కంపెనీ సెక్రటరీలకు డిమాండ్
ఐసీఎస్‌ఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రానున్న రోజుల్లో కంపెనీ సెక్రటరీలకు మంచి డిమాండ్ ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) తెలిపింది. కంపెనీస్ యాక్టు-2013, సెక్రటేరియల్ ఆడిట్ నిబంధనలు ఇందుకు కారణమని ఐసీఎస్‌ఐ జాతీయ ప్రెసిడెంట్ అతుల్ హెచ్ మెహతా పేర్కొన్నారు. సెక్రటేరియల్ ఆడిట్‌పై బుధవారమిక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
‘ప్రస్తుతం 4 లక్షల మంది విద్యార్థులు, 39,000 మంది సభ్యులున్నారు. ఏటా 3,500 మంది కొత్త సీఎస్‌లు వచ్చి చేరుతున్నారు. ప్రస్తుత అవసరాలకు వీరు సరిపోతారు. అయితే భవిష్యత్తులో ఇంకా ఈ సంఖ్య పెరగాల్సిందే’ అని చెప్పారు. కంపెనీ కార్యకలాపాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రాంతీయ డెరైక్టర్ బీఎన్ హరీశ్ ఈ సందర్భంగా అన్నారు.
కాగా, హైదరాబాద్‌లో రూ.20 కోట్లతో ఏర్పాటవుతున్న ఐసీఎస్‌ఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ త్వరలోనే రెడీ అవుతుందని ఐసీఎస్‌ఐ కౌన్సిల్ సభ్యులు అహ్లాదరావు తెలిపారు. ఈ కేంద్రంలో సీఎస్‌ల నైపుణ్య అభివృద్ధికి కోర్సులను నిర్వహిస్తాం. పరిశోధనతోపాటు విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. సదస్సులో ఐసీఎస్‌ఐ దక్షిణ భారత ప్రాంతీయ చైర్మన్ నాగేంద్ర రావు, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ ఇసాక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.