న్యూయార్క్: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రారంభమైన ఉద్యోగాల కోతలు వచ్చే ఏడాది వరకూ కొనసాగనున్నాయి. ఎంత మందిని తొలగించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కంపెనీ సీఈవో ఆండీ జస్సీ పేర్కొన్నారు. వార్షిక సమీక్ష ప్రక్రియ వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని, కస్టమర్ల అవసరాలు.. కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏయే విభాగాల్లో ఎంత మంది సిబ్బందిని తగ్గించుకోవాలనే దానిపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఉద్యోగులకు పంపిన నోట్‌లో జస్సీ పేర్కొన్నారు.
తీసివేతల గురించి డివైజ్‌లు, బుక్స్ విభాగాల సిబ్బందికి బుధవారం తెలియజేశామని, కొందరికి స్వచ్ఛందంగా పదవీ విరమణ అవకాశాలను కూడా ఆఫర్ చేశామని ఆయన వివరించారు. తాను సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలంలో సిబ్బందిని తగ్గించుకునే అంశం అత్యంత కష్టతరమైన నిర్ణయమని జస్సీ పేర్కొన్నారు. అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది గంటలవారీగా పని చేసే వర్కర్లు ఉన్నారు.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని తమ కార్యాలయాల్లో 260 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్న విషయాన్ని మూడు రోజుల క్రితం అధికారులకు తెలియజేసింది. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్న పలు టెక్ కంపెనీలు .. తాజాగా సిబ్బందిని తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా 11,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ట్విటర్‌ను టేకోవర్ చేశాక ఎలాన్ మస్క్ సగానికి పైగా ఉద్యోగులను తీసివేశారు.
Comments
Please login to add a commentAdd a comment