసీ మేకర్‌ » చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ » ప్రిన్సిపుల్‌ సెక్రటరీ » కార్పొరేట్‌ ప్లానర్‌ వంటి హోదాలు లభిస్తాయి.

అనుకూలతలు
►జాబ్‌ మార్కెట్‌లో సీఎస్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది.
►కెరీర్‌ గ్రోత్, వేతనాలు ఆకర్షణీయమని చెప్పొచ్చు.
 ►కార్పొరేట్‌ రంగంలో కంపెనీ సెక్రటెరీలకు మంచి గుర్తింపు లభిస్తోంది.

ప్రతికూలతలు
►సీఎస్‌ కోర్సుకు విదేశాల్లో అంతగా గుర్తింపు లేదు.
►బాధ్యతలు, విధులు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాల్సి ఉంటుంది. ఫలితంగా వృత్తిపరమైన ఒత్తిడి అధికం. 
►పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.icsi.edu

మూడు దశలు
కంపెనీ సెక్రటరీ కోర్సులో మూడు దశలు ఉంటాయి. అవి.. ఫౌండేషన్‌ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌. ఇంటర్‌/తత్సమాన అర్హతతో ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశించొచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులు నేరుగా ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందవచ్చు.

ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌
ఇందులో బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ లా; బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఎథిక్స్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌; బిజినెస్‌ ఎకనామిక్స్‌; ఫండమెంటల్స్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఆడిటింగ్‌ పేపర్లు ఉంటాయి.

ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌
ఇది 8 పేపర్లు.. రెండు మాడ్యూల్స్‌గా ఉంటుంది. మాడ్యూల్‌ 1లో.. జ్యూరిస్‌ప్రుడెన్స్, ఇంటర్‌ప్రిటేషన్‌ జనరల్‌ లాస్‌; కంపెనీ లా; సెట్టింగ్‌ అప్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎంటిటీస్‌ అండ్‌ క్లోజర్‌; ట్యాక్స్‌ లాస్‌ పేపర్లు ఉంటాయి. మాడ్యూల్‌ 2లో.. కార్పొరేట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌; సెక్యూరిటీస్‌ లాస్‌ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌; ఎకనామిక్, బిజినెస్‌ అండ్‌ కమర్షియల్‌ లాస్, ఫైనాన్షియల్‌ అండ్‌ స్ట్రాటజిక్‌æ మేనేజ్‌మెంట్‌ పేపర్లు ఉంటాయి.

ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌
ఇది 3 మాడ్యూల్స్‌.. 9 పేపర్లుగా ఉంటుంది. మాడ్యూల్‌ 1లో.. గవర్నెన్స్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, కాంప్లియన్స్‌ అండ్‌ ఎథిక్స్‌; అడ్వాన్స్‌డ్‌ ట్యాక్స్‌లాస్‌; డ్రాఫ్టింగ్, ప్లీడింగ్స్‌ అండ్‌ అప్పీరియెన్సెస్‌ పేపర్లు, మాడ్యూల్‌ 2లో.. సెక్రటేరియల్‌ ఆడిట్‌; కార్పొరేట్‌ రీస్ట్రక్చరింగ్, రిజల్యూషన్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ డిస్ప్యూట్స్‌ పేపర్లు, మాడ్యూల్‌ 3లో.. కార్పొరేట్‌ ఫండింగ్‌ అండ్‌ లిస్టింగ్‌ ఇన్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజెస్‌; మల్టీ డిసిప్లినరీ కేస్‌ స్టడీస్, ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌ పేపర్లు ఉంటాయి. 

ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌
సీఎస్‌ కోర్సు పూర్తిచేసే క్రమంలో విద్యార్థులు రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా.. తప్పనిసరిగా అప్రెంటీస్‌షిప్‌ పేరుతో ఉండే ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ అప్రెంటీస్‌షిప్‌ గరిష్ట వ్యవధి మూడేళ్లు. అభ్యర్థులు సీఎస్‌ కోర్సు ఏ దశలో చేరారో దానికి అనుగుణంగా ఈ వ్యవధిలో మార్పు ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement