ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో వాటా 20%
జీ20 షెర్పా అమితాబ్ కాంత్ విశ్లేషణ
న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో వచ్చే దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 20 శాతం వాటను కలిగి ఉంటుందని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఏఐఎంఏ సదస్సులో ఆయన మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని, ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని పేర్కొన్నారు.
రాబోయే మూడు సంవత్సరాలలో భారత్ ఎకానమీ జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న భరోసాను ఇచ్చారు. ప్రపంచ ఎకానమీకి భారత్ ఛోదక శక్తిగా ఆవిర్భవిస్తోందని పేర్కొన్నారు. ‘‘ఈ రోజు మనం చూస్తున్నది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక తరానికి ఒకసారి జరిగే మార్పు. కొన్ని సంవత్సరాల క్రితం భారత్ బలహీనమైన ఐదు దేశాల్లో ఉంది. బలహీనమైన ఐదు నుంచి ఒక దశాబ్దంలో మొదటి ఐదు స్థానాలకు చేరుకున్నాము’’అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గ్రామీణుల జీవన ప్రమాణాలు పెరగాలి..
మూడు దశాబ్దాల్లో 9–10 శాతం వృద్ధి సాధించి, 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలను మార్చాలని, ఆరోగ్య రంగం మెరుగుపడాలని, పోషకాహార ప్రమాణాలు పెరగాలని అమితాబ్ కాంత్ ఉద్ఘాటించారు. భవిష్యత్ వృద్ధిని సాధించడానికి భారత్‌లో రాష్ట్రాల పాత్ర కీలకమని అన్నారు. ‘‘అంటే దేశ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది’’ అని ఈ వివరించారు.
‘‘మనం వాటిని మార్చడం చాలా క్లిష్టమైనది. ఎన్ని అవరోధాలు ఎదురయినప్పటికీ, ఆయా రాష్ట్రాలు మానవ అభివృద్ధి సూచికలో మెరుగుదలకు కీలకమైన ఛోదక శక్తిగా మారడం చాలా ముఖ్యం’’ అని కాంత్ అన్నారు. భారతదేశ జనాభాలో 50 శాతం మంది వృద్ధిని సృష్టిలో కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే దిగువ 50 శాతం మంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక జీవన ప్రమాణాలను సాధించడానికి వ్యవసాయ కూలీ లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడుతున్నారని ఆయన తెలిపారు.ఈ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం చాలా ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు.
అభివృద్ధి చెందిన దేశమంటే...
ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,300 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. ఆ స్థాయి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment