తయారీ హబ్‌గా ఎదగాలంటే ఎగుమతులూ కీలకమే
న్యూఢిల్లీ: కేవలం దేశీ వినియోగానికే పరిమితం కాకుండా ఎగుమతులూ పెరిగినప్పుడే భారత్ .. తయారీ హబ్‌గా ఆవిర్భవించగలదని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ చెప్పారు. మేకిన్ ఇండియా నినాదం తీరుతెన్నులపై ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శలు చేసిన నేపథ్యంలో కాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా బాటలో ఎగుమతులపై కాకుండా దేశీ మార్కెట్‌పై దృష్టి సారిస్తూ మేక్ ఫర్ ఇండియా విధానాన్ని అమల్లోకి తేవాలంటూ రాజన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
తాజాగా పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అమితాబ్ కాంత్.. రాజన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా సరే ప్రాథమికంగా దేశీ మార్కెట్ కోసం ఉత్పత్తి చేసినా .. ఆ తర్వాత క్రమంగా విదేశీ మార్కెట్లలోకి విస్తరించాలని యోచిస్తారని, నిజమైన వ్యాపారవేత్త చేయాల్సిన పని కూడా అదేనని కాంత్ పేర్కొన్నారు. ఎగుమతుల ప్రాధాన్యాన్ని గుర్తెరిగి, మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ప్రధాన పాత్ర పోషించాలంటే దేశీ పరిశ్రమ పోటీతత్వాన్ని మరింతగా అలవర్చుకోవాల్సి ఉంటుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్‌ఖేర్ పేర్కొన్నారు.