voluntary retirement offer
-
హీరో మోటోకార్ప్ సిబ్బందికి వీఆర్ఎస్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ప్రకటించింది. సామ ర్థ్యం మెరుగుదల, వ్యయ నియంత్రణ, పటిష్ట ఉత్పాదక సంస్థగా రూపుదిద్దుకోవడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వీఆర్ఎస్ ఉద్యోగులందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఒకేసారి తగిన స్థాయిలో డబ్బు అందజేత, వేరియబుల్ పే (పనితీరు ఆధారంగా అదనపు ప్రయోజనం), బహుమతులు, వైద్య కవరేజీ, కంపెనీ కారు వినియోగం, పునరా వాస సహాయం, కెరీర్ మద్దతు వంటి ఎన్నో ప్రయోజనాలను ప్యాకేజీలో భాగంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహన విభాగంలో రిటైల్ అమ్మకాలు ఏడేళ్ల కనిష్ట స్థాయిలో 1.59 కోట్ల యూనిట్లకు పడిపోయినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తాజా డేటా నేపథ్యంలో హీరో మోటోకార్ప్ తాజా ప్రకటన చేసింది. అయితే మార్చిలో మంచి అమ్మకాలు జరగడం ఒక వినియోగ సెంటిమెంట్‌కు సంబంధించి ఒక సానుకూల పరిణామమని కంపెనీ పేర్కొంది. ప్రభుత్వ నిర్మాణాత్మక విధానాలు, సామాజిక రంగ సంస్కరణలు డిమాండ్‌ను ప్రోత్సహిస్తాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధికి ఈ అంశాలు దోహదం చేస్తాయని ద్విచక్ర వాహన పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ వివరించింది. -
ఉద్యోగుల విషయంలో ఎయిరిండియా కీలక నిర్ణయం!
టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ ఫ్లయింగ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తూ..40 ఏళ్ల వయస్సు నిండి.. వరుసగా 5 ఏళ్ల పాటు సంస్థలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సిబ్బందికి వాలంటరీ రిటైర్మెంట్ ఆఫర్ (వీఆర్ఎస్) ఇచ్చింది. ఈ ఆఫర్లో అర్హులైన సిబ్బందికి ఎయిరిండియా ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందివ్వనుంది. పీటీఐ కథనం ప్రకారం.. పర్మినెంట్ జనరల్ కేడర్‌కు చెందిన ఉద్యోగులతో పాటు క్లరికల్, నైపుణ్యం లేని కేటగిరీల ఉద్యోగులకు సైతం వాలంటరీ రిటైర్మెంట్ ఆఫర్లోకి వస్తారని ఎయిరిండియా తెలిపింది. సంస్థ ప్రకటించిన స్వచ్ఛంద విరమణలో సుమారు 2,100 మంది ఉద్యోగులు ఉన్నట్లు పీటీఐ పేర్కొంది. మాకు కావాలి ఎయిరిండియా ప్రకటించినట్లుగా సెకండ్ ఫేజ్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్‌లో అదనపు ప్రయోజనాల్ని ఇతర పర్మినెంట్ ఉద్యోగులకు వర్తించేలా చూడాలని సంస్థను కోరుతున్నారు. ఇక రెండవ దశ స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్‌ను ఎయిర్ ఇండియా చీఫ్ హ్యూమన్ రిసోర్స్ అధికారి సురేష్ దత్ త్రిపాఠి ప్రకటించారు. ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా ఎంతంటే మార్చి 17, 2023 నుండి ఏప్రిల్ 30, 2023 వరకు స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు కూడా వన్ టైమ్ బెనిఫిట్‌గా ఎక్స్‌గ్రేషియా మొత్తం అందిస్తున్నట్లు తెలిపారు. మార్చి 31, 2023 వరకు దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన ఉద్యోగులు రూ. 1 లక్షకు పైగా ఎక్స్ గ్రేషియా మొత్తం అందుకుంటారని పేర్కొన్నారు. కాగా, మొదటి దశలో వాలంటరీ రిటైర్మెంట్ ఆఫర్లో ఫ్లయింగ్, నాన్ ఫ్లయింగ్ సిబ్బంది ఉన్నారు. వారిలో మొత్తం 4,200 మంది ఉద్యోగులు అర్హులు కాగా, 1,500 మంది మాత్రమే సంస్థ ప్రకటించిన వీఆర్ఎస్కు అంగీకరించారు. -
వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల్లో కోతలు
న్యూయార్క్: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రారంభమైన ఉద్యోగాల కోతలు వచ్చే ఏడాది వరకూ కొనసాగనున్నాయి. ఎంత మందిని తొలగించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కంపెనీ సీఈవో ఆండీ జస్సీ పేర్కొన్నారు. వార్షిక సమీక్ష ప్రక్రియ వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని, కస్టమర్ల అవసరాలు.. కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏయే విభాగాల్లో ఎంత మంది సిబ్బందిని తగ్గించుకోవాలనే దానిపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఉద్యోగులకు పంపిన నోట్లో జస్సీ పేర్కొన్నారు. తీసివేతల గురించి డివైజ్‌లు, బుక్స్ విభాగాల సిబ్బందికి బుధవారం తెలియజేశామని, కొందరికి స్వచ్ఛందంగా పదవీ విరమణ అవకాశాలను కూడా ఆఫర్ చేశామని ఆయన వివరించారు. తాను సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలంలో సిబ్బందిని తగ్గించుకునే అంశం అత్యంత కష్టతరమైన నిర్ణయమని జస్సీ పేర్కొన్నారు. అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది గంటలవారీగా పని చేసే వర్కర్లు ఉన్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని తమ కార్యాలయాల్లో 260 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్న విషయాన్ని మూడు రోజుల క్రితం అధికారులకు తెలియజేసింది. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్న పలు టెక్ కంపెనీలు .. తాజాగా సిబ్బందిని తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 11,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ట్విటర్‌ను టేకోవర్ చేశాక ఎలాన్ మస్క్ సగానికి పైగా ఉద్యోగులను తీసివేశారు. -
ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ ఆఫర్
న్యూఢిల్లీ : తీవ్ర నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ప్రైవేటీకరణ దిశగా ముందుకు సాగుతున్న ఎయిరిండియా సంస్థ, తమ ఉద్యోగుల్లో కొంతమందిని వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా వదులుకోవాలని చూస్తోంది. కంపెనీలో ఉన్న మొత్తం 40వేల మంది ఉద్యోగుల్లో మూడో వంతు మందికి ఈ ఆఫర్‌ను ప్రకటించాలని ప్లాన్ చేస్తుందని కంపెనీకి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. దీనికోసం ప్రతిపాదనలను కూడా సిద్ధంచేస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ ఎయిరిండియా కనుక ఈ ఆఫర్ ప్రకటిస్తే, ప్రభుత్వరంగ సంస్థల అతిపెద్ద ఆఫర్లలో ఇది కూడా ఒకటిగా నిలువనుంది. మరోవైపు ఎయిరిండియా అమ్మకానికి సర్వం సిద్ధమైంది. కొనుగోలుదారుడి ఎంపికలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. టాటా గ్రూప్ వంటి దిగ్గజాలు దీని కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎయిరిండియాను మొత్తానికి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, ప్రభుత్వం పూర్తిగా చేతులు దులిపేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఎయిరిండియా తన వ్యయాలను తగ్గించుకోవడానికి ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారాన్ని రద్దు చేసింది. కేవలం శాకాహారమే ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పింది. 40వేల మంది ఉద్యోగుల్లో 15వేల మందికి ఎలా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఆఫర్ చేస్తారో తెలుపుతూ నివేదిక తయారుచేసి తమకు అందించాలని ఎయిరిండియాను ఏవియేషన్ మంత్రిత్వశాఖలోని టాప్-బ్యూరోక్రాట్లు సంస్థను ఆదేశించినట్టు కూడా సీనియర్ అధికారి చెప్పారు. ''ఇంకా ఏదీ ఖరారు కాలేదని కానీ ఎయిరిండియా అమ్మకాన్ని ఎంత సరళమైన రీతిలో అయితే అంతే సరళమైన ప్రక్రియలో చేపడతాం'' అని రెండో టాప్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం తాజాగా వచ్చే పెట్టుబడులను కూడా హోల్డ్‌లో పెడుతున్నారు.