అమెజాన్ 3,000 కోట్ల పెట్టుబడికి ఓకే
♦ పచ్చజెండా ఊపిన డీఐపీపీ
♦ ఇక ఆన్‌లైన్లో ఆహారోత్పత్తుల విక్రయాలు
♦ ఇక్కడ తయారైనవే విక్రయించాలని షరతు
న్యూఢిల్లీ: భారత్‌లో ఆహారోత్పత్తుల రిటైల్ అమ్మకాలకు సంబంధించి ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ప్రతిపాదించిన 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,000 కోట్లు) పెట్టుబడుల ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) దీనికి పచ్చజెండా ఊపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి ఇప్పటిదాకా ప్రభుత్వ అనుమతుల్ని విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) మంజూరు చేస్తోంది. అయితే, ఇటీవలే దీన్ని రద్దు చేయటంతో అమెజాన్ ప్రతిపాదనకు డీఐపీపీ ఆమోదముద్ర వేసింది. తాజా ప్రతిపాదన ప్రకారం ఆహారోత్పత్తుల వ్యాపారానికి సంబంధించి అమెజాన్ భారత్‌లో అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఆహారోత్పత్తులను నిల్వ చేసుకుని, ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంది.
ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కేంద్రం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తోంది. ఈ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీలు భారత్‌లో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసి... దేశీయంగా తయారయ్యే ఆహారోత్పత్తులను మాత్రమే విక్రయించాలి. వీటిని స్టోర్స్ లేదా ఆన్‌లైన్లో విక్రయించవచ్చు. ఆహారోత్పత్తుల రిటైలింగ్‌లో పెట్టుబడులకు సంబంధించి అమెజాన్, గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ సంస్థల నుంచి సుమారు 695 మిలియన్ డాలర్ల విలువ చేసే ఇన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనలు కేంద్రానికి వచ్చాయి. అమెరికాకు చెందిన అమెజాన్ భారత్‌లో కీలకమైన ఈ–కామర్స్ సంస్థల్లో ఒకటి కాగా.. గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ సంస్థలు ఆన్‌లైన్లో నిత్యావసరాలు మొదలైనవి విక్రయిస్తున్నాయి. 2016–17 (ఏప్రిల్ – డిసెంబర్ మధ్య) భారత ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలోకి 663.23 మిలియన్ డాలర్ల పైగా విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు వచ్చాయి.