కార్పొరేట్ పటిష్టతలో ఐసీఎస్‌ఐకి సహకారం
చెన్నై: కార్పొరేట్ రంగం పటిష్టతకు ఐసీఎస్‌ఐ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా) చేసే ప్రయత్నాలన్నింటికీ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కేంద్రం పేర్కొంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పెలైట్ ఈ మేరకు భరోసాను ఇచ్చారు. గురువారం ఇక్కడ ఆయన కంపెనీ సెక్రటరీల 41వ జాతీయ సదస్సును ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, కంపెనీల బిల్లు 2013 ఆమోదం విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం-ప్రతిపక్షాల పూర్తి సహకారం, ఏకాభిప్రాయ సాధనతోనే ఇంతటి విజయాన్ని సాధించడం జరిగిందని అన్నారు. వ్యాపార నిర్వహణ విషయంలో ఈ తరహా స్పూర్తినే కార్పొరేట్ రంగం కూడా అనుసరించాలని కోరారు. పరస్పర సహకారం ద్వారా వ్యాపార విజయం, వృద్ధిలో పురోగతి సాధించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ రంగ పటిష్టతతో కంపెనీ సెక్రటరీల పాత్ర కీలకమని పేర్కొన్నారు.