ఆగని రైళ్లు మాకెందుకు?
రామగుండం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై జిల్లావాసులు పెదవివిరుస్తున్నారు. అంతా హైఫై అంటూ సామాన్యులను విస్మరించారని, రామగుండంలో హాల్టింగ్ లేని రైళ్లను కేటాయించి అన్యాయమే చేశారంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ప్రీమియం, హైస్పీడ్ పేరుతో పలు రైళ్లు వస్తున్నాయని రైల్వే మంత్రి సదానందగౌడ్ తెలిపారు. అయితే అవి సామాన్య ప్రయాణికులకు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందస్తుగానే ఇంటర్‌నెట్‌లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వేస్టేషన్లలోని కౌంటర్లలో టికెట్లు ఇవ్వరని అధికారులు తెలిపారు.
ధనార్జనే ధ్యేయం
ఇప్పటికే తత్కాల్ పేరుతో అదనపు రుసుం వసూలు చేస్తున్న రైల్వే శాఖ మరోసారి ప్రీమియం రైళ్ల పేరుతో ధనార్జనే ధ్యేయం అని చెప్పింది. ప్రయాణికుల అవసరాలను ఆదాయ వనరుగా మార్చుకుంటోంది. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ప్రీమియం రైలును ప్రవేశపెట్టారు. వీటిలో ప్రయాణించే వారు 60 రోజుల ముందుగా ఇంటర్‌నెట్‌లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణపు తేదీ దగ్గరపడ్డ కొద్దీ టిక్కెట్ కొనాలనుకుంటే ధర క్రమంగా పెరుగుతుంటోంది. రైలు వచ్చే గంట ముందు కూడా టికెట్ పొందే అవకాశం ఉంది. కానీ ధర మాత్రం రెట్టింపు. ప్రీమియం రైళ్ల టికెట్లు స్టేషన్లలో ఇవ్వరు.
రామగుండంలో హాల్టింగ్ లేనట్టే
సికింద్రాబాద్-నాగపూర్ సెక్టార్లలో గంటలకు 200 కిలోమీటర్లతో వెళ్లే హైస్పీడు రైలును ప్రవేశపెట్టే యోచన కేంద్రం చేస్తోంది. వీటికి రెండు గంటల వ్యవధికి ఒక హాల్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇలాగైతే సికింద్రాబాద్-రామగుండం 220 కిలోమీటర్లు ఉండడంతో గంటలో రైలు చేరుకుంటుంది. దీన్ని బట్టి ఈ రైలు రామగుండంలో ఆగకుండా బల్లార్షాలో ఆగనున్నట్లు తెలిసింది. ఈ రైలు టిక్కెట్ ధర కూడా దాదాపుగా విమాన చార్జిలతో సమానంగా ఉండనున్నట్లు సమాచారం.
పాలవ్యాపారులకు ప్రోత్సాహం కరువు
చిరు వ్యాపారులు తమ సరుకులను సులభం గా, తక్కువ ఖర్చుతో తరలించేందుకు ప్యాసిం జర్ రైళ్లు వినియోగించుకుంటారు. జమ్మికుం ట, ఓదెల, కొలనూర్, పెద్దపల్లి నుంచి పాల వ్యాపారులు రోజు రామగిరి ప్యాసింజర్ కిటికీలకు పాలక్యాన్లు తగిలించుకుని మంచిర్యాల కు వస్తుంటారు. కాజీపేట-బెల్లంపల్లి మధ్య పుష్‌పుల్ లోకల్‌రైలు నడిపించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీకి మరో రైలు
విజయవాడ నుంచి న్యూఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఓ రైలు నడపనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విన్నపంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలిసింది. దీని ద్వారా తెలంగాణ ప్రజల అవసరాలు కొంతమేరకు తీరేలా ఉన్నాయి.
రైలు పేరు మార్పునకు సిఫారసు
హైదరాబాద్-న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు పేరును మార్చాల్సిందిగా రైల్వేశాఖను తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరుతో నూతన రైలును విజయవాడ నుంచి న్యూఢిల్లీకి నడిపించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే.