న్యూఢిల్లీ: నల్ల ధనం చలామణీ, మనీ లాండరింగ్ కార్యకలాపాలను నిరోధించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కేంద్రం ఆ దిశగా మరో కీలక చర్య తీసుకుంది. బ్లాక్ మనీ చలామణీకి ఆస్కారం ఉండే అయిదు రకాల ఆర్థిక లావాదేవీలను, వాటిని క్లయింట్ల తరఫున నిర్వహించే చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను మనీ–లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) పరిధిలోకి చేర్చింది.
దీంతో ఇకపై సదరు లావాదేవీలను నిర్వహించే సీఏలు, సీఎస్‌లు కూడా విచారణ ఎదుర్కొనాల్సి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మే 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థిరాస్తుల కొనుగోలు, విక్రయం; క్లయింట్ల డబ్బు, సెక్యూరిటీలు లేదా ఇతర ఆస్తుల నిర్వహణ; బ్యాంక్, సేవింగ్స్ లేదా సెక్యూరిటీస్ అకౌంట్ల నిర్వహణ; కంపెనీల ఏర్పాటు, నిర్వహణ కోసం నిధులు సమీకరించడంలో తోడ్పాటు; వ్యాపార సంస్థల కొనుగోళ్లు, విక్రయం.. మొదలైన అయిదు రకాల ఆర్థిక లావాదేవీలు ఇందులో ఉన్నాయి.
పీఎంఎల్‌ఏ చట్టం 2002ను ప్రయోగించాల్సి వస్తే క్లయింట్ల స్థాయిలోనే సీఏలు కూడా జరిమానా, విచారణ ఎదుర్కొనాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘పీఎంఎల్‌ఏ నిబంధనలను అమలు చేస్తే క్లయింట్లతో సమానంగా సీఏలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా లావాదేవీ జరిగినట్లుగా భావిస్తే ఆ విషయాన్ని సీఏలు వెంటనే నియంత్రణా సంస్థకు తెలియజేయాలి‘ అని వివరించాయి.
రిపోర్టింగ్ అధికారులుగా సీఏలు..
ఆయా లావాదేవీల విషయంలో సీఏలు ఇకపై నియంత్రణ సంస్థలకు తెలియజేయాల్సిన రిపోర్టింగ్ అధికారులుగా వ్యవహరించాల్సి ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పేర్కొంది. సదరు లావాదేవీలు నిర్వహించే క్లయింట్లందరి వివరాలను సేకరించి (కేవైసీ), రికార్డులను నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని తెలిపింది. క్లయింట్ల తరఫున ఏయే ఆర్థిక లావాదేవీలు జరపకుండా నిషేధం ఉందనే దాని గురించి తమ సభ్యుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ వివరించింది.
కొత్త మార్పులు సరైన కోణంలో అమలయ్యేలా చూసేందుకు, వృత్తి నిపుణులు పోషించగలిగే పాత్ర అర్థమయ్యేలా వివరించేందుకు నియంత్రణ సంస్థలు, అధికారులతో కలిసి పనిచేయనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. నల్లధనం కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎంఎల్‌ఏ నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు .. రాజకీయాలతో ప్రమేయమున్న వ్యక్తుల (పీఈపీ) ఆర్థిక లావాదేవీలను రికార్డు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అలాగే లాభాపేక్ష రహిత సంస్థల ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఆర్థిక సంస్థలు, రిపోర్టింగ్ ఏజెన్సీలు సేకరించాల్సి ఉంటోంది. ఇక వర్చువల్ అసెట్స్ లావాదేవీలు నిర్వహించే క్రిప్టో ఎక్సే్చంజీలు, మధ్యవర్తిత్వ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే యూజర్ల వివరాలను సేకరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment