న్యూఢిల్లీ: డిజిటల్ పరివర్తనలో భారత్ చేస్తున్న కృషిని జీ20 కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పనున్నట్లు నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. తద్వారా గ్లోబల్ సౌత్ (లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఓషియానియా దేశాలు) ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తోడ్పాటు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 8వ జాతీయ నాయకత్వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు.
అంతర్జాతీయంగా 400 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు లేదని, 250 కోట్ల మంది కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదని కాంత్ చెప్పారు. 133 దేశాల్లో వేగవంతమైన డిజిటల్ చెల్లింపుల విధానాలు లేవని పేర్కొన్నారు. అలాంటిది, డిజిటైజేషన్ ద్వారా భారత్ ప్రజల జీవితాల్లో మార్పులు తేగలిగిందని, ఉత్పాదకత పెంచుకుని సమర్థమంతమైన ఆర్థిక వ్యవస్థగా ముందుకెడుతోందని కాంత్ చెప్పారు.
డిజిటైజేషన్ డిజిటల్ చెల్లింపులు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘భారత్ పాటిస్తున్న ఈ మోడల్‌ను మిగతా ప్రపంచం ముందుకు ఎలా తీసుకెళ్లాలన్నది ఒక సవాలు. భారత డిజిటల్ పరివర్తన గాధను ప్రపంచానికి పరిచయం చేసేందుకు జీ20 వేదికను ఉపయోగించు కుందాం. ఆ విధంగా గ్లోబల్ సౌత్ దేశాల పౌరుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం‘ అని కాంత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment