ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ ఆఫర్
ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ ఆఫర్
Published Tue, Jul 18 2017 6:55 PM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM
న్యూఢిల్లీ : తీవ్ర నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ప్రైవేటీకరణ దిశగా ముందుకు సాగుతున్న ఎయిరిండియా సంస్థ, తమ ఉద్యోగుల్లో కొంతమందిని వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా వదులుకోవాలని చూస్తోంది. కంపెనీలో ఉన్న మొత్తం 40వేల మంది ఉద్యోగుల్లో మూడో వంతు మందికి ఈ ఆఫర్‌ను ప్రకటించాలని ప్లాన్ చేస్తుందని కంపెనీకి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. దీనికోసం ప్రతిపాదనలను కూడా సిద్ధంచేస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ ఎయిరిండియా కనుక ఈ ఆఫర్ ప్రకటిస్తే, ప్రభుత్వరంగ సంస్థల అతిపెద్ద ఆఫర్‌లలో ఇది కూడా ఒకటిగా నిలువనుంది. మరోవైపు ఎయిరిండియా అమ్మకానికి సర్వం సిద్ధమైంది. కొనుగోలుదారుడి ఎంపికలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. టాటా గ్రూప్ వంటి దిగ్గజాలు దీని కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎయిరిండియాను మొత్తానికి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, ప్రభుత్వం పూర్తిగా చేతులు దులిపేసుకోవాలని చూస్తోంది.
మరోవైపు ఎయిరిండియా తన వ్యయాలను తగ్గించుకోవడానికి ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారాన్ని రద్దు చేసింది. కేవలం శాకాహారమే ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పింది. 40వేల మంది ఉద్యోగుల్లో 15వేల మందికి ఎలా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఆఫర్ చేస్తారో తెలుపుతూ నివేదిక తయారుచేసి తమకు అందించాలని ఎయిరిండియాను ఏవియేషన్ మంత్రిత్వశాఖలోని టాప్-బ్యూరోక్రాట్‌లు సంస్థను ఆదేశించినట్టు కూడా సీనియర్ అధికారి చెప్పారు. ''ఇంకా ఏదీ ఖరారు కాలేదని కానీ ఎయిరిండియా అమ్మకాన్ని ఎంత సరళమైన రీతిలో అయితే అంతే సరళమైన ప్రక్రియలో చేపడతాం'' అని రెండో టాప్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం తాజాగా వచ్చే పెట్టుబడులను కూడా హోల్డ్‌లో పెడుతున్నారు.
Advertisement