Company Secretaries
-
‘కంపెనీ సెక్రెటరీ’ కోర్సులకు క్యాష్‌బ్యాక్
కోల్‌కతా: కంపెనీ సెక్రెటరీ ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్ కోర్సుల్లో చేరే నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు 100 శాతం ఫీజు రిఫండ్ చేస్తామని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) ప్రకటించింది. తమ సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిరుపేద, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ఈ డిసెంబర్ నెలలో చేరే విద్యార్థులకే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. ఫౌండేషన్ కోర్సుకు సంబంధించి 10+2లో కనీసం 70 శాతం మార్కులు, ఎగ్జిక్యూటివ్ కోర్సుకు సంబంధించి డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించిన వారికి రిఫండ్ వస్తుందని వెల్లడించింది. -
4 నుంచి తిరుపతిలో దక్షిణ భారత కంపెనీ సెక్రటరీల సదస్సు
తిరుపతి రూరల్: దక్షిణ భార త కంపెనీ సెక్రటరీల 10వ ప్రాంతీయ సదస్సును తిరుపతిలో ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా చైర్మన్ నాగేంద్రరావు తెలిపారు. తిరుపతిలోని బ్లిస్ హోటల్లో 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుందన్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సదరన్ డిస్కం సీఎండీ హెచ్‌వై దొర పాల్గొంటారని తెలిపారు. మంగళవారం తిరుపతిలో సదరన్ డిస్కం కంపెనీ సెక్రటరీ ప్రకాష్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ది ఛాలెంజ్ ఆఫ్ ఛేంజ్-కంపెనీ సెక్రటరీ లీడింగ్ ది వే’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా పలు రాష్ట్రాల నుంచి కంపెనీల సెక్రటరీలు పాల్గొంటారని పేర్కొన్నారు. -
కంపెనీ సెక్రటరీలకు డిమాండ్
ఐసీఎస్ఐ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రానున్న రోజుల్లో కంపెనీ సెక్రటరీలకు మంచి డిమాండ్ ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) తెలిపింది. కంపెనీస్ యాక్టు-2013, సెక్రటేరియల్ ఆడిట్ నిబంధనలు ఇందుకు కారణమని ఐసీఎస్ఐ జాతీయ ప్రెసిడెంట్ అతుల్ హెచ్ మెహతా పేర్కొన్నారు. సెక్రటేరియల్ ఆడిట్‌పై బుధవారమిక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం 4 లక్షల మంది విద్యార్థులు, 39,000 మంది సభ్యులున్నారు. ఏటా 3,500 మంది కొత్త సీఎస్‌లు వచ్చి చేరుతున్నారు. ప్రస్తుత అవసరాలకు వీరు సరిపోతారు. అయితే భవిష్యత్తులో ఇంకా ఈ సంఖ్య పెరగాల్సిందే’ అని చెప్పారు. కంపెనీ కార్యకలాపాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రాంతీయ డెరైక్టర్ బీఎన్ హరీశ్ ఈ సందర్భంగా అన్నారు. కాగా, హైదరాబాద్‌లో రూ.20 కోట్లతో ఏర్పాటవుతున్న ఐసీఎస్ఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ త్వరలోనే రెడీ అవుతుందని ఐసీఎస్ఐ కౌన్సిల్ సభ్యులు అహ్లాదరావు తెలిపారు. ఈ కేంద్రంలో సీఎస్ల నైపుణ్య అభివృద్ధికి కోర్సులను నిర్వహిస్తాం. పరిశోధనతోపాటు విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. సదస్సులో ఐసీఎస్ఐ దక్షిణ భారత ప్రాంతీయ చైర్మన్ నాగేంద్ర రావు, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ ఇసాక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ పటిష్టతలో ఐసీఎస్ఐకి సహకారం
చెన్నై: కార్పొరేట్ రంగం పటిష్టతకు ఐసీఎస్ఐ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా) చేసే ప్రయత్నాలన్నింటికీ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కేంద్రం పేర్కొంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పెలైట్ ఈ మేరకు భరోసాను ఇచ్చారు. గురువారం ఇక్కడ ఆయన కంపెనీ సెక్రటరీల 41వ జాతీయ సదస్సును ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, కంపెనీల బిల్లు 2013 ఆమోదం విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం-ప్రతిపక్షాల పూర్తి సహకారం, ఏకాభిప్రాయ సాధనతోనే ఇంతటి విజయాన్ని సాధించడం జరిగిందని అన్నారు. వ్యాపార నిర్వహణ విషయంలో ఈ తరహా స్పూర్తినే కార్పొరేట్ రంగం కూడా అనుసరించాలని కోరారు. పరస్పర సహకారం ద్వారా వ్యాపార విజయం, వృద్ధిలో పురోగతి సాధించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ రంగ పటిష్టతతో కంపెనీ సెక్రటరీల పాత్ర కీలకమని పేర్కొన్నారు.