కూత పెట్టేనా? | today railway budget | Sakshi
Sakshi News home page

కూత పెట్టేనా?

Published Tue, Jul 8 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

కూత పెట్టేనా?

కూత పెట్టేనా?

సింగిల్ లైన్‌తో ప్రయాణికుల అవస్థలు... క్రాసింగ్ వస్తే గంటల తరబడి వెయిటింగ్... ప్రతి బడ్జెట్‌లో అరకొర నిధుల కేటాయింపు... ఊరిస్తున్న మాచర్ల-గద్వాల రైల్వే లైన్... ఇదీ పాలమూరు జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి. దశాబ్దాకాలంగా రైల్వే బడ్జెట్‌లో జిల్లా అన్యాయానికి గురవుతోంది. గత పాలకుల నిర్లక్ష్యం, జిల్లా ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగా కొత్త ప్రాజెక్టులే కాదు కనీసం నిధులు కూడా రావడం లేదు. జిల్లాలో రైల్వే స్టేషన్లు సమస్యల నిలయంగా మారాయి. కొత్త రైళ్ల రాక, రైళ్ల పొడిగింపు, బ్రిడ్జిల నిర్మాణం కలగా మారింది. ఈసారైనా మన ఎంపీలు రైల్వే బోర్డుకు పంపిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకున్నారా? లేదా బుట్టదాఖలయ్యాయా?.. ఈ విషయం నేడు కేంద్రమంత్రి సదానందగౌడ ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌తో తేలనుంది.  
 
 నేడు  రైల్వే బడ్జెట్

* సదానందా...కరుణ చూపేనా?
* నిర్లక్ష్యానికి గురవుతున్న పాలమూరు రైల్వే ప్రాజెక్టులు
* ముందుకు సాగని ఫలక్‌నుమా-మహబూబ్‌నగర్     డబ్లింగ్ పనులు
* నడిగడ్డ రైల్వే ప్రతిపాదనలకు మోక్షం లభించేనా?
* గద్వాల- మాచర్ల నూతన లైన్‌కు మంజూరు ఎప్పుడో?

ముందుకు సాగని డబ్లింగ్ పనులు...
ఫలక్‌నామా-మహబూబ్‌నగర్ డబ్లింగ్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ లైన్ కేవలం సర్వేలకే పరిమితమవుతోంది. ప్రతి బడ్జెట్‌లో డబ్లింగ్ లైన్‌కు నిధులు కేటాయించడంలో వివక్ష కొనసాగుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ 1996-97లో మంజూరైన మహబూబ్‌నగర్- మునీరాబాద్ రైల్వే లైన్ పనులు మాత్రమే చురుగ్గా సాగుతున్నాయి. అదికూడా కర్ణాటక రాష్ట్ర ప్రతినిధుల చొరవ వల్లే పనులు జరుగుతున్నాయి. జిల్లా ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంతోనే ఫలక్‌నుమా-మహబూబ్‌నగర్ డబుల్ రైల్వేలైన్ వెనక్కి పోతోంది.
 
స్టేషన్ల అభివృద్ధిపై కనిపించని కరుణ
మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ స్టేషన్ల అభివృద్ధికి గత బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన కనిపించలేదు. మహబూబ్‌నగర్, గద్వాల రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించి నాలుగేళ్లు గడిచినా జరిగిన పనులు ఏమిలేవు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జిల్లా రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా మార్చాలనే డిమాండ్ ఉంది. ఇక రద్దీవేళల్లో మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ స్టేషన్‌లలో టికెట్లు తీసుకోవడానికి కూడా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
 
మహబూబ్‌నగర్-గుత్తి డబుల్‌లైన్‌కు మోక్షం కలిగేనా...
గద్వాల-రాయచూర్‌ల మధ్య మరిన్ని రైళ్లు పెరుగుతాయన్న ఆశ రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉంది. గత ఫిబ్రవరి 12న ప్ర వేశ పెట్టిన రైల్వే బడ్జెట్‌లో అప్పటి కర్నూలు ఎంపీ సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వేశాఖ సహాయ మంత్రిగా ఉండటంతో కేవలం కాచిగూడ-తిరుపతి డబుల్ డెక్కర్ రైలు మాత్రమే మంజూరై ప్రారంభమైంది. మిగతా పెండింగ్ సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. ప్రస్తుతం డబుల్ డెక్కర్ రైలుకు ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. 2013-14 బడ్జెట్‌లో మహబూబ్‌నగర్ -గుత్తి వరకు డబుల్ ట్రాక్ నిర్మాణానికి సర్వే అనుమతి ఇచ్చారు. ఇప్పటికే డబుల్‌లైన్‌కు సంబంధించిన సర్వేలను అధికారులు పూర్తి చేసి రైల్వే శాఖకు పంపించారు. ఈసారి ట్రాక్ నిర్మాణానికి అ నుమతి లభిస్తుందనే ఆశతో ఆ ప్రాంత వాసులు ఉన్నారు.
 
వీటికి స్థానం దక్కేనా!
పేద, మధ్య తరగతి రథంగా పేరొందిన రైలు బండి కూత వినేందుకు నాగర్‌కర్నూల్, కల్వకుర్తి వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. రాయచూరు నుంచి వయా గద్వాల మీదుగా మా చర్ల దాకా రైల్వే లైన్ పూర్తి అయితే ప్రజల ఆశలు నెరవేరుతాయి. మొదటిదశలో భాగంగా రాయచూరు నుంచి గద్వాల వరకు దాదాపు 59 కిలోమీటర్ల దూరం గల రైల్వే లైన్ పూర్తిచేయడానికే సరిగ్గా పుష్కరకాలం పట్టింది. మిగతా గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మీ దుగా మాచర్ల దాకా వేయాల్సిన రైలు లైన్‌కు సంబంధించి దశాబ్ద కాలంగా కేవలం ప్రతి పాదనలకు మాత్రమే పరిమితమవుతున్నా యి.

గతేడాది కూడా వీటిపై ప్రతిపాదనలు పంపినా ఈప్రాజెక్టుకు మోక్షం లభించలేదు. గత అక్టోబర్‌లో ప్రారంభమైన గద్వాల- రాయచూరు నూతన బ్రాడ్‌గేజ్ లైన్‌లో ప్రస్తుతం ఒక్క డెమో రైలు మాత్రమే ప్రయాణికులకు సేవలు అందిస్తోం ది. ఈ లైన్‌లో కొత్త రైళ్లను ప్రవేశ పెడితే రాయచూరు, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య మరింతగా రైల్వే రవాణా సౌకర్యం పెరుగుతుంది.

ద్రోణాచలం నుంచి వయా గద్వాల మీదుగా రాయచూరు ద్వారా ముంఠియి వరకు ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెడతామని గతంలో హామీ ఉన్నా ఇప్పటి వరకు మోక్షం లేదు. గద్వాల జంక్షన్‌గా అభివృద్ధి చెందినందున గద్వాల మీదుగా వెళ్తున్న దూర ప్రాంత ఎక్స్‌ప్రెస్‌లు గోర ఖ్‌పూర్, కోర్బా, ఇండోర్ తదితర ఎక్స్‌ప్రెస్‌లను గద్వాలలో ఒక నిమిషం ఆపాలని ఇప్పటికే డిమాండ్లు ఉన్నాయి. గద్వాల రైల్వే జంక్షన్ వద్ద దాదాపు 110 ఎకరాల స్థలం ఉన్నందున, రైల్వే శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర రైల్వేమంత్రి ఆమోదం తెలిపితే ఈ ప్రాంత రైల్వేల అభివృద్ధి మరింతగా పెరిగే అవకాశం ఉంది.   
 
 గతేడాది పంపిన ప్రతిపాదనలు

* చెన్నై, ముంబాయి మెట్రో నగరాలకు అతి తక్కువ మార్గంలో కలిపే రాయచూర్-గద్వాల మధ్య రైల్వే ట్రాక్ అంతా సిద్ధమైంది. కానీ రైళ్ల రాకపోకలు జరగడం లేదు. గద్వాల మీదుగా చెన్నై-షిర్డి మధ్య రైళ్ల రాకపోకలు సాగిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి.
* గద్వాల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న 110 ఎకరాల స్థలంలో రైల్వే డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటీ ఆచరణలోకి రావడం లేదు.  
* జిల్లాలో రైల్వే లైన్ సింగిల్ కావడంతో రైళ్ల రద్దీ కారణంగా తరచూ క్రాసింగ్ ఏర్పడుతోంది. రైల్వే లైన్ డబ్లింగ్ చేయాలి.
* వాణిజ్య కేంద్రమైన జడ్చర్లలో గూడ్స్ రైళ్ల కారణంగా తరచూ రైల్ గేట్ పడటంతో వాహనాల రాకపోకలకు అటంకాలు ఏర్పడుతున్నాయి. దీని పరిష్కారం కోసం వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మించాలి.
 
 ఎంపీ జితేందర్‌రెడ్డి రైల్వే బోర్డు ముందు ఉంచిన ప్రతిపాదనలు  
* ఉందానగర్ (శంషాబాద్)- డోన్ డబ్లింగ్ లైన్ ఏర్పాటు
* మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్ వయా మక్తల్-మునీరాబాద్ లైన్
* జడ్చర్ల నుంచి నంద్యాల వయా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ రైల్వేలైన్
* గద్వాల-మాచర్ల వయా నాగర్‌కర్నూల్, దేవరకొండ కొత్త రైల్వే లైన్
* ఫలక్‌నామా దాకా ఉన్న ఎలక్ట్రికల్ లైన్‌ను మహబూబ్‌నగర్ వరకు పొడగించాలి
* జడ్చర్లలో ఆర్వోబీ నిర్మాణం
* రైల్వే ట్రాక్‌లను బలోపేతం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement