రైల్వే జోన్‌గా మంగళూరు
- రైల్వే మంత్రి సదానందగౌడ
- సాంకేతికతతో భద్రత
- చార్జీల పెంపుతోనే అభివృద్ధి
- జులైలో మధ్యంతర రైల్వే బడ్జెట్
- త్వరలో బుల్లెట్, హై స్పీడ్ రైళ్లు
సాక్షి, బెంగళూరు : మంగళూరును రైల్వే జోన్‌గా తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ చెప్పారు. దీని వల్ల కర్ణాటకలోని తీరప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరగడానికి అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా సొంత జిల్లా అయిన మంగళూరుకు శనివారం ఆయన విచ్చేశారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ... రోజురోజుకు రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందన్నారు. తమ ప్రభుత్వం ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
ఇందుకోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా నూతన రైలు మార్గాల నిర్మాణం, ప్రయాణికులకు సౌకర్యాల పెంపు, రైల్వే శాఖలో వివిధ విభాగాల్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి చాలా నిధులు అవసరమన్నారు. అందువల్ల రైల్వే శాఖలో అభివృద్ధి జరగాలంటే టికెట్టు చార్జీలను సమయానికి తగ్గట్టు పెంచక తప్పదన్నారు.
అయితే ఈ విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చించిన తర్వాతే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, జులైలో మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నామని సదానంద తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ప్రజలకు బుల్లెట్, హై స్పీడ్ రైళ్లను అందుబాటలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు.