ఈ-కామర్స్లోకి మరిన్ని ఎఫ్డీఐలు | Government permits 100% FDI in e-commerce market places, but with riders | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్లోకి మరిన్ని ఎఫ్డీఐలు

Published Wed, Mar 30 2016 1:09 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

ఈ-కామర్స్లోకి మరిన్ని ఎఫ్డీఐలు - Sakshi

ఈ-కామర్స్లోకి మరిన్ని ఎఫ్డీఐలు

‘మార్కెట్ ప్లేస్’ సంస్థల్లోకి
100% ఆటోమేటిక్ అనుమతులు
ఈ-కామర్స్‌పై డీఐపీపీ మార్గదర్శకాలు

 న్యూఢిల్లీ: రిటైల్ ఈ-కామర్స్ విభాగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఆకర్షించే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘మార్కెట్ ప్లేస్’ తరహా రిటైల్ కార్యకలాపాలు సాగించే ఈ-కామర్స్ సంస్థల్లో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం పెట్టుబడులను అనుమతిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. అమెజాన్, ఈబే తదితర విదేశీ దిగ్గజాలు.. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి దేశీ కంపెనీలకు ఇది ఊతమివ్వనుంది. పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఈ-కామర్స్‌పై స్పష్టతనిచ్చేలా మార్కెట్ ప్లేస్, ఇన్వెంటరీ ఆధారిత మోడల్స్‌లో లావాదేవీలు నిర్వహించే సంస్థలను, వాటి కార్యకలాపాలను ఇందులో నిర్వచించింది. ప్రస్తుతం ఆన్‌లైన్లో వ్యాపార సంస్థల మధ్య క్రయ, విక్రయాలకు(బి2బి) వెసులుబాటునిచ్చే ఈ-కామర్స్ సంస్థల్లో మాత్రమే 100% దాకా ఎఫ్‌డీఐలకు ఆటోమేటిక్‌గా అనుమతిస్తున్నారు. సాధారణ వినియోగదారులకు విక్రయాలు జరిపే(బి2సి) ఈ-కామర్స్ సంస్థల్లో ఎఫ్‌డీఐలకు నిర్దిష్ట పరిమితులు పెట్టారు. దేశీ ఆన్‌లైన్ రిటైలర్లు ఎఫ్‌డీఐలను సులువుగా సమీకరించేందుకు తాజా మార్గదర్శకాలు తోడ్పడనున్నాయి.

 స్పష్టత వచ్చింది..: భారత్‌లో ఈ-కామర్స్ పరిశ్రమ శరవేగంగా 60% వృద్ధి రేటుతో ఎదిగింది. 2016లో పరిశ్రమ పరిమాణం 38 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, 2020 నాటికి 50 బిలియన్ మార్కును దాటొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు దేశీ ఈ-కామర్స్ పరిశ్రమపై స్పష్టతనిచ్చాయని స్నాప్‌డీల్ పేర్కొంది. భారత్‌లో ఈ-కామర్స్ వృద్ధికి ఇవి తోడ్పడగలవని ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. అయితే విక్రేత అమ్మకాలపై 25% పరిమితుల విషయంలో ఆపరేటర్లు కాస్త కసరత్తు చేయాల్సి ఉం టుందని పీడబ్ల్యూసీ పార్ట్‌నర్ ఆకాశ్ గుప్త్ తెలిపారు.

 మార్గదర్శకాలు ఇవీ...
ఈ-కామర్స్,  ఇన్వెంటరీ ఆధారిత విధానం, మార్కెట్ ప్లేస్ విధానాలను డీఐపీపీ స్పష్టంగా నిర్వచించింది. వస్తువులు, సేవలను డిజిటల్, ఎలక్ట్రానిక్ నెట్‌వర్క్ ద్వారా అమ్మడం, కొనడాన్ని ‘ఈ-కామర్స్’గా పేర్కొంది. విక్రేత, కొనుగోలుదారుల మధ్య క్రయవిక్రయ లావాదేవీలకు వెసులుబాటునిస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్‌ఫాంను అందించే విధానాన్ని ‘మార్కెట్ ప్లేస్’ తరహాగా తెలిపింది. ఇక, ఈ-కామర్స్ సంస్థ స్వయంగా సర్వీసులు, సరుకులను నిల్వ చేసుకుని, కొనుగోలుదారులకు నేరుగా విక్రయించిన పక్షంలో దాన్ని ‘ఇన్వెంటరీ ఆధారిత’ విధానంగా పరిగణించ నున్నట్లు వివరించింది.

మార్గదర్శకాల ప్రకారం ఈ-కామర్స్ సంస్థ ప్లాట్‌ఫాంపై ఏ ఒక్క వెండార్/గ్రూప్ కంపెనీల అమ్మకాలు 25% మించి ఉండకూడదు. మార్కెట్‌ప్లేస్ విధానంలో వస్తువులు, సర్వీసులను విక్రయించే సంస్థల పేరు, చిరునామా, ఇతర వివరాలన్నీ వెబ్‌సైట్లో పొందుపర్చాలి.

విక్రయానంతరం సంతృప్తికరంగా కస్టమర్లకు చేరవేయడం విక్రేత బాధ్యతగా ఉంటుంది. వారంటీ/గ్యారంటీ బాధ్యత కూడా సెల్లర్‌దే ఉంటుంది.

మార్కెట్‌ప్లేస్ ఈ-కామర్స్ సంస్థలు సదరు ఉత్పత్తులు, సర్వీసుల ధరలను ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ప్రభావితం చేయకూడదు. విక్రయించే సంస్థలన్నింటికీ సమాన అవకాశాలు కల్పించాలి.

విక్రేతలకు కావాలంటే గిడ్డంగులు, రవాణా, కాల్ సెంటర్, పేమెంటు కలెక్షన్ తదితర సర్వీసులను ఈ-కామర్స్ సంస్థలు అందించవచ్చు. అయితే అంత మాత్రం చేత సదరు ఉత్పత్తులపై వాటికి యాజమాన్య హక్కులు దఖలుపడవు. ఒకవేళ ఆ విధంగా చేస్తే దాన్ని ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ సంస్థగా కాకుండా ఇన్వెంటరీ ఆధారిత సంస్థగా పరిగణిస్తారు.  ఇలాంటి వాటిల్లోకి ఆటోమేటిక్ పద్ధతిలో 100% ఎఫ్‌డీఐల రాకకు అనుమతి ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement