రికార్డ్ స్థాయిలో ఎఫ్డీఐలు
♦ ప్రభుత్వ చర్యలే ప్రధాన కారణం
♦ డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్
న్యూఢిల్లీ: భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్-ఎఫ్‌డీఐ) జోరుగా వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలానికి రికార్డ్ స్థాయిలో 5,100 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఈ స్థాయిలో ఎఫ్‌డీఐలు ఇంతవరకూ ఎన్నడూ రాలేదని డీఐపీపీ(డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్) కార్యదర్శి రమేశ్ అభిషేక్ వెల్లడించారు. ఆరోగ్యకరమైన వాణిజ్య వాతావరణం భారత్‌లో నెలకొన్నదని, అందుకని ఎఫ్‌డీఐలు జోరుగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక ఫిక్కి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రెండంకెల వృద్ధి రేటు అవసరం...
2011-12లో 4,655 కోట్లు, 20114-15లో 4,429 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని రమేశ్ అభిషేక్ వివరించారు. తగిన వాణిజ్య వాతావరణం నెలకొల్పడం కష్టమైన పనేనని, అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకొని వ్యాపారం చేయడం సులభమయ్యే పరిస్థితులను మరింతగా మెరుగుపరచిందని వివరించారు. సంక్లిష్టమైన ప్రక్రియలు, వివిధ అనుమతుల్లో తీవ్రమైన జాప్యం జరుగుతుండడం.. దశాబ్దాలుగా భారత్‌లో కనిపించే పరిస్థితులనీ, క్రమంగా ఈ పరిస్థితులన్నీ తొలగిపోయాయని పేర్కొన్నారు. సగటు మనిషికి, వ్యాపారానికి ఊరటనిచ్చే పలు చర్యలు ప్రభుత్వం తీసుకుందని వివరించారు.
వెలుపలి నుంచి వచ్చే టెక్నాలజీకి, ఇక్కడ అభివృద్ధి అయ్యే టెక్నాలజీకి అనువైన వాతావరణం సృష్టించడానికి, సృజనాత్మకత, నవకల్పనలకు రక్షణ కల్పిం చడం ముఖ్యమని తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు రక్షించబడతాయనే నమ్మకం వారికి కలిగేలా తగిన వాతావరణం కల్పించచంలో ప్రభుత్వం విజ యవంతమైందని ఈ ఎఫ్‌డీఐ గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. అడ్డంకులను తొలగించడానికి, మొత్తం వ్యాపార వాతావరణం మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు.